Begin typing your search above and press return to search.

సమకాలీన సవాళ్లు - సుస్థిర ఆహారం!

ప్రస్తుత ఆధునిక సమాజంలో పర్యావరణ పరిరక్షణ.. నేల ఉత్పాదకతపై అవగాహన పెంచడం అత్యంత ఆవశ్యకమైన అంశాలుగా మారాయి.

By:  Srikanth Kontham   |   4 Jun 2026 11:01 AM IST
సమకాలీన సవాళ్లు - సుస్థిర ఆహారం!
X

ప్రస్తుత ఆధునిక సమాజంలో పర్యావరణ పరిరక్షణ.. నేల ఉత్పాదకతపై అవగాహన పెంచడం అత్యంత ఆవశ్యకమైన అంశాలుగా మారాయి. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక గురువు.. ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్- హాలీవుడ్ వెబ్ సిరీస్ `ది వాంపైర్ డైరీస్` స్టార్ ఇయాన్ సోమర్‌హాల్డర్‌తో కలిసి ఓ ప్రత్యేక వేదికపై సందడి చేశారు. పర్యావరణ సుస్థిరత, పునరుత్పాదక వ్యవసాయం వంటి అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాల గురించి చర్చించడానికి ఇద్ద‌రు ఒకచోట చేరడం సోష‌ల్ మీడియాలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. భిన్న రంగాలకు చెందిన అరుదైన కలయికను చూసి నెటిజన్లు ఓ అద్భుతమైన మల్టీవర్స్ క్రోసోవర్ అని అభివర్ణిస్తున్నారు.

ఈ సంభాషణలో భాగంగా ఇద్ద‌రు ఓ ఆసక్తికరమైన ప్రయోగాన్ని నిర్వహించారు. రసాయన ఎరువులతో పండించిన పంటలకు .. సహజసిద్ధమైన సేంద్రీయ పద్ధతుల్లో పండించిన ఆహార పదార్థాలకు మధ్య గల రుచి వ్యత్యాసాన్ని గుర్తించేందుకు బ్లైండ్ టేస్ట్ టెస్ట్ చేసారు. ఈ సందర్భంగా ఇయాన్ సోమర్‌హాల్డర్ స్థానిక వ్యవసాయ క్షేత్రం నుండి వచ్చిన ఆహారానికి, సూపర్ మార్కెట్ నుండి తెచ్చిన ఆహారానికి గల తేడాను చూద్దామని అనగా? సద్గురు వెంటనే అతనిని సరిదిద్దారు. ఏ ఆహారమూ సూపర్ మార్కెట్‌లో పుట్టదని, రెండు రకాల ఆహారాలు పొలాల నుంచే వస్తాయని.. ఒక‌టి పోషకాలతో కూడిన సేంద్రీయ ఆహారమైతే.. మరొకటి రసాయన ఎరువుల ప్రభావం ఉన్న ఆహారమని చెప్ప‌డం అంద‌ర్నీ ఆలోచ‌న‌లో ప‌డేసింది.

ఈ రుచి పరీక్షలో భాగంగా బ్లూబెర్రీస్.. టమోటాలు.. స్ట్రాబెర్రీలు .. క్యారెట్లను పరీక్షించారు. ఇద్దరూ కూడా కచ్చితత్వంతో సేంద్రీయ పద్ధతిలో పండించిన పండ్ల స్వచ్ఛమైన రుచిని, ఎరువులతో పండించిన వాటితో పోల్చి వేరు చేయగలిగారు. అయితే సూర్యాస్తమయం తర్వాత కీరా దోసకాయను తినడానికి సద్గురు నిరాకరించడం ప్రకృతి నియమాలకు .. సంప్రదాయ జీవన విధానానికి ఆయన ఇచ్చే ప్రాధాన్యతను నిరూపించింది. రసాయన ఎరువుల వాడకం వల్ల ఆహారంలో సహజసిద్ధమైన రుచి .. జీవశక్తి ఏ విధంగా లోపిస్తాయో ఈ ప్రయోగం ద్వారా నిరూపించారు.

ఈ సంభాషణ రుచులకే పరిమితం కాకుండా నేల యోక్క నాణ్యతపై లోతైన చర్చకు దారితీసింది. నేలలోని సేంద్రీయ పదార్థాలే మానవ ఆరోగ్యానికి మూలాధారమని ఇయాన్ నొక్కిచెప్పారు. దీనికి మద్దతుగా సద్గురు మాట్లాడుడారు. భవిష్యత్ తరాల ఆరోగ్యం కోసం మనం తీసుకునే ఆహార నాణ్యత ఎంతో కీలకమని పేర్కొన్నారు. సేంద్రీయ పద్ధతిలో పండించిన నాణ్యమైన యాపిల్ పండు, ఎరువులతో పండించిన నాలుగు సాధారణ యాపిల్స్ కంటే ఎంతో మేలైనదన్నారు. ఇందుకోసం కొంచెం ఎక్కువ ఖర్చయినా పర్వాలేదని అభిప్రాయపారు. ఇది మన ఆహార ఎంపికలలో నాణ్యతకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను గుర్తుచేస్తుంది.

అలాగే సామాజిక అంశాల గురించి చ‌ర్చించారు. ఇద్ద‌రి మధ్య సాగిన హాస్యభరిత సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సంభాషణ ముగింపులో.. ఇయాన్ సరదాగా సద్గురును మెక్‌డొనాల్డ్స్‌కు డేట్‌కు తీసుకెళ్తానని అనగా దానికి సద్గురు చమత్కారంగా స్పందించారు. నన్ను విందు ఫ్యాక్టరీకి ఎందుకు తీసుకెళ్లకూడదు? అని అనడం అక్కడ నవ్వులు పూయించింది. ఈ తరహా సరదా సంభాషణలు పర్యావరణం వంటి తీవ్రమైన సవాళ్లను సాధారణ ప్రజలకు కూడా సులభంగా చేరవేయడానికి దోహదపడతాయి.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఓ ఆధ్యాత్మిక వేత్త - విదేశీ నటుడు కలిసి పర్యావరణ సంరక్షణ కోసం చేతులు కలపడం నేటి కాలంలో ఓ సానుకూల పరిణామం. సాంఘిక మాధ్యమాల్లో వీరి కలయికపై విపరీతమైన స్పందన లభించింది. ఇది ఊహించని సరికొత్త కాంబినేషన్ అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.`సేవ్ సాయిల్` వంటి పర్యావరణ ఉద్యమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇలాంటి అంతర్జాతీయ సహకారాలు ఎంతో అవసరమని చెప్పొచ్చు.