మూవీ రివ్యూ : ‘రివాల్వర్ రీటా’
‘మహానటి’తో గొప్ప పేరు సంపాదించిన కీర్తి సురేష్.. ఆ తర్వాత అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది.
By: Tupaki Desk | 28 Nov 2025 3:33 PM IST‘రివాల్వర్ రీటా’ మూవీ రివ్యూ
నటీనటులు: కీర్తి సురేష్- రాధిక శరత్ కుమార్- సునీల్- అజయ్ ఘోష్- జాన్ విజయ్- సూపర్ సుబ్బరాయన్- రెడిన్ కింగ్స్ లీ తదితరులు
సంగీతం: సీన్ రోల్డాన్
ఛాయాగ్రహణం: దినేష్ కృష్ణన్
నిర్మాతలు: సుధన్ సుందరం- జగదీష్ పళనిస్వామి
రచన-దర్శకత్వం: జేకే చంద్రు
‘మహానటి’తో గొప్ప పేరు సంపాదించిన కీర్తి సురేష్.. ఆ తర్వాత అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. కానీ అవేవీ పెద్దగా ఫలితాన్నివ్వలేదు. ఇప్పుడామె ‘రివాల్వర్ రీటా’ అవతారం ఎత్తింది. జేకే చంద్రు రూపొందించిన ఈ చిత్రం.. ఈ రోజే తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
పాండిచ్చేరికి చెందిన రీటా (కీర్తి సురేష్) ఒక రెస్టారెంట్లో పని చేస్తుంటుంది. తండ్రి లేని ఆమె.. తల్లితో పాటు అక్క-చెల్లితో కలిసి కష్టపడి బతుకుతుంటుంది. రీటా ఒక రోజు తన అక్క కూతురు పుట్టిన రోజు వేడుకకు రెడీ అవుతున్న టైంలో పాండిచ్చేరిలో పెద్ద రౌడీ అయిన డ్రాకులా పాండ్యన్ (సూపర్ సుబ్బరాయన్) అనుకోకుండా వాళ్లింటికి వచ్చి ప్రాణాలు కోల్పోతాడు. దీంతో అతడి శవాన్ని ఏం చేయాలో తెలియక అయోమయంలో పడుతుంది రీటా కుటుంబం. ఇంతలో పాండ్యన్ కొడుకు బాబీ (సునీల్) తన తండ్రి కోసం వెతకడం మొదలుపెడతాడు. పాండ్యన్ చావు కోసం ఎదురు చూస్తున్న గ్యాంగ్స్ మధ్య తన శవం కోసం కొట్లాట మొదలవుతుంది. ఇంకోవైపు పోలీసుల కళ్లు రీటా కుటుంబం మీద పడతాయి. వీళ్లందరినీ తప్పించుకుని ఈ సమస్య నుంచి రీటా కుటుంబం బయటపడిందా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
క్రైమ్ కామెడీల్లో చెప్పుకోదగ్గ కథ గురించి ప్రేక్షకులకు పెద్దగా పట్టింపు ఉండదు. కథనం ఎలా ఉందన్నదే చూస్తారు. డబ్బు చుట్టూనో లేదంటే ఏదైనా విలువైన వస్తువు చుట్టూనో.. లేదంటే ఒక హత్య చుట్టూనో తిరిగే ఈ కథలకు కథనమే చాలా ముఖ్యం. రేసీ స్క్రీన్ ప్లే.. ఆసక్తికర మలుపులు.. సిచువేషనల్ కామెడీ.. ఇవి ఉన్నాయంటే ఈ జానర్ సినిమాలను ఓ వర్గం ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. కానీ ఈ దినుసులు సరిగా కుదరకపోతే మాత్రం మొత్తం వంటకం తేడా కొట్టేస్తుంది. ‘రివాల్వర్ రీటా’లో అదే జరిగింది. కథ మాత్రమే కాకుండా కథనం కూడా మరీ రొటీన్ గా సాగడం.. ఎన్నో సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులోనూ కనిపించడం.. కీర్తి సురేష్ నుంచి ప్రేక్షకులు ఆశించే పెర్ఫామెన్స్ ఏమీ లేకపోవడంతో ‘రివాల్వర్ రీటా’ ఒక సాధారణ చిత్రంగా మిగిలిపోయింది.
నయనతార ప్రధాన పాత్రలో కొన్నేళ్ల ముందు ‘కొకో కోకిల’ అనే ఒక సినిమా వచ్చింది గుర్తుందా? ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డెబ్యూ మూవీ అది. ఆ డార్క్ క్రైమ్- కామెడీ థ్రిల్లర్ అంటే ఎలా ఉండాలో అదొక బెంచ్ మార్క్ సెట్ చేసింది కోలీవుడ్లో. పైకి అమాయకంగా కనిపించే అమ్మాయి.. అనుకోకుండా తన ఫ్యామిలీతో ఒక క్రైంలో భాగమై.. దాన్నుంచి బయటపడడానికి ఏం చేసింది.. తన తెలివితేటలతో అందరి ఆట ఎలా కట్టించిందనే కథతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా.. వినోదాత్మకంగా సాగిన చిత్రమిది. ‘రివాల్వర్ రీటా’ దర్శకుడు జేకే చంద్రుకు కూడా ఆ సినిమానే స్ఫూర్తిగా నిలిచినట్లుంది. ఐతే స్ఫూర్తి పొందడం వరకు ఓకే కానీ.. అతను దాదాపుగా అదే కథతోనే ఈ సినిమా తీశాడు. కానీ అందులో ఉన్నవి.. ఇందులో లేనివి ఏంటంటే.. కొత్తదనం-ఉత్కంఠ-వినోదం. ‘రివాల్వర్ రీటా’ లాంటి కథలు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి కథలో కోకొల్లలుగా వచ్చాయి. వాటి నుంచి భిన్నంగా నిలబెట్టే అంశాలేవీ ఇందులో లేవు. పేరుకు సినిమాలో ట్విస్టులు చాలానే ఉన్నాయి కానీ.. అవేవీ ప్రేక్షకులను ఆశ్చర్యపరచవు. కొంచెం కూడా థ్రిల్ పంచవు. కామెడీ కూడా ఇలాంటి ఫీలింగే ఇస్తుంది. బలవంతంగా నవ్వాలనుకున్నా నవ్వు రాని పరిస్థితి.
పాండిచ్చేరిలో ఒక పెద్ద రౌడీ.. దారి తప్పి అనుకోకుండా హీరోయిన్ ఇంట్లోకి వస్తాడు. హీరోయిన్ తల్లి హడావుడిలో ఒక దెబ్బకొడితే చనిపోతాడు. ఈ క్రైమ్ నుంచి హీరోయిన్ కుటుంబం తప్పించుకోవడానికి వాళ్లు ప్రయత్నిస్తుంటే.. వాళ్ల వెంట పడే రౌడీలు, పోలీసులుతో క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా నడుస్తుంది ‘రివాల్వర్ రీటా’. నలుగురు ఆడవాళ్లుండే ఇంట్లో ఒక రౌడీ చనిపోవడంతో పెద్ద టెన్షన్ బిల్డ్ అవ్వాలి.. ఉత్కంఠ రేగాలి కానీ.. అలాంటి ఫీలింగే రానివ్వకుండా చాలా తేలిగ్గా ఆరంభ సన్నివేశాలను లాగించేయడంతోనే ‘రివాల్వర్ రీటా’ మొదట్లో చప్పబడిపోయింది. ఈ నేరం నుంచి బయటపడడానికి హీరోయిన్ ఫ్యామిలీ తర్వాత చేసే ప్రయత్నాలు కూడా ఆసక్తికరంగా అనిపించవు. మరోవైపు రౌడీ గ్యాంగుల మధ్య గొడవలు.. ఎత్తులు పైఎత్తులు కూడా ఉత్కంఠభరితంగా అనిపించవు. ఒకరినొకరు మోసం చేయడం.. చంపుకోవడం.. ఇలా కథలో ట్విస్టులు వస్తాయి కానీ.. అవేమీ థ్రిల్లింగ్ గా అనిపించవు. కీర్తి సురేష్ కు ఓ మోస్తరు పాత్ర ఇచ్చినా తన పెర్ఫామెన్సుతో దాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్తుంది. కానీ తన పాత్రను మరీ సాధారణంగా రాసుకున్నాడు దర్శకుడు. ఆమె ప్రత్యేకతను చాటే సన్నివేశాలే ఇందులో లేకపోయాయి. క్లైమాక్సులో ఆ క్యారెక్టర్ కొంచెం పర్వాలేదనిపిస్తుంది. అక్కడొచ్చే మలుపులు కూడా పర్వాలేదు. కానీ అప్పటికే సినిమా ప్రేక్షకులకు భారంగా మారడంతో.. పతాక సన్నివేశాల వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది. మొత్తంగా చూస్తే రొటీన్ కథాకథనాలు.. ఇంటెన్సిటీ లేని సన్నివేశాల వల్ల ‘రివాల్వర్ రీటా’ పూర్తిగా మిస్ ఫైర్ అయింది.
నటీనటులు:
కీర్తి సురేష్ నటించిందంటే.. సినిమా ఎలా ఉన్నా తన పెర్ఫామెన్స్ బాగుంటుంది. కానీ ‘రివాల్వర్ రీటా’ మాత్రం ఆ కోవలో చేరదు. రీటా పాత్రలో ఏ ప్రత్యేకతా లేకపోవడంతో కీర్తి పెర్ఫామెన్స్ కూడా సాధారణంగా అనిపిస్తుంది ఇందులో. ఆమె చూడ్డానికి బాగుంది. హావభావాలు ఓకే. రాధిక శరత్ కుమార్ తల్లి పాత్రలో రాణించింది. ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్ పాండ్యన్ పాత్రలో ఓకే అనిపించాడు. ఆయన కొడుకు పాత్రలో సునీల్ గురించి మాట్లాడుకోవడానికేమీ లేదు. తన లుక్ బాగుంది కానీ.. పాత్ర తేలిపోయింది. అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఓకే. జాన్ విజయ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇలాంటి కామెడీ పోలీస్ పాత్రలు అతను చాలానే చేశాడు. రెడిన్ కింగ్స్ లీ కామెడీ పర్వాలేదనిపిస్తుంది. మిగతా ఆర్టిస్టులంతా మామూలే.
సాంకేతిక వర్గం:
‘రివాల్వర్ రీటా’ టెక్నికల్ గా ఓ మోస్తరుగా అనిపిస్తుంది. బిట్ సాంగ్స్ తప్ప ఫుల్ లెంగ్త్ పాటలు లేని ఈ చిత్రంలో సీన్ రోల్డాన్.. సినిమా శైలికి తగ్గ నేపథ్య సంగీతం అందించాడు. దినేష్ కృష్ణన్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. జేకే చంద్రు రచయితగా.. దర్శకుడిగా.. రెండు రకాలుగా నిరాశపరిచాడు. హాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు వచ్చిన అనేక క్రైమ్ కామెడీ సినిమాల నుంచి సన్నివేశాలను ఏరుకుని ఈ కథ రాసుకున్నట్లుందే తప్ప.. అతను కొత్తగా ఏమీ చూపించలేకపోయాడు. అక్కడక్కడా కొంచెం కామెడీ పండించగలిగినా.. ఉత్కంఠ రేకెత్తించేలా కథనాన్ని నడిపించలేకపోయాడు.
చివరగా: రివాల్వర్ రీటా.. గురి తప్పిన తూటా
రేటింగ్- 2/5
