బాలీవుడ్, హాలీవుడ్ పై రేవంత్ కీలక వ్యాఖ్యలు.. రాజమౌళికి రిక్వెస్ట్!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డులు ప్రదానోత్సవం శనివారం హైటెక్స్ లో అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 15 Jun 2025 11:06 AM ISTతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డులు ప్రదానోత్సవం శనివారం హైటెక్స్ లో అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. వివిధ కేటగిరీలకు చెందిన విజేతలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డులను ప్రదానం చేశారు. ఆ సమయంలో వేదికపై మాట్లాడిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుందని, కానీ సినీ ఇండస్ట్రీని జాగ్రత్తగా.. అభిమానంగా చూసుకుంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. అది ప్రోత్సహించడానికి, అభినందించడానికి అని స్పష్టం చేశారు.
సినీ ఇండస్ట్రీకి సముచిత స్థానం కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రైజింగ్- 2047 నినాదంతో తాము ముందుకు సాగుతున్నామన్న రేవంత్.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు కంప్లీట్ అయిన వేళ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలని రేవంత్ పిలుపునిచ్చారు.
అయితే అన్ని రంగాల్లాగే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా రాణించాలని తమ ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచిస్తుందని పేర్కొన్నారు. 2047 నాటికి తెలంగాణ ప్రభుత్వం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అభివృద్ధి చెందడం తమ లక్ష్యమని చెప్పారు. అందులో తెలుగు సినిమా పరిశ్రమ కోసం ఒక అధ్యాయాన్ని అంకితం చేస్తామని వెల్లడించారు.
"గతంలో భారతీయ సినిమాకు బాలీవుడ్ పేరు పెట్టారు. ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ చెన్నైలోనే కొనసాగుతుందనే అపోహ ఉంది. కానీ నేడు తెలుగు సినిమా పరిశ్రమ భారతీయ సినిమాను సూచిస్తుందని అందరికీ తెలుసు. దీన్ని సాధ్యం చేసిన, హైదరాబాద్‌ను భారతీయ సినిమాకు కేంద్రంగా మార్చిన వారి అభినందనలు" అని రేవంత్ చెప్పారు.
అయితే ప్రపంచమే గుర్తించే విధంగా అద్భుతమైన చిత్రాలు తెరకెక్కిస్తున్న రాజమౌళి వంటి దర్శకులు హాలీవుడ్ ను మన గడ్డపైకి ఎందుకు తీసుకు రావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుందని చెప్పారు. అందుకు ఏం కావాలో చెప్పండని అడిగారు. ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కల్పిస్తామని చెప్పారు. ఇంకా 22 సంవత్సరాలు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని చెప్పిన రేవంత్.. ఏ హోదాలో ఉన్నా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు.
