Begin typing your search above and press return to search.

జానకమ్మ బ్రతికుండగానే ఇంత నరకం చూసిందా?

కొడుకు చనిపోయిన ఐదు నెలల వ్యవధిలోనే, వయోధిక సమస్యలు మరియు గుండెపోటుతో జూలై 11 న జానకమ్మ మైసూరులోని ఆస్పత్రిలో కన్నుమూశారు.

By:  Madhu Reddy   |   14 July 2026 9:44 PM IST
జానకమ్మ బ్రతికుండగానే ఇంత నరకం చూసిందా?
X

వేలాది మధుర గీతాలతో కోట్లాది మంది గుండెలను రంజింపజేసిన దక్షిణాది గానకోకిల ఎస్. జానకి గారు శనివారం (జులై 11న ) శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. అయితే, తెర వెనుక ఆమె జీవితంలో జరిగిన వరుస విషాదాలు చూస్తే ఎవరి గుండె అయినా చెరువవుతుంది. భర్త, మనవరాలు, చివరకు కంటికి రెప్పలా చూసుకున్న ఏకైక కుమారుడిని కోల్పోయి, ఆమె బ్రతికుండగానే ఎంత నరకయాతన అనుభవించారో తలుచుకుంటే అభిమానుల కళ్లు చెమర్చుతున్నాయి. ఆ ఎమోషనల్ ప్రయాణం చూద్దాం..

భర్త మరణంతో మొదలైన విషాదం:

జానకమ్మ గాన ప్రస్థానం ఎంత ఘనంగా సాగిందో, ఆమె పర్సనల్ లైఫ్ అంత ప్రశాంతంగా సాగలేదు. 1959లో వి. రామ్ ప్రసాద్‌ను పెళ్లాడిన ఆమె, ఆయన ప్రోత్సాహంతోనే సంగీత ప్రపంచంలో శిఖరాలను తాకారు. కానీ 1997లో భర్త రామ్ ప్రసాద్ అకాల మరణం ఆమెను తీవ్రంగా కుంగదీసింది. ఇక ఆ బాధను తట్టుకుంటూనే పాటను శ్వాసగా మలచుకుని ఆమె ముందుకు సాగారు.

తీరని లోటు.. మనవరాలి మృతి:

ఎంతో ఇష్టంగా, గారాలపట్టిలా పెంచుకున్న పెద్ద మనవరాలు వర్ష 2023 లోనే కన్నుమూశారు. అసలే వయోభారంతో బాధపడుతున్న జానకమ్మకు ఈ వార్త పిడుగులాంటిదే. ఇక ఒకరి తర్వాత ఒకరిని కోల్పోతున్న బాధలో ఉన్న ఆమెకు కంటి నిండా నిద్ర కూడా కరువైంది. అయినప్పటికీ, ఉన్న ఒక్కగానొక్క కొడుకే తన సర్వస్వంగా భావిస్తూ ఆమె కాలం వెళ్లదీశారు.

కొడుకును కూడా దూరం చేసిన కాలం:

తీరని శోకంలో ఉన్న జానకమ్మ జీవితంలో విధి మరో పెద్ద దెబ్బ కొట్టింది. ఆమె ఏకైక కుమారుడు మురళీ కృష్ణ (65) ఈ ఏడాది ప్రారంభంలో, అంటే ఈ ఏడాది జనవరి 22 న తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక కళ్ల ముందే కొడుకు శవాన్ని చూడాల్సి రావడం ఒక తల్లికి నరకం కంటే దారుణం. ఈ ఘోర విషాదంతో ఆమె మానసికంగా, శారీరకంగా పూర్తిగా కృశించిపోయారు.

ఐదు నెలల వ్యవధిలోనే అనంత వాయువుల్లోకి:

ఒకే ఇంట్లో వరుసగా జరిగిన చావులు జానకమ్మను జీవచ్ఛవంలా మార్చేశాయి. కొడుకు చనిపోయిన ఐదు నెలల వ్యవధిలోనే, వయోధిక సమస్యలు మరియు గుండెపోటుతో జూలై 11 న జానకమ్మ మైసూరులోని ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆ విధి చూపిన నరకయాతనను భరించలేక, చివరకు ఆమె కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

జానకమ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆమె పాడిన 50 వేలకు పైగా అమర గీతాలు ఎప్పటికీ మన గుండెల్లో సజీవంగానే ఉంటాయి. ఇక ఆ గానకోకిలకు అన్ని బాధల నుంచి విముక్తి లభించి, ఆత్మకు ప్రశాంతత చేకూరాలని కోరుకుందాం.