Begin typing your search above and press return to search.

#RT4GM .. ఆపేశారంటూ..!

ర‌వితేజ‌-గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో మైత్రి సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభం కావాల్సి ఉండ‌గా ఈ పుకార్ వేడెక్కిస్తోంది.

By:  Tupaki Desk   |   23 Nov 2023 3:35 AM GMT
#RT4GM .. ఆపేశారంటూ..!
X

మాస్ మ‌హారాజా ర‌వితేజ రేంజ్ అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ప‌రిశ్ర‌మ‌ను ఏల్తున్న హీరోల్లో అత‌డి పేరు సుస్థిరంగా ఉంది. కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత కూడా కెరీర్ ని బౌన్స్ బ్యాక్ చేసిన ఘ‌న‌త రాజాకు ఉంది. అందుకే ఇటీవ‌ల టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఫ్లాపైనా కానీ అత‌డి మార్కెట్ పై దాని ప్ర‌భావం ప‌డ‌లేదు.

అయితే ఇప్పుడు మైత్రి మూవీ మేక‌ర్స్ తో భారీ చిత్రం నిలిచిపోయింద‌ని పుకార్ షికార్ చేస్తోంది. ర‌వితేజ‌-గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో మైత్రి సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభం కావాల్సి ఉండ‌గా ఈ పుకార్ వేడెక్కిస్తోంది. మేకర్స్ ఇటీవ‌ల‌ సోషల్ మీడియాలో ప్రత్యేకమైన పద్ధతిలో కీలక సిబ్బంది వివరాలను ఆవిష్కరించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 22నవంబ‌ర్ లో ప్రారంభం కావాల్సి ఉండగా క్యాన్సిల్ అయ్యింది. దీంతో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తొలుత అనుకున్న‌ భారీ బడ్జెట్‌పై పునరాలోచనలో పడిందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కొన్ని సోషల్ మీడియాల్లో సినిమా ఆగిపోయింద‌ని కూడా ప్ర‌చారం సాగించారు. కొంద‌రు తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత బడ్జెట్, నాన్-థియేట్రికల్, హిందీ మార్కెట్‌లలో కొనసాగుతున్న కరెక్షన్‌లతో సింక్ కావ‌డం లేద‌ని నిర్మాతలు భావిస్తున్నారని కూడా కొన్ని మీడియాల్లో ప్ర‌చురించాయి. అనేక చిత్రాలు మార్కెటింగ్ ప‌రంగా పునఃచర్చలలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కొత్త ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సహాయం చేయడానికి మరింత జాగ్రత్తతో కూడిన విధానం ప‌రిశ్ర‌మ‌లో ఉంది.. అని టాక్ వినిపించింది.

అయితే ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ఇప్పట్లో కాకుండా డిసెంబర్‌లో ప్రారంభమవుతుందని సన్నిహితులు చెబుతున్న‌ట్టు తెలిసింది. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ర‌వితేజ త‌న స్థాయిని ఆస్వాధిస్తున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో ఈ పుకార్లు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి.

తాత్కాలిక టైటిల్ :

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేష‌న్ నాలుగో చిత్రం తాత్కాలికంగా RT4GM పేరుతో సెట్స్ కి వెళ్లాల్సి ఉంది. డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి హిట్‌లతో వారి ట్రాక్ రికార్డ్ అసాధార‌ణంగా ఉంది. అందుకే నాలుగో సారి ఈ క‌ల‌యిక‌పై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఇక ర‌వితేజ న‌టించిన వేరొక‌ చిత్రం డేగ 12 జనవరి 2024న విడుదలకు సిద్ధంగా ఉంది.

రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ర‌వితేజ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టిస్తార‌ని తెలిసింది. మోస్ట్ అవైటెడ్ RT4GM తారాగణం -సిబ్బందిని .. అభిమానులలో ఉత్సాహం స్థాయిలను పెంచింది. నటుడిగా మారిన ద‌ర్శ‌కుడు సెల్వరాఘవన్ ఈ ప్రాజెక్ట్‌తో తెలుగు సినిమా రంగ ప్రవేశం చేస్తుండ‌గా, ప్రతిభావంతులైన ఇందుజా రవిచంద్రన్ కీలక పాత్రలో నటించనున్నారు. క‌థానాయిక ఎవ‌రో ఇంకా ప్రకటించాల్సి ఉంది. RT4GM కథాంశం నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందిన శక్తివంతమైన కథతో తెర‌కెక్క‌నుంద‌ని కూడా తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తారు. రవితేజతో అతడి 12వ సినిమా అవుతుంది. గోపీచంద్ మలినేనితో 4వ కలయిక. బిగిల్ - మెర్సల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు పనిచేసిన ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ జికె విష్ణు ఈ ప్రాజెక్ట్‌కి తన విజువల్ మ్యాజిక్‌ను తీసుకురానున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న ఎడిటర్ నవీన్ నూలి కూడా ఈ చిత్రానికి తన వ‌ర్క్ ని అందించనున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.

రవితేజ- గోపీచంద్ మలినేని 2010లో డాన్ శీను కోసం క‌లిసి ప‌ని చేసారు. 2013లో బలుపు .. 2021లో క్రాక్ వంటి హిట్ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకోవ‌డ‌మే గాక‌, వాణిజ్యపరమైన విజయాన్ని అందుకున్నారు. RT4GM కోసం వారి పునఃకలయిక ఎగ్జ‌యిట్ మెంట్ పెంచింది. ఈ డైనమిక్ జోడీ ఈసారి ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తారో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.