వాళ్లిద్దరిలా సాయిపల్లవిని భన్సాలీ రెడీ చేయబోతున్నాడా?
బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ఉండే వెయిటేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
By: Srikanth Kontham | 16 March 2026 11:27 AM ISTబాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ఉండే వెయిటేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కెమెరా కంటి నుండి వచ్చే ప్రతి పాత్ర ఒక దృశ్య కావ్యంలా ఉంటుంది. తాజాగా భన్సాలీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `మధుబాల` బయోపిక్ కోసం సౌత్ ఇండియన్ సెన్సేషన్ సాయి పల్లవిని ఎంపిక చేసే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే, దీపికా పదుకొణే, అలియా భట్‌ల మాదిరిగానే సాయి పల్లవి కెరీర్ కూడా అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
గతంలో భన్సాలీ తెరకెక్కించిన `పద్మావత్` సినిమాతో దీపికా పదుకొణేకు, `గంగూబాయి కతియావాడీ`తో అలియా భట్‌కు జాతీయ స్థాయిలో అపారమైన కీర్తి ప్రతిష్టలు దక్కాయి. వారిద్దరినీ ఎలాగైతే ఐకానిక్ పాత్రల్లో భన్సాలీ తీర్చిదిద్దారో? తాజాగా సాయి పల్లవిని కూడా అదే స్థాయిలో ప్రజెంట్ చేయాలని ఆయన భావిస్తున్నారు. మధుబాల వంటి లెజెండరీ నటి పాత్రను పోషించడం అంటే కేవలం అందం మాత్రమే ఉంటే సరిపోదు. ఆ పాత్రలోని లోతును పలకించే అద్భుతమైన నటన కూడా అంతే అవసరం. అందుకే భన్సాలీ దృష్టి సాయి పల్లవిపై పడింది.
నిజానికి ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ కోసం ముందుగా కియారా అద్వానీ, అనీత్ పడ్డా వంటి బాలీవుడ్ భామల పేర్లను పరిశీలించారు. వారు గ్లామర్ పరంగా మెప్పించినప్పటికీ, మధుబాలలోని ఆ సహజమైన కళాత్మకతను, ఆ ఇంటెన్సిటీని పండించడంలో సాయి పల్లవి అయితేనే పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుందని భన్సాలీ బృందం గట్టిగా నమ్ముతోందిట. సాయి పల్లవికి ఉన్న నేచురల్ స్టార్ అనే ఇమేజ్ , అమ్మడిలో క్లాసిక్ లుక్ పాత్రకు పెద్ద అసెట్ కానున్నాయని భావిస్తున్నారు.
ఇక భన్సాలీ చిత్రాల్లో ఉండే భారీ సెట్టింగులు, కళాత్మకమైన మేకోవర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు ఒకే చేస్తే గనుక కొత్త అనుభూతిని ఇస్తాయి. ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిలా, సహజమైన పాత్రల్లో మెప్పించిన సాయి పల్లవిని ఒక వింటేజ్ లుక్‌లో, మధుబాల అవతారంలో చూడటం అభిమానులకు కనువిందుగా ఉంటుంది. కేవలం నటన మాత్రమే కాకుండా, క్లాసికల్ డ్యాన్స్‌లో సాయి పల్లవికి ఉన్న ప్రావీణ్యం కూడా ఈ బయోపిక్‌లోని సాంగ్స్ , పెర్ఫార్మెన్స్‌కు అదనపు బలంగా చెప్పొచ్చు.
ఇప్పటికే `రామాయణం` చిత్రంలో సీతమ్మగా అలరించబోతున్న సాయి పల్లవి కి మధుబాల బయోపిక్ ఒకే అయితే గనుక బాలీవుడ్‌లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకునే ఛాన్స్ ఉంది. దీపికా పదుకొణే, అలియా భట్‌ల కెరీర్‌ను మలుపు తిప్పిన భన్సాలీ ? సాయి పల్లవిని కూడా గ్లోబల్ ఐకాన్‌గా మార్చే బాధ్యతను తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కితే భారతీయ సినిమా చరిత్రలో మరో అద్భుతమైన బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం.
