Begin typing your search above and press return to search.

ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్‌తో ఎవ‌రిని కెలుకుతాడు?

దివంగ‌త న‌టుడు ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ తెర‌కెక్క‌నుంద‌ని చాలా కాలంగా ప్ర‌చారం ఉంది.

By:  Tupaki Desk   |   22 March 2024 4:39 AM GMT
ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్‌తో ఎవ‌రిని కెలుకుతాడు?
X

దివంగ‌త న‌టుడు ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ తెర‌కెక్క‌నుంద‌ని చాలా కాలంగా ప్ర‌చారం ఉంది. అప్ప‌ట్లో ఉయ‌య్ బ‌యోపిక్ లో సందీప్ కిష‌న్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తాడ‌ని, కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తార‌ని ప్ర‌చార‌మైంది. అయితే ప్రస్తుతం నాకు బయోపిక్‌లు చేసే ఉద్దేశం లేదని, త‌న‌ను అలాంటి క‌థ‌తో ఎవ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని సందీప్ కిష‌న్ ఆ త‌ర్వాత వివ‌ర‌ణ ఇచ్చాడు.

ఉదయ్ కిరణ్ టాలీవుడ్‌లో ఎలాంటి సినీనేప‌థ్యం లేకుండానే అత్యంత వేగంగా ఎదిగిన ప్ర‌తిభావంతుడైన హీరో. అతడు తమిళంలోను మూడు సినిమాల్లో న‌టించాడు. యువ‌త‌రంలో గొప్ప ఫాలోయింగ్ ఉన్న హీరోగా అత‌డి పేరు మార్మోగింది. అయితే 2014లో అనివార్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. 2003లో చిరంజీవి కుమార్తె సుస్మితతో నిశ్చితార్థం జరిగినప్పుడు ఉదయ్ కిరణ్ హెడ్ లైన్స్ లో నిలిచాడు. కానీ ఆ వివాహం జ‌ర‌గ‌లేదు. ఆ తర్వాత అతడు తమిళం మాట్లాడే అమ్మాయి విషితను 24 అక్టోబర్ 2012న వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలుగా అతడి జీవితంపై బయోపిక్ రూపొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అవేవీ నిజాలు కాలేదు.

తాజా సమాచారం మేర‌కు... వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ ని తెర‌కెక్కించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలిసింది. ఆర్జీవీ ఇప్ప‌టికే దీనిపై గ్రౌండ్ వ‌ర్క్ ప్రారంభించాడ‌ని కూడా గుస‌గులు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల వ‌రుస‌గా తెలుగు దేశం వ‌ర్గాల్ని, మెగా కాంపౌండ్ ని టార్గెట్ చేస్తూ ఆర్జీవీ సినిమాలు తీసారు. అయితే ఉద‌య్ కిర‌ణ్ జీవితంలోని ఒక ఎపిసోడ్ మెగా కుటుంబంతో ముడి ప‌డి ఉన్న‌ది. అందువ‌ల్ల ఆర్జీవీ ఈ వివాదాల‌ను అన‌వ‌స‌రంగా ట‌చ్ చేస్తాడా? అంటూ అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. వివాదాల‌తో ప్ర‌చారం కొట్టేసే రామ్ గోపాల్ వ‌ర్మ ఒక‌వేళ ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ ని ప్రారంభిస్తే క‌చ్ఛితంగా వివాదాన్ని రాజేసేందుకు ప్ర‌య‌త్నించ‌కుండా ఆప‌లేమ‌ని కూడా విశ్లేషిస్తున్నారు.