Begin typing your search above and press return to search.

మూడు రోజుల తర్వాత రివ్యూలు.. సాధ్యమేనా?

దీని వల్ల నిర్మాతల గుండెలు గుబేలుమంటున్నాయని.. సినిమా రిలీజైన మూడు రోజుల తర్వాత రివ్యూలు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

By:  Tupaki Desk   |   21 Nov 2023 1:41 PM GMT
మూడు రోజుల తర్వాత రివ్యూలు.. సాధ్యమేనా?
X

రివ్యూల వల్ల సినిమాలకు మంచా చెడా అనే విషయాన్ని ఎవ్వరూ చెప్పలేరు. సినిమా బాగుంటే రివ్యూలు ప్లస్ అయి సినిమాలకు వసూళ్లు పెరుగుతాయి. అదే సమయంలో బాలేని సినిమాలను రివ్యూలు దెబ్బ కొడతాయి. ఏదైనా సినిమా ఎలా ఉందన్నదాన్ని బట్టే ఉంటుంది. ఐతే సినిమాల్లో సక్సెస్ రేట్ అన్నది చాలా చాలా తక్కువ. బాగున్న సినిమాల కంటే బాలేని సినిమాలే ఎక్కువగా ఉంటాయి.

అలాంటపుడు రివ్యూల వల్ల నష్టం అనే అభిప్రాయం ఏర్పడుతుంటుంది. ఈ రోజుల్లో సినిమాలన్నీ వీకెండ్ వసూళ్ల మీదే ఎక్కువ ఆధారపడుతుండటంతో అర్లీ మార్నింగ్ రివ్యూలు చాలా చేటు చేస్తున్నాయనే అభిప్రాయం నిర్మాతల్లో బలంగా ఉంది. అందుకే తరచుగా రివ్యూల విషయంలో ఇండస్ట్రీ వైపు నుంచి విమర్శలు వస్తుంటాయి. తాజాగా 'కోటబొమ్మాళి పీఎస్' ప్రమోషన్లలో భాగంగా రివర్స్ ప్రెస్ మీట్ పెట్టారు సినిమా వాళ్లు.

అంటే మీడియా వాళ్లను స్టేజ్ మీద కూర్చోబెట్టి సినిమా వాళ్లు ప్రశ్నలు అడగడం అన్నమాట. ఇక్కడ రివ్యూలు, రేటింగ్స్ గురించే ఎక్కువగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా అగ్ర నిర్మాత దిల్ రాజు.. అర్లీ మార్నింగ్ రివ్యూల మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వల్ల నిర్మాతల గుండెలు గుబేలుమంటున్నాయని.. సినిమా రిలీజైన మూడు రోజుల తర్వాత రివ్యూలు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా లేటుగా రివ్యూలివ్వాలనే చర్చ ఇప్పటిది కాదు. అది అనడానికి, వినడానికి బాగుంటుంది కానీ.. ప్రాక్టికల్‌గా సాధ్యమా అన్నది ప్రశ్న. ఇప్పుడు పాపులర్ వెబ్ సైట్లు అన్నీ ఒక మాట అనుకుని రివ్యూలు మూడు రోజుల తర్వాత ఇవ్వాలని నిర్ణయించుకున్నాయని అనుకుందాం. కానీ వందల వెబ్ సైట్లు, సోషల్ మీడియాను ఎవరు నియంత్రించాలి? ఈ రోజుల్లో మెజారిటీ ప్రేక్షకులు సినిమా టాక్ ఏంటో తెలుసుకునే థియేటర్లకు వస్తున్నారు.

పాపులర్ వెబ్ సైట్లు రివ్యూలు ఆపినా.. వేరే ప్రత్యామ్నాయాల ద్వారా టాక్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ఇంటర్నెట్ యుగంలో, సోషల్ మీడియా-వెబ్ మీడియా సముద్రంలో ఎవరిని ఎవరూ నియంత్రించలేరు. కాబట్టి రివ్యూలను ఆపడం, ఆలస్యం చేయడం అన్నది ఎవరి చేతుల్లోనూ ఉండదు. వాటిని అంగీకరించక తప్పదు. కాకపోతే అదే పనిగా సినిమాను టార్గెట్ చేయడం, హార్ష్‌ కామెంట్స్ చేయడం రివ్యూయర్లు నివారించాలి. అదే సమయంలో బాగున్న సినిమాను రివ్యూలు దెబ్బ తీయలేవని, బాలేని సినిమాను ఏం చేసినా కాపాడలేరనే విషయాలను సినిమా వాళ్లు అర్థం చేసుకుని ముందుకు సాగిపోవాలి.