Begin typing your search above and press return to search.

మాలీవుడ్ లోకి టాలీవుడ్ ప్రొడ్యూసర్.. డెబ్యూ సక్సెస్..

షైన్ స్క్రీన్స్ బ్యానర్ అధినేత అయిన సాహు గారపాటి.. రీసెంట్ గా మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. వ్యసన సమేతం బంధుమిత్రాదికల్ సినిమాను నిర్మించారు.

By:  Tupaki Desk   |   20 Jun 2025 1:46 PM IST
మాలీవుడ్ లోకి టాలీవుడ్ ప్రొడ్యూసర్.. డెబ్యూ సక్సెస్..
X

సినీ పరిశ్రమలో పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయ్యాక.. ఓ ఇండస్ట్రీకి చెందిన దర్శకులు, నిర్మాతలు, హీరోలు సహా అంతా.. వేరే ఇండస్ట్రీకి వెళ్ళి లక్ టెస్ట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో చాలా మంది డెబ్యూతోనే మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా ఫోకస్ పెడుతున్నారు. ఆ లిస్ట్ లో మరో తెలుగు ప్రొడ్యూసర్ చేరారు.

నేచురల్ స్టార్ నాని కృష్ణార్జున యుద్ధం మూవీతో నిర్మాతగా మారిన సాహు గారపాటి.. ఇప్పటికే తెలుగులో వివిధ చిత్రాలను నిర్మించారు. మజిలీ, టక్ జగదీష్, ఉగ్రం సినిమాలను రూపొందించిన ఆయన.. నటసింహం బాలకృష్ణతో భగవంత్ కేసరి తీసి సూపర్ హిట్ అందుకున్నారు. రీసెంట్ గా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా లైలా మూవీని నిర్మించారు.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న మెగా 157 ప్రాజెక్టుకు ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ అధినేత అయిన సాహు గారపాటి.. రీసెంట్ గా మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. వ్యసన సమేతం బంధుమిత్రాదికల్ సినిమాను నిర్మించారు.

అనశ్వర రాజన్ ప్రధాన పాత్రలో నటించిన ఆ మూవీకి సహా నిర్మాతగా వ్యవహరించగా.. జూన్ 13వ తేదీన సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న ఆ మూవీ.. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఇప్పుడు హైదరాబాద్ లోని వివిధ మలీప్లెక్సుల్లో కూడా ప్రదర్శితమవుతోంది.

అంత్యక్రియల నేపథ్యంలో రూపొందిన ఆ మూవీ.. డార్క్ కామెడీ జోనర్ లో తెరకెక్కింది. కుటుంబ సంబంధాలు, సామాజిక చిత్రాలు వంటి వివిధ ఇతివృత్తాల ఆధారంగా రూపొందింది. ఎస్ విపిన్ సినిమాకు దర్శకత్వం వహిస్తూ.. నిర్మాణంలో కూడా భాగమయ్యారు. మొత్తానికి డెబ్యూతో మాలీవుడ్ లో సక్సెస్ అందుకున్నారు సాహు గారపాటి.

అయితే ఇప్పటికే చాలా మంది తెలుగు నిర్మాతలు ఇతర చిత్ర పరిశ్రమల్లో అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇటీవల కాలంలో అల్లు అరవింద్, దిల్ రాజు రెండు హిందీ చిత్రాలను నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్.. తమిళంలో గుడ్ బ్యాడ్ అగ్లీ, మలయాళంలో నదికర్ చిత్రాలు నిర్మించింది. కోలీవుడ్‌ లో మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌ లో పెట్టింది. మరి సాహు గారపాటి.. మిగతా ఇండస్ట్రీల్లోకి కూడా వెళ్తారేమో వేచి చూడాలి.