Begin typing your search above and press return to search.

రౌడీ బాయ్ Vs స్టార్ బాయ్.. ఇద్దరిలో గెలిచేదెవరు?

ఇలా వేసవి ప్రారంభంలో వారం గ్యాప్ లో రెండు క్రేజీ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ క్లాష్ లో ఏది విన్నర్ గా నిలుస్తుందనేది చర్చనీయాంశం అయింది.

By:  Tupaki Desk   |   28 Feb 2024 10:28 AM GMT
రౌడీ బాయ్ Vs స్టార్ బాయ్.. ఇద్దరిలో గెలిచేదెవరు?
X

టాలీవుడ్ లో సంక్రాంతి తరువాత సమ్మర్ ను సినిమాలకు మంచి సీజన్ గా భావిస్తుంటారు. అన్ని తరగతుల విద్యార్థులు ఎగ్జామ్స్ పూర్తి చేసుకొని సెలవుల్లో ఉంటారు కాబట్టి, ఆ సమయంలో సినీ వినోదాన్ని అందించాలని మన దర్శక నిర్మాతలు భావిస్తుంటారు. అందుకే భారీ బడ్జెట్ చిత్రాలను, స్టార్ హీరోల సినిమాలను వేసవిలో తీసుకొస్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం సినీ అభిమానులకు ఈ విషయంలో నిరాశే ఎదురుకానుంది. ఎందుకంటే 2024 ఏప్రిల్ లో పెద్ద హీరోల సినిమాలవీ రిలీజ్ కావడం లేదు. మే నెలలో 'కల్కి 2898 AD' వస్తుందని అంటున్నారు కానీ, వాయిదా పడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని టాక్. ఈ నేపథ్యంలో సమ్మర్ ను క్యాష్ చేసుకోడానికి కొన్ని క్రేజీ చిత్రాలు, మీడియం రేంజ్ హీరోల సినిమాలు ట్రై చేస్తున్నాయి. ఇందులో భాగంగా బాక్సాఫీస్ వద్ద ఇద్దరు యువ హీరోల మధ్య ఆసక్తికరమైన పోటీ ఏర్పడే పరిస్థితులు క్రియేట్ అయ్యాయి.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "ఫ్యామిలీ స్టార్". పరశురామ్‌ పెట్లా దర్శకత్వంలో ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. 'దేవర' పార్ట్ 1 వాయిదా పడిన తర్వాత ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే దీనికి సరిగ్గా వారం రోజుల ముందుగా "టిల్లు స్క్వేర్" సినిమా రిలీజ్ కానుంది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మార్చి 29న థియేటర్లలోకి రానుంది. ఇలా వేసవి ప్రారంభంలో వారం గ్యాప్ లో రెండు క్రేజీ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ క్లాష్ లో ఏది విన్నర్ గా నిలుస్తుందనేది చర్చనీయాంశం అయింది.

సిద్ధూ హీరోగా రెండేళ్ల కింద చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ బ్లాక్‍ బాస్టర్ గా నిలిచిన 'డీజే టిల్లు' సినిమాకు సీక్వెల్‍ గా 'టిల్లు స్క్వేర్' తెరకెక్కుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమా బ్యానర్స్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రైలర్ కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగింది. టిల్లు మరోసారి తన క్రేజీ రైడ్ తో అలరించబోతున్నారని మేకర్స్ హామీ ఇచ్చారు. ఈ మూవీ కోసం యూత్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా 'ఫ్యామిలీ స్టార్'. ఇందులో మృణాల్ ఠాకూర్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'ఐరెనే వంచాలా ఏంటీ?' అంటూ టీజర్ తో ట్రెండ్ క్రియేట్ చేసారు. రౌడీ స్టార్ ను ఒక ఫ్యామిలీ హీరోగా చూడటానికి ఫ్యాన్స్ ఆతృతగా వేచి చూస్తున్నారు.

కేవలం ఒక వారం తేడాతో థియేటర్లలోకి రాబోతున్న 'ఫ్యామిలీ స్టార్' & 'టిల్లు స్క్వేర్' సినిమాలపై అందరిలో మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే రెండింటికీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్లుగా టాక్ వినిపిస్తోంది. రెండు సినిమాలు కూడా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచే రాబోతున్నాయి. మార్కెట్ పరంగా చూసుకుంటే ఇద్దరు యువ హీరోలలో విజయ్ కాస్త ముందుంటాడు. కానీ ఇక్కడ సిద్ధూని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. టాక్ బాగుంటే రెండు చిత్రాలూ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టి, సమ్మర్ సీజన్ ను ఘనంగా ప్రారంభించే అవకాశం వుంది. ఒకవేళ వాటిల్లో ఒక సినిమా బాగాలేకపోతే, అది మిగిలిన చిత్రానికి అడ్వాంటేజ్ అవుతుంది. మరి విజయ్ దేవరకొండ, సిద్దు జొన్నలగడ్డలలో ఎవరు వేసవి వినోదాన్ని అందించి విజయం సాధిస్తారో వేచి చూడాలి. ఇద్దరు కూడా విజయం సాదించాలి అని తుపాకీ కోరుకుంటుంది.