Begin typing your search above and press return to search.

శ్రీ‌ను వైట్ల సినిమా కంటే ఆ హ‌డావిడి మ‌రీ ఎక్కువైన‌ట్టుందే!

దాదాపు ఐదేళ్ల విరామం త‌రువాత మ్యాచో మ్యాన్ గోపీచంద్ హీరోగా కొత్త సినిమాకు శ్రీ‌కారం చుట్టారు. వేణు దోనేపూడి చిత్రాల స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు.

By:  Tupaki Desk   |   13 Oct 2023 10:23 AM GMT
శ్రీ‌ను వైట్ల సినిమా కంటే ఆ హ‌డావిడి మ‌రీ ఎక్కువైన‌ట్టుందే!
X

శ్రీ‌ను వైట్ల త‌న‌దైన మార్కు కామెడీతో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాల్ని సాధించాయి. ఒక ద‌శ‌లో తిరుగులేని స్టార్ డైరెక్ట‌ర్‌గా ఆయ‌న‌ని నిలబెట్టాయి. 'నీ కోసం' వంటి సినిమాతో మొద‌లైన ఆయ‌న ప్ర‌యాణం 'దూకుడు' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ వ‌ర‌కు విజ‌య‌వంతంగా సాగిన వైట్ల ప్ర‌యాణానికి `ఆగ‌డు` డిజాస్ట‌ర్‌తో బిగ్ బ్రేక్ ప‌డింది. ఆ త‌రువాత చేసిన బ్రూస్‌లీ, మిస్ట‌ర్‌, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ వంటి సినిమాలు వ‌రుస ఫ్లాపులుగా నిలిచి శ్రీ‌ను వైట్ల కెరీర్‌ని ప్ర‌శ్నార్థకంలో ప‌డేశాయి.

దీంతో ఒక్క‌సారిగా షాక్‌కు గురైన శ్రీ‌ను వైట్ల అప్ప‌టి నుంచి సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. దాదాపు ఐదేళ్ల విరామం త‌రువాత మ్యాచో మ్యాన్ గోపీచంద్ హీరోగా కొత్త సినిమాకు శ్రీ‌కారం చుట్టారు. వేణు దోనేపూడి చిత్రాల స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. హీరో గోపీచంద్ 32వ ప్రాజెక్ట్‌గా మొద‌లైన ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం మిలాన్‌లో జ‌రుగుతోంది. `దూకుడు` సినిమాని ఇక్క‌డే శ్రీ‌ను వైట్ల పూర్తి చేశాడు. అదే సెంటిమెంట్‌తో గోపీచంద్ సినిమాని కూడా మిలాన్‌లో చేస్తున్నాడు.

సెప్టెంబ‌ర్ 9న హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. శ్రీ‌ను వైట్లతో పాటు ఈ సినిమా హీరో గోపీచంద్ కెరీర్‌కు అత్యంత కీల‌కంగా మారింది. చాలా రోజుల త‌రువాత గోపీ మోహ‌న్ ఈ సినిమాకు ప‌ని చేస్తున్నారు. ఏ సినిమా షూటింగ్‌కు ఇంత హ‌డావిడి చేయ‌ని శ్రీ‌ను వైట్ల ఈ మూవీ విష‌యంలో మాత్రం చాలా హ‌డావిడి చేస్తూ క‌నిపిస్తున్నారు. ప్ర‌తి షెడ్యూల్‌కు ఆన్ లొకేష్ వీడియోకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేస్తూ నానా హంగామా సృష్టిస్తున్నారు.

ఇదికాస్త ఓవ‌ర్‌గా అనిపిస్తోంద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. గోపీచంద్ పాల్గొన‌గా కీల‌క ఘ‌ట్టాల‌ని మిలాన్ సిటీలో చిత్రీక‌రించామ‌ని, ఫైన‌ల్‌గా షూటింగ్ పూర్త‌యింద‌ని తెలియ‌జేస్తూ టీమ్ శుక్ర‌వారం ఓ వీడియోని విడుద‌ల చేసింది. గోపీచంద్ పాల్గొన‌గా కీల‌క ఘ‌ట్టాల‌తో పాటు ఓ పాట‌ని, ప‌లు యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించిన‌ట్టుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇలాంటి వీడియోల‌ని టీమ్ వ‌ద‌ల‌డంతో సినిమా షూటింగ్‌ని మించి ఇలాంటి వీడియోల హ‌డావిడే మ‌రీ ఎక్కువైంద‌నే సెటైర్లు వినిపిస్తున్నాయి.