టాలీవుడ్ సెలబ్రిటీలతో RSS చీఫ్ చర్చలు.. ఏంటి సంగతి?
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉంటారు. తమ సంస్థకు సంబంధించిన కార్యక్రమాలు సహా ఇతర ఈవెంట్స్ లో పాల్గొంటూ దేశమంతా తిరుగుతూనే ఉంటారు.
By: M Prashanth | 1 Feb 2026 4:51 PM ISTఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉంటారు. తమ సంస్థకు సంబంధించిన కార్యక్రమాలు సహా ఇతర ఈవెంట్స్ లో పాల్గొంటూ దేశమంతా తిరుగుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా హైదరాబాద్ కు వచ్చారు. అయితే ఆయన హైదరాబాద్ పర్యటనలో రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న మోహన్ భగవత్, ఈసారి సాధారణ కార్యక్రమాలతో పాటు ప్రముఖులతో ప్రత్యేక భేటీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా టాలీవుడ్ అగ్రహీరోలు, నిర్మాతలు, పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారులతో సమావేశం కావడం ఇప్పుడు రాజకీయంగా, వ్యూహాత్మకంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్ లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నివాసంలో కీలక సమావేశం జరిగినట్లు సమాచారం. ఆ భేటీలో అక్కినేని నాగార్జున, నాని, రానా దగ్గుబాటి, వరుణ్ తేజ్, రామ్ పోతినేని, తేజ సజ్జా వంటి ప్రముఖ హీరోలతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్, రవిశంకర్, నిర్మాత సాహు గారపాటి తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమకు చెందిన సుమారు 40కి పైగా ప్రముఖులు హాజరయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఆ సమావేశం మర్యాదపూర్వకంగానే జరిగిందని చెబుతున్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా సినిమాల ద్వారా సమాజంపై ప్రభావం చూపే అంశాలపై చర్చ జరిగి ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గత కొంతకాలంగా బాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీల్లో చిత్రాల్లో జాతీయ భావన, దేశభక్తి నేపథ్య కథలు ఎక్కువగా వస్తున్నాయి. సినిమాల్లో నేషనాలిటీ మరింత ప్రతిబింబించాలని ఆర్‌ఎస్‌ఎస్ నేతలు భావిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అలాంటి అంశాలపైనే ఈ సమావేశంలో చర్చ జరిగి ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో మోహన్ భగవత్ పలువురు సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు. అప్పుడు కూడా రాజకీయంగా చర్చ సాగింది. ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగిన భేటీ కూడా అదే తరహాలో వ్యూహాత్మకంగా జరిగిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ సమావేశం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
కేవలం పరస్పర పరిచయం, అభిప్రాయాల మార్పిడి కోసమే నిర్వహించారని తెలుస్తోంది. కానీ అధికారికంగా ఎవరూ స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మొత్తానికి.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హైదరాబాద్ పర్యటనతో టాలీవుడ్, రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆ భేటీల అసలు ఉద్దేశం ఏమిటి? భవిష్యత్ లో సినీ ఇండస్ట్రీపై దాని ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ముందున్న రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
