కాజల్ వల్ల సాయి పల్లవిపై మరోసారి ట్రోలింగ్!
ఎప్పుడైతే సాయి పల్లవిని సీత పాత్ర కోసం ఎంపిక చేశారో అప్పట్నుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది.
By: Tupaki Desk | 6 July 2025 11:48 AM ISTసాయి పల్లవి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాయి పల్లవి ఏదైనా ఒక పాత్ర చేస్తున్నారంటే ఆ పాత్రకు ప్రాణం పోయడం ఖాయం. ఇంకా చెప్పాలంటే హీరోయిన్ కు అందం ముఖ్యమైనది కాదని, యాక్టింగ్ తో గ్లామర్ ను కూడా డామినేట్ చేయొచ్చని సాయి పల్లవి నిరూపించారు. ఇప్పటికే సాయి పల్లవి ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసి మెప్పించారు.
ఇక అసలు విషయానికొస్తే సాయి పల్లవి ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ రామాయణలో సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే సాయి పల్లవిని సీత పాత్ర కోసం ఎంపిక చేశారో అప్పట్నుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది. అయితే సాయి పల్లవి సీత పాత్రను పోషించడం కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం సాయి పల్లవి సీత పాత్ర చేయడం కన్విన్సింగ్ గా లేదని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
వాల్మీకి రాసిన రామాయణంలో సీతను ఎంతో గొప్పగా వర్ణించారని, వాల్మీకి ప్రకారం సీత ఎంతో అందమైన ప్రతిరూపమని, సీతను ఆకాశంలో ఉండే చంద్రకాంతితో పోల్చడంతో పాటూ భూమి నుంచి జన్మించిన లక్ష్మి అంటారని, అలాంటి సౌందర్యవతి సీతను అందం విషయంలో సాయి పల్లవి ఏ మాత్రం మ్యాచ్ చేయలేరని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.
నితేష్ తివారీ క్యాస్టింగ్ విషయంలో చాలా బ్లండర్ చేశారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రావణుడి భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ ను తీసుకోవడం నెటిజన్ల డిస్కషన్స్ కు మరింత ఆజ్యం పోస్తుంది. రావణాసురుడిగా నటించిన యష్, సీత పాత్రలో కనిపించే సాయి పల్లవి అందం కోసం, మండోదరిగా కనిపించే కాజల్ ను ఎందుకు వదులుకుంటారని ప్రశ్నిస్తూ విమర్శలు చేస్తున్నారు.
అయితే కొందరు సాయి పల్లవిని విమర్శిస్తున్నప్పటికీ మరికొందరు ఆమెకు ఈ విషయంలో మద్దతిస్తున్నారు. సీత పాత్రకు సాయి పల్లవి కేవలం అందంతోనే కాకుండా ఆమె నటనతో ప్రాణం పోస్తారని, ఎమోషనల్ గా సాయి పల్లవి ఆ పాత్రను అందరికీ కనెక్ట్ అయ్యేలా చేస్తారని తమ వాదనలను వినిపిస్తున్నారు. తన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ తో సాయి పల్లవి ఇప్పటికే నటిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నారని ఇప్పుడు సీత పాత్రలో అందరినీ మెప్పించి నటిగా మరో మెట్టు ఎక్కుతారని పేర్కొంటున్నారు. ఎంతో అనుభవమున్న డైరెక్టర్ నితేష్ తివారీ ఇలాంటివేవీ ఆలోచించకుండానే సీత పాత్రకు ఆమెను సెలెక్ట్ చేయరు కదా అని సాయి పల్లవిని సపోర్ట్ చేస్తూ విమర్శకులను ప్రశిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా, మొదటి భాగం ఈ దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానున్నాయి.