AA22: ఎవరీ సాయి అభ్యంకర్.. బ్యాక్ గ్రౌండ్ ఉంది కానీ..
అలాంటి ప్రాజెక్ట్‌లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా పూర్తి చేయని సాయి అభ్యంకర్‌కు అవకాశం వస్తుండడం నిజంగా సెన్సేషనల్.
By: Tupaki Desk | 10 April 2025 10:52 AM ISTఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ వల్ల జీవితమే మారిపోతుంది. అలాంటి అదృష్టం కలిసొచ్చింది 20 ఏళ్ల యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌కు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌కి మ్యూజిక్ ఇవ్వనున్నాడని బలమైన టాక్ వినిపిస్తోంది. అఫీషియల్ క్లారిటీ రాకపోయినా అట్లీ మనసు మొత్తం అతనిపైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక AA22 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ సినిమా బడ్జెట్ దాదాపు రూ.600 కోట్ల దాకా ఉండొచ్చని టాక్.
అలాంటి ప్రాజెక్ట్‌లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా పూర్తి చేయని సాయి అభ్యంకర్‌కు అవకాశం వస్తుండడం నిజంగా సెన్సేషనల్. ఈ యువకుడి గురించి గూగుల్‌లో వెతికితే బహుశా ఒక్క సినిమా వివరాలు కూడా కనిపించకపోవచ్చు. కానీ యూట్యూబ్‌లో మాత్రం మ్యూజిక్ సింగిల్స్ రూపంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. 2024లో విడుదలైన ‘కట్చి సేరి’ అనే తమిళ మ్యూజిక్ వీడియోకి సాయి కంపోజ్ చేసిన ట్యూన్ 220 మిలియన్ వ్యూస్ దాటింది.
ఆ తర్వాత వచ్చిన ‘ఆశ’ అనే సాంగ్ అయితే 245 మిలియన్ వ్యూస్ సాధించింది. అదే సమయంలో మీనాక్షి చౌదరి నటించిన ‘సితిరా పుతిరి’ అనే మ్యూజిక్ సింగిల్‌కి కూడా మ్యూజిక్ సాయి అభ్యంకర్‌దే. సాయి అభ్యంకర్‌కి సంగీతం పట్ల ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉంది. ఎందుకంటే అతడి తండ్రి టిప్పు ప్లేబ్యాక్ సింగర్.
చిరుత (యమహా యమ్మ), జులాయి(చక్కని బైక్ ఉంది), నువ్వు నాకు నచ్చావ్ (ఉన్నమాట చెప్పనీవు) వంటి చిత్రాల్లో టిప్పు పాడిన పాటలు మాస్ లో బాగా హిట్ అయ్యాయి. అలాగే సాయి తల్లి హరిణి కూడా సీనియర్ సింగర్. మణిశర్మ, రెహమాన్ నుంచి తమన్, దేవిశ్రీ ప్రసాద్ వరకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతో పాటలు పాడిన ఆమె పేరు కూడా గుర్తుండిపోయేలా ఉంది. అలాంటి సంగీత కుటుంబంలో పుట్టిన సాయి అభ్యంకర్‌కు టాలెంట్ వారసత్వంగా వచ్చింది.
అయితే బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఒక్క పాట కూడా సినిమా రేంజ్‌లో రిలీజ్ కాకముందే అల్లు అర్జున్, అట్లీ లాంటి ప్రాజెక్ట్‌లలో ఛాన్స్ రావడం వెనక అతని వర్క్ మీద నమ్మకమే అసలు కారణం. ఇప్పటివరకు అనిరుధ్ రవిచందర్ దగ్గర బీజీఎం అసిస్టెంట్‌గా పని చేసిన సాయి.. దేవర, కూలీ వంటి చిత్రాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్‌లో వర్క్ చేశాడు. ఈ అనుభవమే అతనికి నెట్‌వర్క్‌ను తెచ్చిపెట్టింది. టెక్నికల్ నాలెడ్జ్‌లో అతని పట్టు ఉన్నందునే అతడిని భారీ బడ్జెట్ AA22 సినిమాకు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా లారెన్స్ హీరోగా వస్తున్న ‘బెంజ్’ సినిమాకు కూడా సాయి అభ్యంకర్‌నే సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. అంతేకాదు సూర్య, ఆర్జే బాలాజీ కాంబోలో రూపొందే సినిమాతో పాటు ప్రదీప్ రంగనాథన్ మమితా బైజు సినిమా కూడా అతడి ఖాతాలో ఉంది. ఇంకా చిన్న వయసులోనే ఇన్ని ప్రాజెక్టులు అగ్ర దర్శకుల చేతిలో రావడం అనేది ఎంత పెద్ద అవకాశం అనేది చెప్పాల్సిన అవసరం లేదు.
మొత్తంగా చెప్పాలంటే, సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి ఒక్క అడుగు కూడా పెట్టకముందే ఈ స్థాయిలో ఛాన్సులు దక్కించుకోవడం అసాధారణం. అందులో AA22 లాంటి భారీ ప్రాజెక్ట్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం అంటే సాయి అభ్యంకర్ మీద ఉన్న నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ యువ సంగీత దర్శకుడు ఇంతటి అంచనాలను ఎలా నెరవేర్చతాడో చూడాలి.
