అమితాబ్ వల్లే... వర్మ మరోసారి నోటి దురుసు
ఆయన ఈ మధ్య కాలంలో కాస్త వివాదాలకు దూరంగా ఉంటున్నాడు అనుకున్న వెంటనే ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వార్తల్లో నిలవడం మనం చూస్తున్నాం
By: Tupaki Desk | 5 Jun 2025 9:25 PM ISTవివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా వివాదాస్పదంగా ఉంటుంది. ఆయన ఈ మధ్య కాలంలో కాస్త వివాదాలకు దూరంగా ఉంటున్నాడు అనుకున్న వెంటనే ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వార్తల్లో నిలవడం మనం చూస్తున్నాం. తాజాగా ఈయన అనురాగ్ కశ్యప్ తో కలిసి ఇండియా టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో వర్మ సినిమాల బడ్జెట్ గురించి వ్యాఖ్యలు చేశాడు, అవసరం ఉన్నా.. లేకున్నా భారీగా సినిమాకు ఖర్చు చేస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ఇండియన్ సినిమా స్థాయి పెరిగింది అంటూ బడ్జెట్‌ను పెంచారు అన్నాడు. తన సత్య సినిమాకు మరో అయిదు కోట్లు బడ్జెట్ అధనంగా పెట్టి ఉంటే కచ్చితంగా సర్వనాశనం అయ్యేది అన్నాడు.
అదే ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ.. 1970, 80 లలో అమితాబ్ బచ్చన్ చేసిన సినిమాలను రీమేక్ చేయడం లేదా అనధికారికంగా కాపీ చేయడం వల్ల సౌత్ ఇండియన్ హీరోలు స్టార్స్ అయ్యారు. కేవలం బచ్చన్ సినిమాలను రీమేక్ చేయడం వల్లే సౌత్ ఇండస్ట్రీలో సినిమాల స్థాయి పెరిగింది. సౌత్ హీరోలను అక్కడి ప్రేక్షకులు దేవుళ్ల మాదిరిగా పూజించడం మొదలు పెట్టారు. మాస్ హీరోల ఇమేజ్ రావడానికి కారణం కూడా బచ్చన్ సినిమాలను రీమేక్ చేయడం అని వర్మ అన్నాడు. కేవలం బచ్చన్ చేసిన మాస్ సినిమాలను ఇక్కడ చేసి ప్రేక్షకుల అభిమానంను దక్కించుకోవడం ద్వారా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, చిరంజీవి, రజనీకాంత్, రాజ్ కుమార్ వంటి వారు స్టార్స్ అయ్యారు.
బాలీవుడ్‌లో మాస్ సినిమాల జోరు తగ్గింది, మ్యూజికల్ సినిమాల హంగామా మొదలు అయింది. కానీ సౌత్‌లో మాత్రం అదే మాస్ సినిమాల జోరు కొనసాగింది. మాస్ మసాలా సినిమాలను తీయడం కంటిన్యూ చేయడం ద్వారా సౌత్ సినిమాల స్థాయి పెరిగింది. మ్యూజికల్ సినిమాలపై ఫోకస్ పెట్టడం ద్వారా బాలీవుడ్ సినిమాల పరిధి తగ్గిందని వర్మ అన్నాడు. ఇప్పటికీ మాస్ సినిమాలను గతంలో వచ్చిన అమితాబ్ బచ్చన్ సినిమాల నుంచి కాపీ చేస్తున్నారు అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆయన సౌత్ సినిమాలను, సౌత్ ఫిల్మ్ మేకర్స్ యొక్క క్రియేటివిటీని తగ్గించి మాట్లాడాడు అంటూ విమర్శలు చేస్తున్నారు.
గతంలోనూ వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. అమితాబ్ పై ఆయనకు ఉన్న అభిమానంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని చాలా మంది అంటారు. బచ్చన్‌పై ఆయనకు ఉన్న అభిమానంతో ఎంత గొప్పగా అయినా మాట్లాడవచ్చు. అదే సమయంలో ఇతరులను తగ్గించడం మాత్రం అస్సలు మంచి పద్దతి కాదు అంటూ వర్మ తీరును పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వర్మ గతంలోనూ హీరోలను తక్కువ చేసి మాట్లాడటం జరిగింది. ఆయనకు సౌత్ సినిమాలంటే అస్సలు గౌరవం ఉండదని కొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి వర్మ గురించి మరో వారం రోజుల పాటు మాట్లాడుకునే విధంగా ఈ ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు ఉన్నాయి.
