డ్రగ్స్ కేసులో అరెస్టయిన స్టార్‌కిడ్‌కి అండగా తెలుగు నటి!
కానీ అప్పటికే మీడియా తప్పుడు ప్రచారం వల్ల చాలా నష్టమే జరిగింది. ఒక రకంగా తనపై కోర్టు విచారణ ప్రారంభం కాక ముందే మీడియాలు ఇష్టానుసారం కథనాలు అల్లడంతో ఆ డ్యామేజ్ తన కెరీర్ ని, లైఫ్ ని కూడా నాశనం చేసాయి.
By: Sivaji Kontham | 3 Jun 2026 3:00 PM ISTఆమె ఊహించని రీతిలో హత్యానేరం-డ్రగ్స్ సిండికేట్ భాగస్వామి అనే ఆరోపణలతో అరెస్ట్ అయింది. ఈ కేసుతో ఎన్నో అనుమానాస్పద ఆర్థిక వ్యవహారాలు ముడిపడి ఉండటంతో పలు ఏజెన్సీలు దర్యాప్తు చేసాయి. డ్రగ్స్ వ్యవహారాన్ని నార్కోటిక్స్ బ్యూరో అధికారులు విచారించగా, ఆర్థిక వ్యవహారాలలో సిట్, సిబిఐ సహా పలు దర్యాప్తు సంస్థలు ఈ నటీమణిని విచారించాయి. అయితే చివరివరకూ ఈ కేసులో పోరాడిన సదరు నటి నిరపరాధిగా బయటపడింది.
కానీ అప్పటికే మీడియా తప్పుడు ప్రచారం వల్ల చాలా నష్టమే జరిగింది. ఒక రకంగా తనపై కోర్టు విచారణ ప్రారంభం కాక ముందే మీడియాలు ఇష్టానుసారం కథనాలు అల్లడంతో ఆ డ్యామేజ్ తన కెరీర్ ని, లైఫ్ ని కూడా నాశనం చేసాయి. అయితే ఈ కేసు ముగిసిన ఇన్నేళ్ల తర్వాత కూడా మీడియా అరాచకాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్రంగా వాపోయింది సదరు నటి. ఈ నటి ఎవరో కాదు.. తూనీగ తూనీగ ఫేం రియా చక్రవర్తి. తెలుగులో పలు చిత్రాలలో నటించిన రియా, బాలీవుడ్ లోను కెరీర్ ని కొనసాగించింది. కానీ తన జీవితంలోకి అనూహ్యంగా పెను తూఫాన్ ప్రవేశించి విధ్వంశం సృష్టించింది. తన ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోగా, దానికి కారకురాలు రియా అంటూ మీడియా నిందించింది. ఇది హత్య.. ఈ హత్య చేసింది రియా చక్రవర్తి అంటూ ప్రచారం సాగిపోయింది.
అయితే కోర్టు సుదీర్ఘ విచారణ తర్వాత ఇవన్నీ తప్పుడు కథనాలు అని తేలిపోయింది. ఇక తాను ఇవన్నీ ఎదుర్కొన్న కొంత కాలానికి కింగ్ ఖాన్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పేరు డ్రగ్స్ కేసులో మార్మోగింది. ఆర్యన్ కూడా ఈ కేసులో తనను తాను నిరపరాధి అని నిరూపించుకున్నాడు. అయితే ఈ కేసు నడుస్తున్న క్రమంలోనే రియా చక్రవర్తి నేరుగా ఆర్యన్ ఖాన్ ని కలిసి అండగా నిలిచేందుకు ప్రయత్నించారట.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న రియా.. మూడేళ్ల క్రితం స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నప్పుడు తాను అతడిని సంప్రదించినట్లు వెల్లడించారు. ఆర్యన్ ఎదుర్కొన్న పరిస్థితులు, మీడియా ట్రోలింగ్ చూసినప్పుడు తనకు తన పాత రోజులు గుర్తొచ్చాయని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆర్యన్ ఖాన్ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులు తన కథ కంటే కూడా, తన సోదరుడు షోవిక్ చక్రవర్తి కథను ఎక్కువగా పోలి ఉన్నాయని రియా పేర్కొన్నారు. 2020లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి) రియాతో పాటు ఆమె సోదరుడిని కూడా ఈ కేసులోకి లాగిన సంగతి తెలిసిందే. ఆర్యన్ కూడా అదే తరహా మీడియా తుఫానును ఎదుర్కొంటున్నప్పుడు ఆ దృశ్యాలను చూడటం తనకు మానసికంగా చాలా కష్టంగా అనిపించిందని ఆమె చెప్పారు. ఆ సమయంలోనే తాను ఆర్యన్‌ను కలిసి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించానని, ఇప్పటికీ తాను మీడియాకు వీలైనంత దూరంగా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు.
ఆ క్లిష్ట పరిస్థితుల్లో సమాజం- మీడియా నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా.. తనకు అండగా నిలబడిన కొద్దిమంది ప్రాణస్నేహితులను రియా ఈ సందర్భంగా కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లో తనను సమర్థిస్తూ తనకు మద్దతుగా మాట్లాడటం అనేది ఇండస్ట్రీలో ఏమాత్రం సేఫ్ కాదని ఆమె అన్నారు. ఎవరైనా తనకు సపోర్ట్ చేస్తే సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయడమే కాకుండా, వారి కెరీర్‌లోని అవకాశాలను కూడా కోల్పోయే పరిస్థితి ఉండేదని రియా ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కానీ షిబానీ, నిధి, అనీషా, సమీషా, అనూష వంటి తన స్నేహితురాళ్లు ధైర్యంగా నిలబడి తనకు రక్షణగా నిలిచారని కొనియాడారు.
తన స్నేహితులతో పాటు నటుడు సాఖిబ్ సలీమ్, నటి హుమా ఖురేషిలు కూడా తన కుటుంబానికి కొండంత అండగా నిలిచారని రియా చెప్పుకొచ్చారు. తాను, తన సోదరుడు షోవిక్ ఇద్దరూ జైల్లో ఉన్న సమయంలో సాఖిబ్ సలీమ్ తన తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ మానసిక ధైర్యాన్ని ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. జీవితంలో ఇలాంటి మంచి వ్యక్తులు లభించడం తన అదృష్టమని, కష్టాల్లో తోడుండే ఒక్క నిజమైన స్నేహితుడు ఉన్నా ప్రపంచంలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొని నిలబడవచ్చని భావోద్వేగంగా మాట్లాడారు.
సుశాంత్ సింగ్ మరణం తర్వాత వాట్సాప్ చాట్స్ ఆధారంగా ఎన్‌సీబీ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బెయిల్ వచ్చినా ప్రయాణాలపై ఆంక్షలు ఉండటం వంటి పరిణామాలు రియా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ చేదు అనుభవాల వల్ల ప్రస్తుతం ఆమె పబ్లిక్ అటెన్షన్ - నిరంతర నిఘాకు దూరంగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. జనాల నుండి అనవసరమైన ప్రశ్నలను తాను కోరుకోవడం లేదని, ఒకవేళ ఎవరైనా తనను రోడ్డుపై చూసినా సరే, అక్కడ తాను లేనట్లుగా భావించి పట్టించుకోకుండా వెళ్ళిపోవాలని రియా చక్రవర్తి కోరడం తన మనసులోని భయాన్ని, వైరాగ్యాన్ని సూచిస్తోంది.
