తల్లిదండ్రులు- టీచర్స్ విద్యార్థుల కెరీర్‌ని ఖతం చేయడంలో భాగస్వాములు!- RGV
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) నేటి విద్యావ్యవస్థపై, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తెస్తున్న ఊహించని మార్పులపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది.
By: Sivaji Kontham | 28 July 2026 9:06 AM ISTసంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) నేటి విద్యావ్యవస్థపై, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తెస్తున్న ఊహించని మార్పులపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న నీట్ (NEET) పేపర్ లీకులు.. పరీక్షల రద్దు.. విద్యార్థుల ఆత్మహత్యలు అనేవి వ్యవస్థకు తగిలిన చిన్న గాయాలు మాత్రమేనని వర్మ తన సుదీర్ఘ లేఖాస్త్రంలో అభిప్రాయపడ్డారు. అసలైన విపత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో ముంచుకొస్తోందని... అది కాలం చెల్లిన ఈ విద్యావ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేస్తుందని ఆయన ముందస్తుగా హెచ్చరించారు. సమాచార సేకరణే ప్రామాణికంగా సాగిన పాత విధానాలకు కాలం చెల్లిందని.. ఏ మానవ మేధస్సు అందనంత వేగంగా ఏఐ సమాధానాలను అందిస్తోందని స్పష్టం చేశారు.
ఒక్కసారి కష్టపడి చదివి డిగ్రీ సాధిస్తే జీవితాంతం ప్రశాంతంగా బతకవచ్చనే పాతకాలపు నమ్మకాన్ని AI పూర్తిగా తుడిచిపెట్టేసిందని ఆర్జీవీ విశ్లేషించారు. ఇకపై కేవలం మార్కులు, ర్యాంకులు, విషయాలను బట్టీ పట్టి గుర్తుపెట్టుకునే సామర్థ్యానికి ఎలాంటి విలువ ఉండదని తేల్చి చెప్పారు. ప్రపంచం నిమిషాల్లో మారిపోతున్న ఈ యుగంలో నిరంతరం కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవడం ఒక్కటే బతికేందుకు ఏకైక మార్గం. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా తమను తాము మలుచుకోలేని వారు రేపటి పోటీ ప్రపంచంలో వెనుకబడిపోక తప్పదని పేర్కొన్నారు.
సాంప్రదాయ వృత్తి విద్యలైన ఇంజనీరింగ్, మెడిసిన్, లా, సీఏ, ఎంబీఏ, ఆర్కిటెక్చర్ వంటి కోర్సుల్లో ఏళ్ల తరబడి కష్టపడుతున్న విద్యార్థులు ఒక రకంగా కసాయి ఖానా వైపు అడుగులు వేస్తున్నారని వర్మ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. ఆయా కోర్సులు పూర్తయ్యేసరికి వాటి ఆధారిత ఉద్యోగాలను ఏఐ కైవసం చేసుకుంటుందని అన్నారు. జీతం అడగని, సెలవులు తీసుకోని, తప్పులు చేయని ఏఐ వ్యవస్థల ముందు సాంప్రదాయంగా చదువుకున్న విద్యార్థులు నిలబడలేరని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఒకే వ్యక్తి తనకు తానుగా ఏఐ సహాయంతో డాక్టర్, లాయర్, ఇంజనీర్, ఆడిటర్ పాత్రలను ఒకేసారి అత్యంత సమర్థవంతంగా నిర్వహించగలడని విశ్లేషించారు.
ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల వైఖరి మారాలని వర్మ గట్టిగా కోరారు. కోర్సులలో ఏఐ వినియోగాన్ని విధిగా నేర్పించకపోతే... విద్యార్థులను ఉనికిలో లేని ఉద్యోగాల కోసం సిద్ధం చేస్తున్నట్లే అవుతుందని హెచ్చరించారు. పాతకాలపు మార్కులు, డిగ్రీలను మాత్రమే ప్రామాణికంగా తీసుకునే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని.. అలాగే కాలం చెల్లిన సిలబస్‌ను ఇంకా సమర్థించే ఉపాధ్యాయులు విద్యార్థుల కెరీర్‌ను ఖతం చేయడంలో భాగస్వాములవుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
విద్యావ్యవస్థలో అసలైన సవాలు నీట్ కాదు ఏఐ! అని గ్రహించి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని వర్మ పిలుపునిచ్చారు. మండుతున్న ఇంట్లో కుర్చీలను ఎలా సర్దాలా అని చర్చించుకోవడం ఆపి... తక్షణమే పొగ వాసనను పసిగట్టి మేల్కోవాలని తనదైన శైలిలో ఆర్జీవీ చెప్పారు. సాంప్రదాయ చదువుల పేరుతో కాలయాపన చేయకుండా.. ఏఐ ని ఒక ఆయుధంగా ఉపయోగించడం నేర్చుకోవడమే ఏకైక శ్రేయస్కరమైన మార్గమని ఠిఫికల్ ఎనాలిసిస్ చేసారు. నిజానికి ఆర్జీవీలోని తర్కం, విశ్లేషణను లోతుగా అర్థం చేసుకునే ప్రతి విద్యార్థి తమ కొత్త గమ్యాన్ని నిర్ణయించుకోవడం సాధ్యమే.
