Begin typing your search above and press return to search.

రీ-రిలీజ్ కు రెడీ అయిన ఫ్లాప్ మూవీ!

'రౌడీ బాయ్స్' సినిమాని ఏప్రిల్ 25న రీ-రిలీజ్ చేయనున్నట్లు దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.

By:  Tupaki Desk   |   23 April 2024 3:48 AM GMT
రీ-రిలీజ్ కు రెడీ అయిన ఫ్లాప్ మూవీ!
X

టాలీవుడ్ లో రీ-రిలీజుల ట్రెండ్ నడుస్తోంది. గతంలో హిట్టయిన చిత్రాలని, కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకున్న సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే అనేక చిత్రాలను మళ్ళీ విడుదల చేశారు. వాటిల్లో చాలా సినిమాలు బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు సాధించాయి. ఈ క్రమంలో థియేటర్లలో ఫ్లాప్ అయిన "రౌడీ బాయ్స్" మూవీని రీ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.

అగ్ర నిర్మాత దిల్ రాజు సోదరుడి తనయుడు ఆశిష్ ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన సినిమా ''రౌడీ బాయ్స్''. ఇందులో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మించారు. 2022 సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ యూత్‌ ఫుల్ డ్రామాకి మిశ్రమ స్పందన వచ్చింది. కలెక్షన్లు కూడా దానికి తగ్గట్టుగానే వచ్చాయి. అలాంటి చిత్రాన్ని ఇప్పుడు మరోసారి రిలీజ్ చేస్తున్నారు.

ఇది మీలోని అంతర్గత రౌడీని బయటకి తీసుకొచ్చే సమయం అంటూ 'రౌడీ బాయ్స్' సినిమాని ఏప్రిల్ 25న రీ-రిలీజ్ చేయనున్నట్లు దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించే థియేటర్లు, టికెట్ రేట్లతో ఓ పోస్టర్ ను కూడా వదిలారు. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ తో పాటుగా విజయనగరం, కర్నూల్, ఏలూరులలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు పేర్కొన్నారు.

ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ, మొదటి సారే జనాలు పట్టించుకోని సినిమాని మరోసారి థియేట్రికల్ రిలీజ్ చేయటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి ఇటీవల 'ఓం భీమ్ బుష్' చిత్రంతో హిట్ కొట్టగా.. హిరోయిన్ అనుపమ 'టిల్లు స్క్వేర్' మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టింది. వీళ్ళ క్రేజ్ ను క్యాష్ చేసుకోడానికే 'రౌడీ బాయ్స్' ను మళ్ళీ తీసుకొస్తున్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఆశిష్ నటించిన 'లవ్ మీ' మూవీ మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది కాబట్టి, 'రౌడీ బాయ్స్' ను రీ-రిలీజ్ చేయడం ద్వారా అంతో ఇంతో ప్రచారం లభిస్తుందని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. నిజానికి ఈ సమ్మర్ సీజన్ లో పెద్ద సినిమాలు లేకపోవడంతో, చిన్నా చితకా చిత్రాలన్నీ వరుసగా క్యూలు కడుతున్నాయి. థియేటర్లకు ఫీడింగ్ ఇచ్చి, హాలిడేస్ ను క్యాష్ చేసుకోడానికి ఇప్పుడు 'రౌడీ బాయ్స్' లాంటి ఫ్లాప్ మూవీని కూడా విడుదల చేస్తున్నారనే కామెంట్లు కూడా నెట్టింట కనిపిస్తున్నాయి.

'రౌడీ బాయ్స్' విషయానికొస్తే, ఆశిష్ ను గ్రాండ్ గా లాంచ్ చెయ్యడానికి దిల్ రాజు భారీ ప్లాన్స్ వేసుకున్నారు. బాక్సాఫీసు దగ్గర పోటీ లేకుండా సోలో డేట్ కు రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. కానీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా RRR & 'రాధే శ్యామ్' లాంటి పాన్ ఇండియా సినిమాలను వాయిదా వేయడంతో, స్టార్ ప్రొడ్యూసర్ అప్పటికప్పుడు తమ ఫ్యామిలీ హీరో మూవీని బరిలో నిలిపారు. ఓ మాదిరి ప్రమోషన్స్ తోనే థియేటర్లలోకి తీసుకొచ్చారు.

వైరస్ భయంతో సినిమా హాల్లకు రావడానికి వెనకడుగు వేసిన జనాలు.. 'బంగార్రాజు'ను సూపర్ సక్సెస్ చేసి, 'రౌడీ బాయ్స్' తో సహా మిగతా పొంగల్ చిత్రాలని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఓ వర్గం యూత్ ఆడియన్స్ ను ఈ మూవీ ఆకట్టుకుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, మధే సినిమాటోగ్రఫీ, అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ ఈ సినిమాకి ఆకర్షణగా నిలిచాయి. ఇంజినీరింగ్‌, మెడికల్‌ కాలేజీ విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్స్ ను ఆవిష్కరించిన ఈ మూవీ రెండేళ్ల తర్వాత మరోసారి విడుదల కాబోతోంది. మరి ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.