ప్రముఖ నటుడు శివాజీ మృతి
తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఆర్ ఎస్ శివాజీ (66) కన్నుమూశారు.
By: Tupaki Desk | 2 Sept 2023 6:58 PM ISTతమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఆర్ ఎస్ శివాజీ (66) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివాజీ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో కోలీవుడ్ లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శివాజీ వందకిపై గా సినిమాల్లో నటించారు.
శివాజీ ప్రముఖ నిర్మాత ఎంఆర్ సంతానం కుమారుడు కాగా... ఆయన సోదరుడు సంతాన భారతి కోలీవుడ్ లో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 1981లో `పన్నీరు పుష్పాలు` చిత్రంతో తెరంగేట్రం చేసారు. ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా కమల్ హాసన్ బ్యానర్ అయిన రాజ్ కమల్ బ్యానర్ లో ఎక్కువ సినిమాలు చేసారు. కమల్ తో శివాజీకి మంచి అనుబంధం ఉంది.
ఆ సాన్నిహిత్యంతోనే ఎక్కువ సినిమాలు చేసారు. `విక్రమ్`..`సత్య`..` అపూర్వ సగోదరగళ్`.. `గుణ`..`చాచి 420` లాంటి చిత్రాల్లో నటించారు. ఈసినిమాలన్ని తెలుగులోనూ అనువాదమవ్వడంతో ఇక్కడా మంచి గుర్తింపు దక్కింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన `జగదీక వీరుడు అతిలోక సుందరి` తో తెలుగులో లాంచ్ అయ్యారు. అందులో మాలోకం అనే కానిస్టేబుల్ పాత్ర పోషించారు.
అలాగే తేజ దర్శకత్వంలో వచ్చిన `1000 అబద్దాలు`లోనూ నటించారు. సాయి పల్లవి నటించిన `గార్గి` చిత్రంలో ఆమె తండ్రి పాత్ర పోషించారు. ఆ పాత్రకి మంచి పేరొచ్చింది. ఇక బుల్లి తెరపైనా శివాజీ మార్క్ ఉంది. చాలా టీవీ సీరియల్స్ లో నటించారు.
