శ్రీకాంత్ వారసుడు కొట్టకపోతే కష్టమే!
మార్కెట్ బిల్డ్ చేసుకుంటనే కొత్త అవకాశాలొస్తాయి. యావరేజ్ మార్కెట్ ఉన్న హీరోలే ఒకటి రెండు పరాజయాలు ఎదురయ్యే సరికి ప్రతికూల పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నారు.
By: Tupaki Desk | 8 Jun 2025 5:00 AM ISTఛార్మింగ్ స్టార్ శ్రీకాంత్ తనయుడిగా రోషన్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాల్లోకి తనయు డిని తీసుకురాను అంటూనే తీసుకొచ్చాడు శ్రీకాంత్. `రుద్రమదేవి`తో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అటుపై `నిర్మలకాన్వెంట్ తో హీరోగా పరిచయమయ్యాడు. ఆ చాన్స్ నాగార్జున ఇవ్వడంతో సాధ్యమైంది. అటుపై `పెళ్లి సందడి` అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నాటి `పెళ్లి సందడి`కి సీక్వెల్ గా రాఘవేంద్ర రావు శిష్యురాలు గౌరీ రోణంకి టేకప్ చేసిన ప్రాజెక్ట్.
కానీ ఫలితం మాత్రం ఆశాజనకంగా రాలేదు. అటుపై కొత్త ఛాన్స్ అందుకోవడానికి రోషన్ కి ఏకంగా నాలుగేళ్లు సమయం పట్టింది. ప్రస్తుతం `వృషభ` లో నటిస్తున్నాడు. ఇది తెలుగు, మలయాళ చిత్రం. ఇందులో మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆయన కుమారుడి పాత్రలోనే రోషన్ కనిపిస్తాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే `ఛాంపియన్` అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఎప్పుడు రిలీజ్ అవుతాయి? అన్నది క్లారిటీ లేదు. షూటింగ్ నత్తనడకన సాగుతుంది. ప్రారంబోత్సవం తర్వాత మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. రోషన్ వయసు 26 ఏళ్లు. హీరోగా పుల్ బిజీగా ఉండాల్సిన సమయం ఇది. కానీ ఇంతవరకూ సరైన హిట్ ఒక్కటీ పడలేదు. కెరీర్ ఇలాగే కొనసాగితే అవకాశాలు మరింత జఠిలమవుతాయి. ఇండస్ట్రీలో సక్సెస్ కీలకం.
మార్కెట్ బిల్డ్ చేసుకుంటనే కొత్త అవకాశాలొస్తాయి. యావరేజ్ మార్కెట్ ఉన్న హీరోలే ఒకటి రెండు పరాజయాలు ఎదురయ్యే సరికి ప్రతికూల పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నారు. అలాంటిది రోషన్ ఏ ఫేజ్ లో ఉన్నాడన్నది అర్దం చేసుకోవచ్చు. బ్యాక్ గ్రౌండ్ ఉన్న నటులకే మార్కెట్ లేకపోవడంతో నిర్మాతలు ముందుకు రావడం లేదు. సొంత బ్యానర్లో చేసుకోవాల్సి వస్తుంది. అవి సక్సెస్ అయితే తదుపరి కంటు న్యూ అవుతున్నారు. లేదంటే డ్రాప్ అవుతున్నారు. రోషన్ సక్సెస్ ట్రాక్ ఎక్కాల్సిన సమయం ఇది. లేదంటే డాడ్ శ్రీకాంత్ నిర్మాతగా మారాల్సి ఉంటుంది.
