సినిమా టికెట్ సెగ: వినోదం ఖరీదైన వేళ..
ఒకప్పుడు రూపాయి.. రెండు రూపాయలకే లభించిన సినిమా వినోదం.. నేడు సగటు కుటుంబానికి గుదిబండగా మారుతోంది.
By: Srikanth Kontham | 14 Jun 2026 4:00 AM ISTఒకప్పుడు రూపాయి.. రెండు రూపాయలకే లభించిన సినిమా వినోదం.. నేడు సగటు కుటుంబానికి గుదిబండగా మారుతోంది. మరీ ముఖ్యంగా మెట్రో నగరాల్లోని మల్టీప్లెక్స్‌ల హవా పెరిగిన తర్వాత ప్రాంతాల వారీగా టికెట్ ధరల్లో కనిపిస్తున్న వ్యత్యాసాలు సామాన్య ప్రేక్షకుడిని థియేటర్లకు దూరం చేస్తున్నాయి. సినిమాను ఒక కళగా కంటే కేవలం వ్యాపార దృక్పథంతోనే చూస్తూ ప్రేక్షకులపై ఆర్థిక భారం మోపుతున్నారనే ఆవేదన ఇండస్ట్రీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది.
ఇలాంటి తరుణంలో బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నటించిన `గవర్నర్` చిత్ర బృందం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ ఉన్నప్పటికీ సినిమా అసలు కథాంశం 1990ల నాటి ఆర్థిక సంక్షోభం చుట్టూ తిరగడంతో.. నాటి కాలానికి గౌరవంగా మొదటి 25 వేల మంది ప్రేక్షకులకు కేవలం 50 రూపాయలకే టికెట్లు కేటాయించారు. స్టార్ కాస్ట్, భారీ హంగులు లేకపోయినా.. కంటెంట్ బాగుంటే తక్కువ ధరలతోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చని ఈ ప్రయోగం నిరూపించి సరికొత్త చర్చకు తెరలేపింది.
బాలీవుడ్‌లో మల్టీప్లెక్స్ కల్చర్ ఎక్కువే అయినప్పటికీ అక్కడ ఫ్లెక్సీ రేట్ల విధానం ప్రేక్షకులకు కొంత ఊరటనిస్తోంది. శని, ఆదివారాల్లో .. పండుగ దినాల్లో డిమాండ్‌ను బట్టి రేట్లు ఎక్కువగా ఉన్నా.. సోమవారం నుండి గురువారం వరకు (వర్కింగ్ డేస్) ధరలను గణనీయంగా తగ్గిస్తారు. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలు వారాంతాల్లో కాకుండా మిగిలిన రోజుల్లో తక్కువ బడ్జెట్‌తో థియేటర్ అనుభూతిని పొందే అవకాశం లభిస్తోంది. ఇటు ఎగ్జిబిటర్లకు, అటు ప్రేక్షకులకు ఇదో చక్కని సమతుల్యతను ఇస్తోంది.
అయితే టాలీవుడ్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా, ఆందోళనకరంగా మారుతోంది. భారీ బడ్జెట్, గ్రాఫిక్స్ ఖర్చులు, స్టార్ల రెమ్యునరేషన్లను సాకుగా చూపిస్తూ.. సినిమా విడుదలైన మొదటి రెండు వారాల పాటు టికెట్ రేట్లను భారీగా పెంచేస్తున్నారు. సింగిల్ స్క్రీన్లలో కూడా ఒక్కో టికెట్ 400 నుండి 500 రూపాయలకు చేరడంతో, నలుగురు ఉన్న ఒక మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. నిర్మాతల బడ్జెట్ భారాన్ని పూర్తిగా ప్రేక్షకులపైనే రుద్దడం ఎంతవరకు న్యాయమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇలా విపరీతమైన ధరల పెంపు వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువని ట్రేడ్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. టికెట్ రేట్లు భరించలేక జనాలు థియేటర్లకు రావడం తగ్గించేశారు. సినిమాకు మైండ్ బ్లోయింగ్ టాక్ వస్తే తప్ప థియేటర్ వైపు చూడటం లేదు. కొన్ని రోజులు ఆగితే ఓటీటీలోకి వస్తుంది కదా? అక్కడ చూసుకుందాం అనే ధోరణి పెరగడానికి ఈ అధిక ధరలే కారణం. దీంతో స్టార్ సినిమాలే కాకుండా.. చిన్న , మధ్య తరహా చిత్రాలు థియేటర్లలో నిలదొక్కుకోలేకపోతున్నాయి.
సినిమా పరిశ్రమకు ప్రేక్షకుడే దేవుడు అని స్టేజీలపై చెప్పే మేకర్స్ వారి జేబులు గుల్ల చేసేలా నిర్ణయాలు తీసుకోవడం పరిశ్రమ మనుగడకే ప్రమాదకరం. ఇప్పటికైనా బాలీవుడ్ తరహాలో ఫ్లెక్సీ రేట్ల విధానాన్ని తీసుకురావాలి లేదా సినిమా బడ్జెట్‌తో సంబంధం లేకుండా థియేటర్ల స్థాయిని బట్టి శాశ్వత ధరల నియంత్రణను అమలు చేయాలి. అప్పుడే సామాన్యుడికి సినిమా వినోదం మళ్లీ అందుబాటులోకి వస్తుంది. థియేటర్ల వ్యవస్థ కూడా బ్రతుకుతుంది.
