Begin typing your search above and press return to search.

కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్.. కోలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

ఈ పరిస్థితి వస్తుందని తాను ఊహించలేదని, కనీసం సాయంత్రం 6 గంటల నుంచైనా షోలు పడతాయని ఆశిస్తున్నట్లు ఆయన ఎమోషనల్ అయ్యారు.

By:  M Prashanth   |   14 May 2026 5:25 PM IST
కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్.. కోలీవుడ్‌లో ఏం జరుగుతోంది?
X

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'కరుప్పు' సినిమా విడుదల విషయంలో గత కొద్ది గంటలుగా జరుగుతున్న పరిణామాలు ఆ హీరో అభిమానిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. భారీ అంచనాలతో థియేటర్ల వద్దకు చేరుకున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. పాత బకాయిల సెటిల్మెంట్లు పూర్తి కాకపోవడంతో మార్నింగ్, మధ్యాహ్నం షోలు రద్దయ్యాయి. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కావడమే కాకుండా, అందరినీ కలచివేస్తోంది.

తన సినిమా ఇలాంటి ఇబ్బందుల్లో చిక్కుకోవడాన్ని జీర్ణించుకోలేక ఆర్జే బాలాజీ లైవ్ వీడియోలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతో కష్టపడి తీసిన సినిమా ఇలా ఆర్థిక కారణాల వల్ల ఆగిపోవడం ఒక దర్శకుడిగా ఆయనను మానసిక వేదనకు గురిచేసింది. కేవలం సినిమా చూడటం కోసమే పొద్దున్నే ఎంతో దూరం ప్రయాణించి థియేటర్లకు వచ్చిన అభిమానులకు ఆయన చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు.

ఈ పరిస్థితి వస్తుందని తాను ఊహించలేదని, కనీసం సాయంత్రం 6 గంటల నుంచైనా షోలు పడతాయని ఆశిస్తున్నట్లు ఆయన ఎమోషనల్ అయ్యారు. నిజానికి ఒక దర్శకుడు తన పనిని పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంత తపన పడతాడో బాలాజీ కన్నీళ్లలో కనిపిస్తోందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సినిమా అనేది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ఒక దర్శకుడికి అది ఒక జీవితం. తన కళ్ల ముందే ప్రేక్షకులు షోలు పడక వెనుదిరగడం ఏ దర్శకుడైనా భరించలేని విషయం.

బాలాజీ పడుతున్న బాధను చూసి నెటిజన్లు ఆయనకు అండగా నిలుస్తున్నారు. ఒక క్రియేటివ్ పర్సన్ ఇలా ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడటం దురదృష్టకరమని అంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, కోలీవుడ్ నిర్మాణ వ్యవస్థలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారీ సినిమాలను నిర్మిస్తున్నప్పుడు చివరి నిమిషం వరకు ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాకపోవడం అనేది పరిశ్రమకు తీరని నష్టం. సూర్య వంటి పెద్ద హీరో ఉన్నా సరే, రిలీజ్ రోజున ఇలాంటి సమస్యలు రావడం వల్ల కేవలం నిర్మాతలే కాదు, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కూడా భారీగా నష్టపోతారు.

ఒక పక్కా ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇలాంటి గందరగోళం నెలకొంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న క్రేజ్ వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్‌లో జరిగాయి. కానీ ఇప్పుడు షోలు రద్దు కావడంతో టికెట్లు కొన్న ఆడియన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్జే బాలాజీ చెప్పినట్లు సాయంత్రం లోపు సమస్యలన్నీ తొలగిపోయి సినిమా సజావుగా విడుదల కావాలని అంతా కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఏ దర్శకుడికి కూడా ఎదురుకాకూడదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక 'కరుప్పు' విడుదల వివాదం టాలీవుడ్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమధ్య కార్తీ సినిమాతో పాటు తెలుగులో అఖండ 2 సినిమాకు కూడా చివరి నిమిషంలో బ్రేక్ పడింది. పబ్లిసిటీ ఎంత గొప్పగా చేసినా, ఫైనాన్షియల్ గ్రౌండ్ వర్క్ పక్కాగా లేకపోతే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పటికే పలు ఘటనలు ఉదాహరణగా నిలిచాయి. మరి మేకర్స్ ఈ విషయంలో ఎంత త్వరగా ఒక సొల్యూషన్ తీసుకువస్తారో చూడాలి. ఈ సినిమా తెలుగులో వీరభద్రుడు అనే టైటిల్ తో విడుదల కానుంది.