‘ఛాంపియన్’ మూవీ రివ్యూ
By: Tupaki Desk | 25 Dec 2025 12:39 PM ISTనటీనటులు: రోషన్ మేక- అనస్వర రాజన్- కేకే మీనన్- కళ్యాణ చక్రవర్తి- ప్రకాష్ రాజ్ - మురళీశర్మ- అభయ్ బేతిగంటి - రవీంద్ర విజయ్ హర్షవర్ధన్- వెన్నెల కిషోర్- కోవై సరళ - అర్చన - రచ్చ రవి తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: మదీ
నిర్మాత: ప్రియాంక దత్
రచన-దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం
టీనేజీలో ‘నిర్మలా కాన్వెంట్’.. ఆ తర్వాత కొన్నేళ్లకు ‘పెళ్ళిసంద-డి’ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు రోషన్ మేక. ఆపై బాగా గ్యాప్ తీసుకుని ‘ఛాంపియన్’ లాంటి భారీ చిత్రంలో నటించాడు. షార్ట్ ఫిలిం ‘అద్వైతం’తో ప్రతిభను చాటుకున్న ప్రదీప్ అద్వైతం ఈ చిత్రంతో ఫీచర్ ఫిలిం డైరెక్టర్ అయ్యాడు. స్వప్న సినిమా బేనర్లో తెరకెక్కిన ‘ఛాంపియన్’ ఎగ్జైటింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. మరి సినిమా కూడా అదే స్థాయిలో ఉందా? చూద్దాం పదండి.
కథ:
1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. హైదరాబాద్ మాత్రం దేశంలో కలవకుండా ప్రత్యేక సంస్థానంగా నిజాంల పాలనలోనే కొనసాగుతుంటుంది. ఈ ప్రాంత ప్రజలకు ఇండియాలో కలవాలని ఉన్నా.. భారత ప్రభుత్వమూ అందుకు ప్రయత్నం చేస్తున్నా.. నిజాం మాత్రం అందుకు అంగీకరించరు. నిజాం సైన్యం రజాకార్ల అకృత్యాలకు అల్లాడిపోతున్న ప్రజలు తమకెప్పుడు స్వాతంత్ర్యం వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఐతే ఈ ప్రాంతంలోని బైరాన్ పల్లి మాత్రం రజాకార్ల మీద వీరోచితంగా పోరాడుతూ ఆదర్శంగా నిలుస్తుంటుంది. ఆ ఊరి పోరాటాన్ని అణచివేయాలని రజాకార్లు చూస్తుంటారు. అలాంటి చోటికి ఫుట్ బాలర్ అయిన మైకేల్ విలియమ్స్ (రోషన్ మేక) అనుకోని పరిస్థితుల్లో వస్తాడు. ఇంగ్లాండుకు వెళ్లి అక్కడ ఫుట్ బాల్ ఆడాలని కలలు కంటున్న మైకేల్.. ఆ కలను నెరవేర్చుకోవడానికి ఒక మిషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంతకీ తన మిషన్ ఏంటి.. అతను బైరాన్ పల్లికి ఎందుకు రావాల్సి వచ్చింది.. రజాకార్లతో బైరాన్ పల్లి పోరాటంలో అతను ఎలా భాగమయ్యాడు. చివరికి మైకేల్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
బైరాన్ పల్లి.. తెలంగాణ సాయుధ పోరాటం గురించి తెలిసిన వాళ్లకు ఈ పేరు చెబితే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నిజాం పాలనలో రజాకార్ల అకృత్యాలు పెచ్చుమీరిన సమయంలో అసాధారణ పోరాటంతో తెలంగాణ మొత్తానికి స్ఫూర్తిగా నిలిచిన ఊరది. 1947లో ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చాక కూడా నిజాం పాలనలోనే కొనసాగిన తెలంగాణ.. ఇంకో ఏడాది తర్వాత అంతిమంగా విముక్తి పొందడంలో బైరాన్ పల్లి పాత్ర కీలకం. ఆ ఊరి కథను తెరపైకి తీసుకురావడానికి ప్రదీప్ అద్వైతం సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు ‘ఛాంపియన్’లో. గొప్ప అభిరుచితో సినిమాలు నిర్మిస్తున్న స్వప్న సినిమా సంస్థ కూడా ఏమాత్రం రాజీపడకుండా ఈ కథను తెరకెక్కించడానికి అవసరమైన అన్ని వనరులనూ సమకూర్చింది. కాకపోతే విడిగా ఈ కథనే చెబితే ఆ అనుభూతి వేరుగా ఉండేదేమో. కానీ ఈ వాస్తవ గాథలోకి ఒక కల్పిత ఫుట్ బాలర్ పాత్రను తీసుకొచ్చి రెంటినీ బ్లెండ్ చేయడానికి చూడగా.. అదే సరిగా కుదరలేదు. రోషన్ మేక ఆ ఫుట్ బాలర్ పాత్రలో చక్కటి పెర్ఫామెన్స్ ఇచ్చినప్పటికీ.. ఆ కథలో అతడి పాత్ర సింక్ కాలేకపోయింది. ‘ఛాంపియన్’ కచ్చితంగా ఒక భిన్నమైన.. మంచి ప్రయత్నం. టీం అంతా ఎంత ఎఫర్ట్ పెట్టింది ప్రతి సన్నివేశంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎక్కడో ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ కావడంతో ‘ఛాంపియన్’ మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. రొటీన్ సినిమాల మధ్య ఓ భిన్నమైన చిత్రం చూడాలనుకున్న వాళ్లు ఈ సినిమాపై ఒక లుక్కేయొచ్చు.
చారిత్రక ఘటనల మీద సినిమాలు తీసినపుడు డ్రామాను రక్తి కట్టించడం కోసం.. కొన్ని కల్పిత పాత్రలు.. సన్నివేశాలను జోడించడం మామూలే. కానీ వాటిని వాస్తవ కథలో సింక్ అయ్యేలా చూసుకోవడం కీలకం. ఇక్కడే దర్శకుడు ప్రదీప్ అద్వైతం కొంచెం తడబడ్డాడు. రోషన్ కోసం ఒక ఫుట్ బాలర్ పాత్రను సృష్టించి.. అతడికో గోల్ సెట్ చేసి.. అనుకోకుండా అతను బైరాన్ పల్లికి వచ్చి ఆ ఊరి పోరాటంలో భాగమయ్యేలా ట్రాక్ రాసుకున్నాడు. ఐతే ఇటు బైరాన్ పల్లి కథ.. అటు ఫుట్ బాలర్ ట్రాక్... వేటికవి విడిగా చూస్తే బాగానే అనిపిస్తాయి. కానీ తనది కాని ఒక పోరాటాన్ని హీరో తన భుజాల మీదికి తీసుకున్నాడంటే దాని వెనుక బలమైన ఎమోషన్ ఉండాలి. ఆ ఎమోషన్ లేకపోవడమే ‘ఛాంపియన్’కు మైనస్ అయింది. దాన్ని వర్కవుట్ చేయగలిగి ఉంటే ‘ఛాంపియన్’ ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలబడేది. కానీ ఈ లోపాన్ని పక్కన పెడితే.. ‘ఛాంపియన్’ టీం పెట్టిన ఎఫర్ట్ ప్రశంసనీయం. ఎనిమిది దశాబ్దాల కిందటి నేపథ్యాన్ని తెరపైన ప్రెజెంట్ చేసిన తీరు ఆశ్చర్యపరుస్తుంది.
రోషన్ టాలెంట్ చూపిద్దామనో.. అతణ్ని ఎలివేట్ చేద్దామనో.. కమర్షియల్ హంగులు అద్దడానికి ప్రయత్నించకుండా.. ‘ఛాంపియన్’లో నీట్ గా ఒక కథను చెప్పడానికే ప్రయత్నించాడు దర్శకుడు ప్రదీప్ అద్వైతం. ఒక పాట వచ్చినా.. ఫైట్ వచ్చినా.. అవి కథలో భాగంగానే ఉంటాయి. ఫుట్ బాలర్ గా రోషన్ ను పరిచయం చేస్తూ సాగే సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. అతను బైరాన్ పల్లిలోకి అడుగు పెట్టే వరకు కథనం కొంచెం నెమ్మదిగానే నడుస్తుంది. కానీ బైరాన్ పల్లి ట్రాక్ మొదలవగానే ‘ఛాంపియన్’ వేగం పుంజుకుంటుంది. ఆడియోలో పెద్ద హిట్టయిన ‘గిరగిర’ పాట తెరపై కనువిందుగా అనిపిస్తుంది. సినిమాలో ది బెస్ట్ మూమెంట్ గా ఈ పాటను చెప్పుకోవచ్చు. ఈ పాట వచ్చే టైమింగ్.. దాన్ని చిత్రీకరించిన తీరు.. అన్నీ కూడా భలేగా అనిపిస్తాయి. ఇక ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ సైతం బాగా పేలింది. విరామ సమయానికి ‘ఛాంపియన్’ మంచి హై ఇస్తుంది.
ఐతే ఈ టెంపోను ద్వితీయార్ధంలో కొనసాగించి ఉంటే.. ‘ఛాంపియన్’ వేరే లెవెల్లో నిలబడేది. కథ మీద ముందే ఒక అంచనా వచ్చేయడం.. ద్వితీయార్ధంలో బలమైన ఎమోషన్ మిస్ కావడం వల్ల ‘ఛాంపియన్’ గ్రాఫ్ తగ్గుతుంది. బైరాన్ పల్లితో హీరోకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడేలా చేస్తే.. ప్రేక్షకులకూ ఆ ఎమోషన్ గట్టిగా పట్టుకునేదేమో. కానీ ఆ ప్రయత్నమే జరగలేదు. చివరి వరకు హీరో తనకీ పోరాటంతో సంబంధం లేదన్నట్లు పక్కనే ఉండిపోతాడు. క్లైమాక్సులో రజాకార్ల మీద బైరాన్ పల్లి వాసులు వీరోచితంగా పోరాడే ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. కానీ అందులో ఆ ఎపిసోడ్లో హీరో మాత్రం ఉండడు. ఈ కథ నుంచి హీరో సైడ్ అయిపోయాడనే భావన కలుగుతుంది. చివరికి హీరో పెద్ద త్యాగం చేసినా.. ఎలాంటి భావోద్వేగం కలగలేదంటే.. ఆ పాత్ర ఈ కథలో సింక్ కాలేదనే అర్థం. కానీ ‘ఛాంపియన్’లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. సినిమా ఎక్కడా రొటీన్ అనే ఫీలింగ్ కలిగించదు. ఈ సీన్ బాగా లేదు.. ఇది వృథా అంటూ వేలెత్తి చూపించలేని విధంగా క్రాఫ్ట్ పనితనం కనిపిస్తుంది. అంతిమంగా ‘ఛాంపియన్’ గెలిచాడా అంటే ఔనని చెప్పలేం. అదే సమయంలో ఓడాడని కూడా అనలేం.
నటీనటులు:
ఈ కుర్రాడిలో ఏదో స్పెషాలిటీ ఉందే అని ప్రతి సీన్లోనూ అనిపిస్తాడు రోషన్. తన లుక్ చాలా బాగుంది. అతన్ని చూస్తూ ఉండాలనిపిస్తుంది. నటనలోనూ ఈజ్ ఉంది. మైకేల్ పాత్రలో బాగానే ఒదిగిపోయాడు. దాని కోసం ఎంతో కష్టపడ్డాడు కూడా. అతను డ్యాన్సులు.. ఫైట్లు కూడా బాగా చేశాడు. కానీ ఇంకా కొంచెం లేతగానే కనిపిస్తున్న రోషన్ మీద కొంచెం ఎక్కువ బరువు పెట్టేశారు అనిపిస్తుంది. అతడికి మంచి భవిష్యత్తు ఉందని మాత్రం అర్థమవుతుంది. మలయాళ సెన్సేషన్ అనస్వర రాజన్.. కథానాయిక పాత్రలో రాణించింది. తన హావభావాలు.. డ్యాన్స్ భలేగా అనిపిస్తాయి. గిరగిర పాటలో అనస్వర అదరగొట్టింది. ఎన్నో ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన కళ్యాణ చక్రవర్తి అనుకున్నంత ఇంపాక్ట్ వేయలేకపోయాడు. ఆయన డబ్బింగ్ సరిగా కుదరలేదు. అతను బైరాన్ పల్లి వాసిలా అనిపించడు. కేకే మీనన్ తన టాలెంటును చూపించే ఛాన్స్ రజ్వి పాత్ర ఇవ్వలేదు. వల్లబాయ్ పటేల్ పాత్రలో ప్రకాష్ రాజ్ కాసేపు మెరిశాడు. విలన్ పాత్ర చేసిన నటుడు బాగా నటించాడు. హర్షవర్ధన్.. అభయ్ బేతిగంటి.. రచ్చ రవి.. తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. మురళీ శర్మ.. రవీంద్ర విజయ్.. వెన్నెల కిషోర్.. కోవై సరళ.. వీళ్లంతా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా ‘ఛాంపియన్’ బ్రిలియంట్ ఫిలిం. మిక్కీ జే మేయర్.. ఇటు పాటలు.. అటు నేపథ్య సంగీతం విషయంలో బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చాడు. ‘గిర గిర’ పాట చాన్నాళ్లు గుర్తుంటుంది. సల్లంగుండాలే పాట కూడా బాగుంది. ఆర్ఆర్ సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. సినిమాటోగ్రాఫర్ మదీ తన స్థాయిని చూపించాడు. విజువల్స్ భలేగా అనిపిస్తాయి. ఆర్ట్ డైరెక్టర్ కృషి కూడా ప్రశంసనీయం. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో స్వప్న సినిమా సంస్థను ఎంత కొనియాడినా తక్కువే. రోషన్ లాంటి కొత్త హీరోను పెట్టి వాళ్లు పెద్ద సాహసమే చేశారు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం ఎంతో ఇష్టపడి.. కష్టపడి సినిమా తీసిన సంగతి అర్థమవుతుంది. సినిమా మీద తన ప్రేమ.. క్రాఫ్ట్ మీద పట్టు చాలా చోట్ల కనిపిస్తుంది. ఈ కథను సిన్సియర్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. కాకపోతే భావోద్వేగాలను పండించడంలో తడబడ్డాడు. ద్వితీయార్ధంలో స్క్రీన్ ప్లే ఇంకా బిగితో ఉండాల్సింది.
చివరగా: ఛాంపియన్.. గెలవలేదు ఓడలేదు
రేటింగ్ - 2.5/5
