ఎన్టీఆర్ విలన్ కు అన్ని కష్టాలా?
ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి ఫేమస్ అయిన రోనిత్ రాయ్ తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొని తన లైఫ్ జర్నీ గురించి మాట్లాడి ఎమోషనల్ అయ్యారు.
By: Tupaki Desk | 13 July 2025 8:00 AM ISTమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన జై లవకుశ సినిమాలో విలన్ గా నటించిన రోనిత్ రాయ్ అందరికీ గుర్తు ఉండే ఉంటారు. ఆయన నటించిన మొదటి తెలుగు సినిమా అదే. మొదటి సినిమాతోనే తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన దాని కంటే ముందు బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ ఫిల్మ్ లో నటించారు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన రోనిత్ రాయ్ అప్పట్నుంచి ఇప్పటివరకు వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి ఫేమస్ అయిన రోనిత్ రాయ్ తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొని తన లైఫ్ జర్నీ గురించి మాట్లాడి ఎమోషనల్ అయ్యారు. ఇవాళ నటుడిగా మంచి గుర్తింపు ఉన్న తాను ఇండస్ట్రీలోకి అంత ఈజీగా రాలేదని తెలిపారు.
ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో ఇబ్బందులు పడ్డానని, డబ్బుల్లేక ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పారు. తినడానికి సరిపోయినన్ని డబ్బుల్లేక ఒక పూట మాత్రమే భోజనం చేసేవాడినని, ప్రతీ రోజూ రెండు రోటీలు, కూర మాత్రమే తినేవాడినని, ఒక రోజు డబ్బుల్లేక రోటీలు మాత్రమే తీసుకుంటే ఆ హోటల్ ఓనర్ కూర కూడా ఇచ్చారని, ఇదేంటని అడిగితే మీరు రోజూ ఇదే కదా తింటారు. ఇవాళ కూడా అలానే తినండి, డబ్బుల్లేకపోయినా పర్వాలేదని అన్నారని అతని ముఖం ఇప్పటికీ తనకు గుర్తుందని ఎమోషనలై కంటతడి పెట్టుకున్నారు.
ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ఎవరూ పెద్దగా అవకాశాలిచ్చేవారు కాదని, కావాలని తనను తమ వెంట తిప్పుకునే వాళ్లని, అదెంతో బాధగా అనిపించినప్పటికీ పట్టు వదలకుండా తిరిగానని, అందుకే కెరీర్ స్టార్టింగ్ లో తనకు పెద్దగా అవకాశాలు రాలేదని, ఎందుకిలా అవుతుందని మొదట్లో చాలా ఎక్కువగా ఆలోచించేవాడినని, తర్వాత్తర్వాత దాన్ని పట్టించుకోవడమే మానేశానని, అవకాశాలివ్వమని ఎవరినీ అడక్కపోవడం వల్లే తనకు ఛాన్సులు వచ్చి ఉండకపోవచ్చని తనకు తానే సర్దిచెప్పుకునేవాడినని రోనిత్ రాయ్ తెలిపారు. తాను చేసిన ఫస్ట్ మూవీ జాన్ తేరే నామ్‌కు ఆయనకు యాభై వేల రెమ్యూనరేషన్ ఇచ్చారని కూడా రోనిత్ రాయ్ పేర్కొన్నారు.
