ట్రెండీ టాక్: సినిమా లాభనష్టాల్లో వాటా.. ఎవరెవరికి వర్తింపజేయాలి?
ఈ సమస్యకు పరిష్కారంగా `లాభాల్లో వాటా` అనే విధానం తెరపైకి వచ్చింది. ఒక సినిమా సమిష్టి కృషి వల్ల తయారవుతున్నప్పుడు దాని ఫలితాన్ని కూడా అందరూ సమిష్టిగా పంచుకోవడమే హేతుబద్ధం.
By: Sivaji Kontham | 3 May 2026 9:00 PM ISTసినిమా రంగంలో పారితోషికాల గందరగోళం పతాక స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఒక భారీ బడ్జెట్ సినిమా రూపొందుతోందంటే అందులో 60 నుండి 70 శాతం బడ్జెట్ కేవలం నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలకే సరిపోతోంది. స్టార్ హీరోలు, హీరోయిన్లు, అగ్ర దర్శకులతో పాటు ఛాయాగ్రాహకులు, సంగీత దర్శకులు, స్టంట్ కొరియోగ్రాఫర్లు కూడా ఇప్పుడు కోట్లల్లో పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. చివరికి విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల రేంజ్ కూడా కోట్ల మార్కును దాటేసింది. ఈ నేపథ్యంలో సినిమా హిట్ అయితే అదనపు క్రెడిట్ తీసుకునే వీరంతా.. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ముందే భారీ మొత్తాలను వసూలు చేయడం వల్ల నిర్మాతలపై మోయలేని ఆర్థిక భారం పడుతోంది.
ఈ సమస్యకు పరిష్కారంగా `లాభాల్లో వాటా` అనే విధానం తెరపైకి వచ్చింది. ఒక సినిమా సమిష్టి కృషి వల్ల తయారవుతున్నప్పుడు దాని ఫలితాన్ని కూడా అందరూ సమిష్టిగా పంచుకోవడమే హేతుబద్ధం. కోట్లలో పారితోషికం తీసుకునే ప్రతి ఒక్కరూ ఈ విధానం కింద పని చేస్తే.. సినిమా నిర్మాణ సమయంలో నిర్మాతపై వడ్డీల భారం తగ్గుతుంది. అంతేకాకుండా.. సినిమా ఒకవేళ పరాజయం పాలైతే ఆ నష్టాన్ని కూడా లాభనష్టాల వాటా ప్రాతిపదికన అందరూ పంచుకోవాలి. దీనివల్ల నిర్మాత ఒక్కడే రోడ్డున పడే పరిస్థితి తప్పుతుంది. పరిశ్రమలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది.
అయితే ఈ నిబంధనను ఆర్టిస్టులకు వర్తింపజేయడంపై కోలీవుడ్ లో నడిగర సంఘం (ఆర్టిస్టుల సంఘం) పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ప్రాజెక్ట్ సక్సెస్ అయినప్పుడు వాటాలు ఆశించే వారు.. ఫెయిల్యూర్ బాధ్యతను కూడా తీసుకోవాలన్నది సినీ విశ్లేషకుల వాదన. దీనికోసం ఒక శాస్త్రీయమైన `స్లాబ్ విధానం` అమలు చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఉదాహరణకు ఒక నిర్దిష్ట పరిమితి (ఉదాహరణకు రూ.1 కోటి) కంటే ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసే ప్రతి ఒక్కరినీ ఈ లాభనష్టాల వాటా పరిధిలోకి తీసుకురావాలి. దీనివల్ల భారీ పారితోషికాలు తీసుకునే వారికి సినిమా నాణ్యతపై మరింత బాధ్యత పెరుగుతుంది.
ఈ విధానం వల్ల సినిమా నాణ్యత కూడా మెరుగుపడే అవకాశం ఉంది. కేవలం పారితోషికం తీసుకునే వ్యక్తికి సినిమా ఫలితంతో పెద్దగా పని ఉండదు.. కానీ లాభాల్లో వాటా ఉంటే.. ప్రతి టెక్నీషియన్ తన పనిని మరింత అంకితభావంతో చేస్తారు. ఎందుకంటే సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తే.. వారి ఆదాయం అంతగా పెరుగుతుంది. పారితోషికాల రూపంలో మిగిలిన బడ్జెట్‌ను విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) .. నిర్మాణ విలువలపై ఖర్చు చేయడం ద్వారా గ్లోబల్ స్థాయిలో పోటీ పడే చిత్రాలను అందించవచ్చు. ఇది అటు నిర్మాతకు.. ఇటు ప్రేక్షకులకు కూడా మేలు చేస్తుంది.
ఈ లాభనష్టాల వాటా విధానం కేవలం `టాప్ స్లాబ్` నిపుణులకు మాత్రమే పరిమితం చేయాలి. రోజువారీ వేతనంపై ఆధారపడే చిన్న స్థాయి ఆర్టిస్టులు, కార్మికులకు ఇది వర్తింపజేయడం సరికాదు. కోట్లు తీసుకునే హీరోలు, దర్శకులు, కీలక టెక్నీషియన్లు ఈ రిస్క్‌లో భాగస్వాములైనప్పుడే సినీ పరిశ్రమ ఆరోగ్యకరంగా మనుగడ సాగించగలదు. సినిమా అనేది ఒక వ్యాపారమైనప్పుడు అందులో భాగస్వాములైన వారంతా లాభనష్టాలను సమానంగా పంచుకోవడమే నైతికంగా-ఆర్థికంగా సరైన నిర్ణయం. ఇటీవలి కాలంలో పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు పరిమితంగా పారితోషికం తీసుకుంటూ, లాభాల్లో వాటా ప్రాతిపదికన ఒప్పందం చేసుకోవడంపై చాలా చర్చ సాగింది. అయితే లాభాల్లో వాటా ప్రాతిపదికకు అవసరమయ్యే నియమాలను, మార్గ దర్శకాలను చిత్రపరిశ్రమలు చాలా మౌళిక అంశాలను విశ్లేషించి తయారు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం లాభాల్లో వాటా గురించి చర్చలు ఆరంభ దశలో ఉన్నాయి. భవిష్యత్ లో ఏఐ ఎంత వేగంగా దూసుకెళుతోందో, అంతే వేగంగా పరిశ్రమలో పరిణామాలు మారిపోతాయని అంచనా వేస్తున్నారు. చివరికి ఏది ఏం జరిగినా.. అందరికీ అన్నం పెట్టే నిర్మాతలు అప్పుల పాలై సొంత ఇల్లు, ఆస్తులు అమ్ముకుని దివాళా తీసి నాశనమైపోకుండా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పరిశ్రమపైనే ఉంది.
