Begin typing your search above and press return to search.

సాయి పల్లవి.. ఆ మూవీతో ఎంట్రీ ఇచ్చి ఉంటే..

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన నేచురల్ యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   4 May 2026 10:52 PM IST
సాయి పల్లవి.. ఆ మూవీతో ఎంట్రీ ఇచ్చి ఉంటే..
X

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన నేచురల్ యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. కానీ ఆమె నటించిన తొలి హిందీ చిత్రం ఏక్ దిన్ బాక్సాఫీస్ వద్ద నిరాశ కలిగించింది. మే 1న విడుదలైన ఆ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ చిత్రంతోనే హీరోగా అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ పరిచయమయ్యారు.

అది కాకుండా అమీర్ ఖానే నిర్మాణ బాధ్యతలు చేపట్టడం సినిమాపై హైప్ పెంచింది. సాయి పల్లవి హీరోయిన్‌ గా ఉండటంతో సౌత్, నార్త్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అయితే విడుదల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ట్రేడ్ ఎక్స్పర్ట్స్ సమాచారం ప్రకారం, ఆ సినిమా మొదటి రోజు దేశవ్యాప్తంగా కేవలం రూ. 1.37 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. రెండో రోజు ఆ సంఖ్య రూ. 1 కోటి వద్దకు పడిపోయింది.

రెండు రోజుల్లో కలిపి సుమారు రూ. 2.15 కోట్ల నెట్ మాత్రమే రావడం గమనార్హం. ఓవర్సీస్ మార్కెట్‌ లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఆ చిత్రం రెండు రోజుల్లో కేవలం రూ. 25 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు రూ. 2.82 కోట్ల గ్రాస్ వద్దే నిలిచిపోయాయి. అయితే ఆ చిత్రం థాయ్ మూవీ వన్ డేకు రీమేక్‌ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

సినిమా స్టోరీ చూసుకుంటే.. ఒక సెన్సిటివ్ లవ్ స్టోరీ. ఐటీ ఉద్యోగి దినేష్ తన సహోద్యోగి మీరాపై ప్రేమ పెంచుకుంటాడు. కానీ చెప్పలేడు. ఒక సందర్భంలో మీరా ట్రాన్సియెంట్ గ్లోబల్ ఆమ్నీషియా కారణంగా 24 గంటల జ్ఞాపక శక్తిని కోల్పోతుంది. ఆ సమయంలో ఆమెను ప్రేమలో పడేయాలనే ప్రయత్నమే కథకు మెయిన్ ఎలిమెంట్. కానీ ఆ స్టోరీని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కథనం నెమ్మదిగా సాగడం, స్ట్రాంగ్ ఎమోషన్స్ లేకపోవడం, గుర్తుండిపోయే సన్నివేశాలు లేకపోవడం వంటి అంశాలు సినిమాకు మైనస్ అయ్యాయి. పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సాయి పల్లవి తన యాక్టింగ్ తో మెప్పించినప్పటికీ, జునైద్ ఖాన్ కు ఎక్స్పీరియన్స్ లేకపోవడం మరో మైనస్ గా మారింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జపాన్ లొకేషన్లు మాత్రమే కొంతవరకు విజువల్‌ గా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో యాక్షన్, స్పై థ్రిల్లర్ సినిమాలు ట్రెండ్‌ లో ఉన్న సమయంలో ఇలాంటి స్లో ప్రేమకథ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. సరైన ప్రమోషన్లు లేకపోవడం కూడా సినిమాపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అయితే సౌత్‌ లో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ ఉన్న సాయి పల్లవి, కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ నటనకు ఇంపార్టెన్స్ ఉన్న కథలను ఎంచుకుంటూ వస్తోంది.

అయితే బాలీవుడ్‌ లో తొలి ప్రయత్నంలోనే ఎదురుదెబ్బ తగలడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా పరిస్థితి చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద నిలబడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. వీక్‌ డేస్‌ లో కలెక్షన్లు మరింత పడిపోయే సూచనలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, సాయి పల్లవి తదుపరి బాలీవుడ్ ప్రాజెక్ట్‌ అయిన రామాయణపై ఆశలు నెలకొన్నాయి. ఒకవేళ ఆమె ఆ భారీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఉండి ఉంటే, ఫలితం భిన్నంగా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి ఏక్ దిన్ మూవీ ఆమెకు ఆశించిన విజయాన్ని ఇవ్వకపోయినా, అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌ తో మెప్పించే అవకాశం మాత్రం ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.