'రోమాంచకం' మూవీ రివ్యూ
ప్రమోషన్లు కూడా గట్టిగా చేయడం.. ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ వేయడంతో సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ చిత్రం ఎంతమేర అందుకుందో తెలుసుకుందాం.
By: Tupaki Desk | 3 Sept 2026 9:45 AM ISTనటీనటులు: సుమంత్ ప్రభాస్ - అనంతిక సనిల్ కుమార్ - ఉపేంద్ర లిమాయే - నరేంద్ర రవి- వెంకటేష్ కాకుమాను తదితరులు
సంగీతం: వాసుకి వైభవ్
ఛాయాగ్రహణం: పవన్ పప్పుల
నిర్మాణం: భద్రకాళి పిక్చర్స్
రచన - దర్శకత్వం: వేణుగోపాల్ రెడ్డి
సందీప్ రెడ్డి వంగ నిర్మాణంలో ప్రేమకథ అనగానే ‘రోమాంచకం’ సినిమా మీద ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ప్రమోషన్లు కూడా గట్టిగా చేయడం.. ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ వేయడంతో సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ చిత్రం ఎంతమేర అందుకుందో తెలుసుకుందాం.
కథ:
అన్వేష్ (సుమంత్ ప్రభాస్) స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతున్న సమయంలో ‘రోమాంచకం’ అనే డేటింగ్ యాప్ స్టార్టప్ కంపెనీ పెట్టాలని ప్రయత్నిస్తుంటాడు. దీనికి సంబంధించిన రీసెర్చిలో భాగంగా అమ్మాయిలను అర్ధం చేసుకోవాలని వేరే డేటింగ్ యాప్ ద్వారా చెన్నై అమ్మాయి మైథిలి (అనంతిక సనిల్ కుమార్) తో కనెక్ట్ అవుతాడు.వీళ్లిద్దరు ఫోన్ సంభాషణలోనే బాాగా దగ్గరవుతారు. మైథిలి కోసం చెన్నైకి వెళ్లిన అన్వేష్ ఆమెను కలవలేకపోతాడు. పైగా ఆమె అతణ్ని బ్లాక్ చేస్తుంది. తర్వాత అన్వేష్ కోసం హైదరాబాద్ కు వచ్చిన మైథిలి అనుకోకుండా కనిపించకుండా పోతుంది. మరి మైథిలి.. అన్వేష్ ను మొదట ఎందుకు బ్లాక్ చేసింది.. తర్వాత అతణ్ని ఎందుకు కలిసింది.. కలిశాక ఎందుకు మాయమైంది.. మైథిలి కనిపించకుండా పోవడంతో అన్వేష్-అతడి మిత్రులు పడ్డ ఇబ్బందులేంటి.. చివరికి వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే అడుగడుగునా అతడి ముద్ర ఉంటుంది. అతను ప్రొడ్యూస్ చేసిన సినిమాలోనూ ఆ టచ్ కచ్చితంగా ఉంటుందనే ఆశిస్తాం. అందులోనూ ‘రోమాంచకం’ ప్రోమోలు చూస్తే.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలాగే కనిపించింది. ప్రభాస్.. మహేష్ బాబు.. విజయ్ దేవరకొండ లాంటి పెద్ద స్టార్లు ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో ఇది ఆషామాషీ సినిమా అయ్యుండదనే అనుకున్నారంతా. కానీ ప్రోమోల్లో.. ప్రమోషన్లలో కనిపించినంత ప్రామిసింగ్ మూవీ ఏమీ కాదిది. సినిమాకు హైప్ తీసుకురావడం మీద పెట్టిన శ్రద్ధ కంటెంట్ మీద కూడా పెట్టి ఉంటే బాగుండేదనిపిస్తుంది సినిమా చూస్తున్నంతసేపు. రైటర్ కమ్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి బడ్డీ కామెడీతో అక్కడక్కడా నవ్వించగలిగాడు కానీ.. మిగతా అంశాల్లో అంతగా మెప్పించలేకపోయాడు. ముఖ్యంగా లవ్ స్టోరీని డీల్ చేయడంలో తడబడడం.. అందులో సరైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడంతో ‘రోమాంచకం’ను అంత సీరియస్ గా తీసుకోలేని పరిస్థితి. ఈ కథలో కొంచెం థ్రిల్లర్ లక్షణాలు కూడా ఉన్నప్పటికీ.. ఆ పాయింటును కూడా సరిగా డీల్ చేయలేదు. ఓవరాల్ గా జస్ట్ కామెడీ కోసమైతే ‘రోమాంచకం’పై ఒక లుక్కేయొచ్చు.
ప్రేమ- హాస్యం- ఉత్కంఠ.. ‘రోమాంచకం’ చిత్రానికి పెట్టిన క్యాప్షన్ ఇది. కానీ ఇందులో హాస్య రసం మాత్రమే పండింది. ప్రేమకథల్లో ప్రతిసారీ కొత్తదనం చూపించడం కష్టం. కథ కంటే కథనంతోనే మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. కానీ ‘రోమాంచకం’లో ఆ మ్యాజిక్ జరగలేదు. క్యాప్షన్లో ఉన్న ఉత్కంఠ కొన్ని సన్నివేశాలకే పరిమితం అయింది. సినిమాకు అతి పెద్ద మైనస్ ‘ప్రేమ’ అంశాన్ని సరిగా డీల్ చేయకపోవడమే. అసలు హీరో - హీరోయిన్ ఎప్పుడు ప్రేమించుకున్నారో అర్ధం కాదు. హీరోయిన్ పాత్ర చాలా సిల్లీగా ప్రవర్తిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ లేకపోవడమే సమస్య అంటే.. వారి మధ్య ఎడబాటుకు కారణమయ్యే కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా కన్విన్సింగ్ గా అనిపించదు. అసలు ఈ కథలో ఒక కారణంతో అబ్బాయిని బ్లాక్ చేసిన అమ్మాయి మళ్ళీ ఎందుకు తన దగ్గరికి వస్తుందో అర్థం కాదు. అలా వచ్చిన అమ్మాయి హీరోతో మాట్లాడకుండా వెళ్లిపోవడం ఏంటో అంతుబట్టదు. అన్నీ హీరోయిన్ చేసి హీరోని నిందించడం ఏంటో అర్ధం కాదు. అలాగే హీరో ఉన్నట్లుండి ఆడవాళ్లను పొగడ్డంలోనూ ఔచిత్యం కనిపించదు. చివర్లో ఆడవాళ్లు కష్టాలు పడుతున్నారు, వాళ్లకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వాళ్ళని అర్ధం చేసుకోవట్లేదు అనే డైలాగులకు.. కథకి సంబంధం ఏంటో అర్థం కాదు. ఇలా లాజిక్ లేని బోలెడన్ని సన్నివేశాల మధ్య కేవలం ఫ్రెండ్స్ మధ్య కామెడీ సీన్లు మాత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి.
‘రోమాంచకం’ మొదట్లో కొంచెం ప్రామిసింగ్ గానే అనిపిస్తుంది. రోమాంచకం ప్రథమార్ధం అంతా హీరో స్టార్టప్ కంపెనీ పెట్టే ప్రయత్నాలు.. హీరోయిన్ తో పరిచయం.. ఆమెకు క్లోజ్ అవ్వడం.. ఫ్రెండ్స్ తో కామెడీ సీన్లతో తో సింపుల్ గా సాగిపోతుంది. మైథిలి అన్వేష్ ను బ్లాక్ చేసి.. మళ్ళీ హైదరాబాద్ కి వచ్చి మిస్ అవ్వడంతో ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా కాస్త ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ దగ్గర హీరో - ఫ్రెండ్స్ మధ్య వచ్చే సీన్ బాగానే పేలింది. ప్రేక్షకులు ఇక్కడ ఒకచోట బాగా నవ్వుకుంటారు. ద్వితీయార్ధంలో ఏదో సస్పెన్స్ ఉంటుంది అని ఎదురుచూస్తాం. కానీ అక్కడి నుంచి కథ అంతగా ఆసక్తి రేకెత్తించదు. ఉపేంద్ర లిమాయే చేసిన పోలీస్ పాత్రతో కామెడీ ట్రై చేసినా పండలేదు. స్నేహితులతో కలిసి హీరో హీరోయిన్ని వెతికే సీన్లు బాగానే ఉన్నా మిగతా సన్నివేశాలు సాగదీశారు. హీరో హీరోయిన్ల కంటే.. ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ ఫేమ్ నరేంద్ర రవి పాత్ర సెకండాఫ్ ను కొంత ఎంగేజింగ్ గా మార్చింది. సినిమాలో క్లైమాక్స్ బాగానే పండింది. అక్కడ కూడా కామెడీ వర్కవుట్ అయింది. ట్విస్టు ఓకే. ‘రోమాంచకం’ టైటిల్ కు న్యాయం చేసే సినిమా కాదు. ఇందులో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే సీన్లు లేవు. కానీ కామెడీ వరకు ఓకే. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా టైంపాస్ బడ్డీ కామెడీ కోసమైతే దీనిపై ఒక లుక్కేయొచ్చు.
నటీనటులు:
సుమంత్ ప్రభాస్ ఈజ్ ఉన్న నటుడని ఇంతకుముందు అతను హీరోగా నటించిన రెండు సినిమాల్లో చూపించాడు. ఈ చిత్రంలోనూ అన్వేష్ పాత్రను ఈజీగా చేసుకుపోయాడు. ఎక్కువగా ఫ్రస్టేషన్ చూపించాల్సి వచ్చే పాత్రలో అతను బాగా ఒదిగిపోయాడు. కామెడీ బాగా చేశఆడు. అతను జెన్జీ యువతకు నచ్చుతాడు. అనంతిక సనీల్ కుమార్ సినిమా అంతా క్యూట్ గా కనిపిస్తూ అలరించింది. తన పాత్ర అంత గొప్పగా లేకపోయినా.. అనంతిక అప్పీయరెన్స్- పెర్ఫామెన్స్ బాగున్నాయి. ఆర్టిస్టులందరిలోకి హైలైట్ నరేంద్ర రవినే. అతడి కామెడీ టైమింగ్ బాగుంది. భవిష్యుత్తులో అతను మంచి రేంజికి వెళ్తాడనిపిస్తుంది. వెంకటేష్ కాకుమాను కూడా బాగా చేశాడు. ఫ్రెండ్స్ పాత్రలు చేసిన మిగతా ఆర్టిస్టులు కూడా ఓకే. డైరెక్టర్ అనుదీప్ చివర్లో చిన్న అతిథి పాత్రలో నవ్విస్తాడు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా ‘రోమాంచకం’ మెప్పిస్తుంది. కెమెరామన్ పవన్ పప్పుల విజువల్స్ బాగున్నాయి. కలర్ ఫుల్ విజువల్స్ తో ఫ్రెష్ గా అనిపిస్తాయి ఫ్రేమ్స్. వాసుకి వైభవ్.. రాధా రమణ పాటతో మ్యాజిక్ చేశాడు. మిగతా పాటలు కూడా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. భద్రకాళి పిక్చర్స్ నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి.. ఓ మోస్తరు పనితనం చూపించాడు. అతడి రైటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. ప్రేమకథ మీద.. కాన్ఫ్లిక్ట్ మీద అతను ఇంకా కసరత్తు చేయాల్సింది. ఐతే స్నేహితుల మధ్య కామెడీ ప్రధానంగా సాగే సన్నివేశాల వరకు తన రాత-తీత బాగుంది. ఓవరాల్ గా కథాకథనాల్లో ఒక కొత్త దర్శకుడి నుంచి ఇంతకంటే ఎక్కువ ఫ్రెష్నెస్ ఆశిస్తారు.
చివరగా: ‘రోమాంచకం’ టైటిల్‌కు తగ్గ రోమాంచనం లేకపోయినా.. టైంపాస్ బడ్డీ కామెడీ కోసం ఓ లుక్కేయొచ్చు!
రేటింగ్ - 2.5/5
