ఆ హీరో కోసం రూట్ మార్చిన హిట్ డైరెక్టర్
నిర్మలా కాన్వెంట్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ ఆ సినిమాతో మంచి మార్కులు వేసుకున్నాడు.
By: Tupaki Desk | 3 Jun 2025 8:00 PM ISTనిర్మలా కాన్వెంట్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ ఆ సినిమాతో మంచి మార్కులు వేసుకున్నాడు. మొదటి సినిమాతోనే రోషన్ లో మ్యాటర్ ఉంది అని అందరితో అనిపించుకున్నాడు. పెళ్లి సందడి2 సినిమాతో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో సినిమా చేసి ఆ సినిమాతో కూడా నటన పరంగా మరోసారి మెప్పించాడు రోషన్.
అయితే ఛాన్సులొస్తున్నాయని ప్రతీదీ ఒప్పుకోకుండా ఎంతో ఆచితూచి వ్యవహరిస్తూ సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు రోషన్. ప్రస్తుతం రోషన్ చేతిలో రెండు సినిమాలున్నాయి. అవి కాకుండా మరో కొత్త సినిమాకు రోషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ప్రస్తుతం కథ విషయంలో దర్శకనిర్మాతలతో డిస్కషన్స్ జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
హిట్ ఫ్రాంచైజ్ సినిమాలతో తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను, రోషన్ తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. హిట్ ఫ్రాంచైజ్ లో ఇప్పటివరకు శైలేష్ తీసిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఇవి కాకుండా శైలేష్, వెంకటేష్ తో సైంధవ్ అనే సినిమా కూడా చేశాడు. మంచి అంచనాల మధ్య వచ్చిన సైంధవ్ ఫ్లాపుగా నిలిచింది. అయితే శైలేష్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ యాక్షన్ థ్రిల్లర్లే. కానీ ఇప్పుడు రోషన్ కోసం శైలేష్ రూట్ మారుస్తున్నాడని తెలుస్తోంది.
రోషన్ హీరోగా శైలేష్ ఓ ప్యూర్ లవ్ స్టోరీని తెరకెక్కించాలని చూస్తున్నాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ ప్రాజెక్టును నిర్మించనున్నాడని, ప్రస్తుతం దీనికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
కాగా ప్రస్తుతం రోషన్, ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో చాంపియన్ అనే ఓ స్పోర్ట్స్ డ్రామాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ చాంపియన్ షూటింగ్ 70% పూర్తైంది. దీంతో పాటూ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తో కలిసి వృషభ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రోషన్ సరసన బాలీవుడ్ భామ షనయా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. నంద కిషోర్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో మోహన్ లాల్, రోషన్ తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారు.
