సౌత్ నెక్ట్స్ స్టార్ ఆమేనా?
సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు స్టార్‌డమ్, క్రేజ్ వస్తాయో ఎవరూ చెప్పలేం. కొంతమందికి ఒక్క సినిమాతోనే క్రేజ్ వస్తే, మరికొంత మందికి మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్నో ఏళ్లకు ఆ క్రేజ్, పాపులారిటీ వస్తాయి.
By: Tupaki Desk | 30 May 2025 9:00 PM ISTసినీ ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు స్టార్‌డమ్, క్రేజ్ వస్తాయో ఎవరూ చెప్పలేం. కొంతమందికి ఒక్క సినిమాతోనే క్రేజ్ వస్తే, మరికొంత మందికి మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్నో ఏళ్లకు ఆ క్రేజ్, పాపులారిటీ వస్తాయి. అయితే కన్నడ భామ రుక్మిణి వసంత్‌కు మాత్రం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే సరైన గుర్తింపు, క్రేజ్ తో పాటూ అవకాశాలు కూడా వస్తున్నాయి.
రుక్మిణి వసంత్ కు తక్కువ కాలంలోనే నటిగా మంచి ప్రశంసలొచ్చాయి. సప్త సాగారాలు దాటి సైడ్ ఎ, సైడి బి సినిమాల్లో నటించి అందరినీ తన నటనతో మెప్పించిన రుక్మిణి వసంత్ రీసెంట్ టైమ్స్ లో కన్నడ, తమిళ సినిమాల్లో నటించింది. నిఖిల్ తో కలిసి అపుడో ఇపుడో ఎపుడో అనే తెలుగు సినిమా కూడా చేసింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపు గా నిలిచింది.
అయినప్పటికీ రుక్మిణికి బంపరాఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో రుక్మిణి వసంత్‌నే హీరోయిన్. ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ జరుపుకుంటున్న డ్రాగన్ సినిమా షూటింగులో ఇంకా రుక్మిణి జాయిన్ అవలేదు. డ్రాగన్ తో పాటూ మరో క్రేజీ ప్రాజెక్టులో కూడా రుక్మిణి హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ను తీసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండూ కాకుండా థగ్ లైఫ్ సినిమా తర్వాత మణిరత్నం దర్శకత్వంలో శింబు చేయబోయే ప్రాజెక్టులో కూడా రుక్మిణి వసంత్‌నే హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఈ ప్రిస్టిజియస్ ప్రాజెక్టులతో పాటూ రుక్మిణి వసంత్ మరిన్ని తెలుగు, తమిళ సినిమాల కోసం రుక్మిణి పేరుని పరిశీలిస్తున్నారట. త్రివిక్రమ్, మణిరత్నం లాంటి అగ్ర డైరెక్టర్లు రుక్మిణి వైపు చూడటంతో ఆమె క్రేజ్ మరింత పెరుగుతుంది. అయితే రుక్మిణి ఈ సినిమాలకు సైన్ చేస్తే త్వరలోనే అమ్మడు స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లడం ఖాయం.
