తెలంగాణలో టికెట్ల రేట్లు.. ఇక లేనట్లే?
2023 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత ఏడాది డిసెంబరు తొలి వారం వరకు కొత్త సినిమాలకు అదనపు షోలు, రేట్ల విషయంలో ఏ ఇబ్బందీ ఉండేది కాదు
By: Tupaki Desk | 16 Jun 2025 6:00 PM2023 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత ఏడాది డిసెంబరు తొలి వారం వరకు కొత్త సినిమాలకు అదనపు షోలు, రేట్ల విషయంలో ఏ ఇబ్బందీ ఉండేది కాదు. ఇలా దరఖాస్తు పెట్టుకోవడం.. అలా అనుమతులు రావడం.. సాఫీగా జరిగిపోయేది. మిడ్ రేంజ్ సినిమాలకు సైతం అదనపు షోలు, రేట్లు ఈజీగా ఇచ్చేసేవారు. కానీ ‘పుష్ప-2’ సినిమా రిలీజ్ టైంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో మొత్తం కథ మారిపోయింది.
దీని చుట్టూ పెద్ద వివాదం ముసురుకుని తెలంగాణ ప్రభుత్వం వెర్సస్ టాలీవుడ్ అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఆ దెబ్బతో తెలంగాణలో బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు తెరదించేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కొన్ని సినిమాలకు నిర్మాతలు అదనపు షోలు, రేట్ల కోసం ప్రయత్నించి ఫెయిలయ్యారు. నెమ్మదిగా నిర్మాతలు వాటి కోసం అడగడమే మానేశారు. ఐతే రోజులు గడిచాక పరిస్థితులు మారుతాయని.. ఇండస్ట్రీ తరఫున సీఎంను మెప్పించి కోరుకున్నవి సాధించుకుందాం అని సినీ పెద్దలు భావించారు. ఇందుకు గద్దర్ అవార్డుల వేడుక బాగా ఉపయోగపడుతుందని అనుకున్నారు.
కానీ ఈ అవార్డుల వేడుక తర్వాత పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా మారినట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ విషయంలో ఈ ఈవెంట్ తర్వాత సీఎం రేవంత్ మరింత వ్యతిరేకత పెంచుకున్నట్లుగా తెలుస్తోంది. గత పదేళ్ల కాలానికి అవార్డులు ప్రకటించగా, అందులో పురస్కారాలకు ఎంపికైన పలువురు హీరోలు, టెక్నీషియన్లు ఈ వేడుకకు హాజరు కాలేదు. మరోవైపు ఈ వేడుకకు హాజరు కావాలంటూ అనేకమంది సినీ పెద్దలకు ఆహ్వానాలు పంపితే.. వాళ్లూ పట్టించుకోలేదు. దీంతో ఈ వేడుక కళ తప్పింది. సీఎం రేవంత్ ఈ విషయంలో సీరియస్ అయ్యారని.. ఇండస్ట్రీ పట్ల మరింత కోపం తెచ్చుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
గద్దర్ అవార్డుల ఈవెంట్‌కు సంబంధించి అన్నీ తానై వ్యవహరించిన దిల్ రాజుకు ఈ విషయం తెలియడంతోనే ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి.. ఇండస్ట్రీ జనాలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడి వారైనా, షూటింగ్స్ ఉన్నా ప్రభుత్వం అవార్డులు ఇస్తే వచ్చి తీసుకోవాలి.. జాగ్రత్తగా వినండి అంటూ ఆయన హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేసేదే. ఐతే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని.. దిల్ రాజు ఇప్పుడు హెచ్చరించినా ప్రయోజనం లేదని.. రేవంత్ ఇక టాలీవుడ్ పట్ల సానుకూలంగా వ్యవహరించే పరిస్థితి లేదని.. బెనిఫిట్ షోలు, అదనపు రేట్ల గురించి మరిచిపోవచ్చని సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.