ట్రైలర్ టాక్: ఛత్రపతి శివాజీ వీరత్వం.. ఎమోషనల్ విజువల్ ట్రీట్
మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరగాథను వెండితెరపై ఆవిష్కరిస్తూ రూపొందిన `రాజా శివాజీ` చిత్ర ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
By: Sivaji Kontham | 21 April 2026 9:57 AM ISTమరాఠా సామ్రాజ్య స్థాపకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరగాథను వెండితెరపై ఆవిష్కరిస్తూ రూపొందిన `రాజా శివాజీ` చిత్ర ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. మరాఠా చరిత్రను అత్యంత భారీ స్థాయిలో చూపించబోతోందని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. ఐదు దశాబ్దాల క్రితం జరిగిన చారిత్రక పోరాటాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో చిత్ర బృందం సఫలమైందని ట్రైలర్ చెబుతోంది.
ట్రైలర్ ఆరంభంలో ఒక చిన్నపిల్లాడు మొఘలుల జెండా గురించి అడిగే ప్రశ్నతో కథలోని గాంభీర్యం అర్థమవుతుంది. అణచివేతకు గురవుతున్న ప్రజల ఆవేదనను.. స్వరాజ్య స్థాపన కోసం ఒక వీరుడు చేసే అగ్నిపరీక్షను ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. శివాజీ మహారాజ్ పాత్రలో రితేష్ దేశ్‌ముఖ్ ఆహార్యం ..గంభీరమైన మాట తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా స్వరాజ్యం గురించి అతడు చెప్పే సంభాషణలు రోమాంచితంగా ఉన్నాయి.
సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందిందని ట్రైలర్ విజువల్స్ చెబుతున్నాయి. నాటి కాలం నాటి కోటలు, యుద్ధ క్షేత్రాలు .. సహజ సిద్ధమైన వాతావరణాన్ని చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. శివాజీ మహారాజ్ - అఫ్జల్ ఖాన్ మధ్య సాగే మైండ్ గేమ్స్, యుద్ధ తంత్రాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అజయ్-అతుల్ అందించిన నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశానికి ఒక కొత్త ఊపిరిని పోసి ప్రేక్షకులలో దేశభక్తిని నింపుతోంది.
నటీనటుల విషయానికి వస్తే.. శివాజీ మహారాజ్ తల్లి జిజియాబాయి పాత్రలో జెనీలియా దేశ్‌ముఖ్ అద్భుతమైన అభినయాన్ని కనబరిచారు. ఒక వీరుడిని తయారు చేసే శక్తివంతమైన తల్లిగా ఆమె పాత్ర సినిమాకు ప్రాణవాయువులా కనిపిస్తోంది. మరోవైపు అఫ్జల్ ఖాన్ పాత్రలో సంజయ్ దత్ క్రూరత్వం .. పవర్‌ఫుల్ లుక్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ పాత్రల మధ్య సాగే ఘర్షణ వెండితెరపై ఒక విజువల్ వండర్‌గా ఉండబోతోంది.
ఓవరాల్ గా `రాజా శివాజీ` ట్రైలర్ ఒక దృశ్య కావ్యంలా ఆకట్టుకుంటోంది. చరిత్రను గౌరవిస్తూ.. నేటి తరానికి శివాజీ మహారాజ్ గొప్పతనాన్ని చాటిచెప్పేలా రితేష్ ఈ చిత్రాన్ని మలిచినట్లు కనిపిస్తోంది. 1 మే 2026న విడుదల కానున్న ఈ చిత్రం కేవలం మరాఠీలోనే కాకుండా... పాన్ ఇండియా స్థాయిలో ఇతర భాషల్లో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాలి. రితేష్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జియో స్టూడియోస్- ముంబై ఫిల్మ్ కంపెనీ వనరుల్ని సమకూర్చాయి.
