గుసగుస: సాయిపల్లవిపై నేపో కిడ్స్- పిఆర్ కుట్రలు!
ఇండియన్ సినిమా హిస్టరీలో నెవ్వర్ బిఫోర్ అనేలా.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఒక భారీ చిత్రంతో ట్యాలెంటెడ్ సౌత్ నటి సాయిపల్లవి హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 21 Jun 2026 11:30 AM ISTఇండియన్ సినిమా హిస్టరీలో నెవ్వర్ బిఫోర్ అనేలా.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఒక భారీ చిత్రంతో ట్యాలెంటెడ్ సౌత్ నటి సాయిపల్లవి హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే నేపోటిజం అతిగా ఉండే ఈ పరిశ్రమలో సాయిపల్లవి తీవ్రంగా ఇబ్బందిపడుతోందనే గుసగుస వేడెక్కిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే....
రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక దృశ్యకావ్యం `రామాయణం` షూటింగ్ శరవేగంగా పూర్తవుతున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దివాళి 2026 కానుకగా విడుదల కాబోతున్న ఈ రూ.2400 కోట్ల భారీ పాన్-ఇండియా ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా అసాధారణ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ పౌరాణిక చిత్రంలో అత్యంత కీలకమైన సీతాదేవి పాత్రను పోషిస్తున్న.. సాయి పల్లవి తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన చిత్రం గురించి పెద్దగా ప్రమోట్ చేయకపోవడం... ఇటీవల విడుదలైన అధికారిక టీజర్ గ్లింప్స్‌ను కూడా ఫీడ్ పోస్ట్‌గా షేర్ చేయకపోవడం సామాజిక మాధ్యమాల వేదికగా పెద్ద డిబేట్ కి తెర తీసింది.
ఇటీవల ప్రారంభమైన ఆన్ లైన్ చర్చలపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సాయి పల్లవిని కావాలనే బాలీవుడ్ మేకర్స్ - పీఆర్ టీమ్స్ పక్కన పెడుతున్నాయని.. తనను ప్రమోషన్ల నుండి పూర్తిగా దూరం చేస్తున్నారని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే ఈ వివాదంలోకి ఆలియా భట్ పేరును లాగుతూ... బాలీవుడ్ నెపోటిజం -అంతర్గత రాజకీయాల వల్లే సౌత్ నటి అయిన సాయి పల్లవికి సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఊహాగానాలు సృష్టిస్తున్నారు. దీనికి భిన్నంగా సాయి పల్లవి తన తోటి నటుడు ధనుష్ సినిమా ప్రమోషన్లను లేదా తన ఇతర ప్రాంతీయ చిత్రాలను సొంతంగా పోస్ట్ చేస్తూ.. ఈ భారీ ప్రాజెక్టును దాటవేయడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే సినిమా పరిశ్రమలో మార్కెటింగ్ వ్యూహాలను నిశితంగా పరిశీలిస్తే... దీని వెనుక ఒక పక్కా పీఆర్ స్ట్రాటజీ కనిపిస్తుంది. `రామాయణ` వంటి అంతర్జాతీయ స్థాయి చిత్రాల ప్రమోషన్లు పూర్తిగా ప్రొడక్షన్ హౌస్ నియంత్రణలో నడుస్తాయి. ఈ చిత్రానికి సంబంధించిన గ్లోబల్ ప్రమోషన్ల టైమ్‌లైన్ ప్రకారం.. మొదటి దశలో కేవలం హీరో రణబీర్ కపూర్, దర్శకుడు నితీష్ తివారి, ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా మాత్రమే ప్రమోషన్లలో ముందు వరుసలో ఉంటున్నారు. నటీనటులు ఎప్పుడు ఏ కంటెంట్‌ను సోషల్ మీడియాలో పెట్టాలనేది మేకర్స్ నిర్ణయించిన కఠినమైన రూల్స్ -అగ్రిమెంట్ల ప్రకారమే జరుగుతుంది తప్ప ఇక్కడ ఎవరినీ కావాలని దూరం పెట్టే పరిస్థితి ఉండదు.
మరో ప్రధానమైన అంశం సాయి పల్లవి వ్యక్తిగత నైజం వివాదాలకు దూరంగా ఉండే ప్రవర్తనను గమనించాలి. సాయి పల్లవి మొదటి నుండి చాలా సెలెక్టివ్, ప్రొఫెషనల్.. సోషల్ మీడియా హంగామాకు దూరంగా ఉండే నటి. `రామాయణ` టీజర్ విడుదలైనప్పటి నుండి విజువల్ ఎఫెక్ట్స్ - కాస్టింగ్ పై ఇంటర్నెట్‌లో కొంత నెగెటివ్ ట్రోలింగ్ కూడా నడుస్తోంది. బేసిక్ హిందీ అయినా రాని సాయిపల్లవి సీతగా నటిస్తుందా? అంటూ ఒక సెక్షన్ హిందీ ఆడియెన్ ట్రోలింగ్ చేయడం అప్పట్లో చర్చగా మారింది. ఇలాంటి సమయంలో అనవసరమైన డిజిటల్ చర్చలలో భాగం కాకుండా.. కేవలం తన పనిపై మాత్రమే శ్రద్ధ పెట్టడం ఈ ప్రతిభావనికి అలవాటు. సాధారణంగా ఏ సినిమా అయినా విడుదల మోడ్‌కు వచ్చే వరకు లేదా ప్రమోషన్లలో తన పాత్ర ప్రాధాన్యత అధికారికంగా మొదలయ్యే వరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి అంతగా ఆసక్తి చూపించని నైజం సాయిపల్లవిది.
సాయి పల్లవి తన ఇన్‌స్టాలో పోస్టులు పెట్టనంత మాత్రాన `రామాయణ` చిత్ర బృందంతో తనకు విభేదాలు ఉన్నాయని అనుకోవడం కేవలం ఫ్యాన్స్ ఊహాగానాలు మాత్రమే. మునుముందు శాన్ డియాగో కామిక్-కాన్, టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టిఐఎఫ్.ఎఫ్) వంటి అంతర్జాతీయ వేదికలపై ఈ సినిమా ప్రమోషన్లు భారీ ఎత్తున ప్లాన్ చేశారు. సినిమా విడుదల తేదీ -నవంబర్ 2026 సమీపించే కొద్దీ సీతగా సాయి పల్లవి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్స్, ప్రత్యేక ఈవెంట్స్ తో ప్రమోషన్లు కచ్చితంగా దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తాయని... అప్పటివరకు ఓపిక పట్టక తప్పదని ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
