Begin typing your search above and press return to search.

గ్యాంగ్‌స్ట‌ర్ దావూద్ ఇబ్ర‌హీం పాత్రను త‌ప్పుగా చూపారు: ఆర్జీవీ

వివాదాస్ప‌ద‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా బాక్సాఫీస్ సంచ‌ల‌నం `ధురంధర్ 2` చిత్రంపై తనదైన శైలిలో స్పందించారు.

By:  Sivaji Kontham   |   17 April 2026 10:01 AM IST
గ్యాంగ్‌స్ట‌ర్ దావూద్ ఇబ్ర‌హీం పాత్రను త‌ప్పుగా చూపారు: ఆర్జీవీ
X

వివాదాస్ప‌ద‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా బాక్సాఫీస్ సంచ‌ల‌నం `ధురంధర్ 2` చిత్రంపై తనదైన శైలిలో స్పందించారు. ఈ సినిమా విడుదలైనప్పటి నుండి ఆదిత్య ధర్ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభను.. చిత్ర కథనాన్ని ఆర్జీవీ ప్రశంసిస్తూనే ఉన్నారు. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ పై అప‌రిమిత‌మైన ప్రేమ‌ను కురిపించారు. కావాల్సినంత ఉచిత ప‌బ్లిసిటీ చేసి పెట్టారు. అయితే ఈ చిత్రంలోని ఒక కీలక అంశంపై మాత్రం ఆర్జీవీ ఇప్పుడు గట్టి అభ్యంతరం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.

ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ.. సినిమాలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాత్రను చూపించిన విధానాన్ని తప్పుపట్టారు. ఈ చిత్రంలో దావూద్‌ను `బడే సాహబ్` అనే పేరుతో పిలుస్తూ.. పాకిస్థాన్ నుంచి భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నడిపించే మాస్టర్‌మైండ్‌గా చిత్రీకరించారు. అయితే ఈ విధమైన చిత్రణ వాస్తవానికి చాలా దూరంగా ఉందని వర్మ అభిప్రాయపడ్డారు. తనకు తెలిసిన సమాచారం ప్రకారం.. గూఢచారి వ్యవస్థలు చూపిస్తున్న విధంగా దావూద్ ప్రస్తుతం అంతటి క్రియాశీలకంగా లేరని ఆయన పేర్కొన్నారు.

నేర సామ్రాజ్యానికి సంబంధించిన విషయాలపై లోతైన అవగాహన ఉన్న వర్మ.. దావూద్ ఇబ్రహీం సుమారు 20 ఏళ్ల క్రితమే నేర ప్రపంచం నుండి విరమణ (రిటైర్మెంట్) పొందారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దావూద్ తనంతట తానుగానే ఈ విధమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని.. ప్రస్తుతం ఆయన ఎటువంటి ఆపరేషన్లను నిర్వహించడం లేదని తనకు సమాచారం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో సినిమాలో అత‌డిని ఒక‌ దేశంపై దాడులకు వ్యూహకర్తగా చూపించడం సరైనది కాదని వర్మ వాదించారు.

అయితే ఈ విషయంలో తనదే అంతిమ నిర్ణయం అని తాను చెప్పడం లేదని కూడా ఆర్జీవీ స్పష్టం చేశారు. ఎవరు కూడా ఈ విషయంలో నిపుణులు కాలేరు.. ఏది నిజమో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. ``దర్శకుడు తన వాదనను నిరూపించలేడు.. నేను నా అభిప్రాయాన్ని కాదనలేను`` అంటూ చమత్కరించారు. ఇలాంటి చీకటి సామ్రాజ్యపు వ్యక్తుల జీవితాల్లో ఎప్పుడూ ఒక అనిశ్చితి ఉంటుందని.. సినిమాటిక్ పరంగా ఆ పాత్రను ఎలా చూపించినా.. వాస్తవ ప్రపంచంలో మాత్రం ఆ ప్రభావం వేరేలా ఉంటుందని ఆయన విశ్లేషించారు.

రణవీర్ సింగ్ హమ్జా అలీ మజారీ పాత్ర‌లో నటించారు. భార‌త‌దేశం నుంచి పాకిస్తాన్ లో అడుగుపెట్టే స్పై పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషించారు. పాకిస్థాన్‌లోకి చొరబడి ప్రతీకారం తీర్చుకునే ఒక స్పై కథాంశంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమాపై ఆర్జీవీ విశ్లేషణ మరింత చర్చకు దారితీస్తోంది. క‌థ, క‌థ‌నం ప‌రంగా సినిమాను మెచ్చుకుంటూనే.. చారిత్రక లేదా నిజ జీవిత పాత్రల విషయంలో దర్శకులు మరింత జాగ్రత్తగా ఉండాలని వర్మ పరోక్షంగా సూచించారు.