పారితోషికంలో చుక్కలు చూపిస్తున్న స్టార్ హీరో
కాంతార ఫేం రిషబ్ శెట్టి చుక్కలు చూపిస్తున్నాడు. తాజా సమాచారం మేరకు.. అతడు కాంతార ప్రీక్వెల్ కోసం ఏకంగా 1200 రెట్లు అధికంగా పారితోషికం అందుకోబోతున్నాడని తెలిసింది.
By: Tupaki Desk | 9 July 2025 9:49 AM ISTకాంతార ఫేం రిషబ్ శెట్టి చుక్కలు చూపిస్తున్నాడు. తాజా సమాచారం మేరకు.. అతడు కాంతార ప్రీక్వెల్ కోసం చాలా అధికంగా పారితోషికం అందుకోబోతున్నాడని తెలిసింది. ఆ మేరకు హోంబలే ఫిలింస్ తో అతడు ఒప్పంద పత్రంపై సంతకం చేసాడని మీడియాలో కథనాలొస్తున్నాయి.
నిజానికి చాలా పరిమిత బడ్జెట్ తో రూపొందించిన 'కాంతార' (2020) చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమా పాన్ ఇండియాలో ఏకంగా 360 కోట్లు పైగా వసూలు చేసిందని కథనాలొచ్చాయి. ఈ సినిమాకి రిషబ్ స్వయంగా రచన, దర్శకత్వ విభాగాల్లో వందశాతం ఎఫర్ట్ పెట్టాడు. నటుడిగాను అతడి ప్రదర్శనకు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు కురిసాయి. కాంతార సినిమాని సోలోగా భుజానికెత్తుకుని అతడు ఇంత సాధించాడు.
అందుకే ఇప్పుడు అతడి హార్డ్ వర్క్ ఫలించి కాంతార ప్రీక్వెల్ కోసం 100 కోట్ల పారితోషికం, అదనంగా లాభాల్లో వాటా అందుకోబోతున్నాడని తెలుస్తోంది. 'కాంతార' చిత్రం కోసం రిషబ్ కేవలం 4 కోట్లు మాత్రమే అందుకున్నాడు. కానీ ఇప్పుడు చాలా పెంచాడంటూ కన్నడ మీడియాల్లో కథనాలు వచ్చాయి.
కాంతార గ్రాండ్ సక్సెస్ సాధించడంతో ఇప్పుడు ప్రీక్వెల్ కోసం రిషబ్ - హోంబలే బృందాలు సర్వశక్తులు ఒడ్డి సినిమాని తెరకెక్కిస్తుండడం చర్చగా మారింది. ఈ సినిమాలో ఒక పోరాట సన్నివేశం నభూతోనభవిష్యతి అనేవిధంగా ఉంటుందట. దీనిలో 500 మంది యుద్ధ నిపుణులతో రిషబ్ భీకర పోరాటం సాగిస్తాడు. ఈ సీన్ లో 3000 మంది పైగా పని చేస్తున్నారు. దీనిని ఒక పట్టణం సెట్ లో 50 రోజుల పాటు చిత్రీకరించారని, భారతీయ సినిమాల్లో ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని యాక్షన్ దృశ్యమిదని చెబుతున్నారు. పురాణాలు, జానపద ఇతి వృత్తంతో కథాంశం రక్తి కట్టిస్తుందని కూడా కథనాలొస్తున్నాయి.
