అల్లు సినిమాస్- అల్లు అరవింద్‌పై సీఎం రేవంత్ ప్రశంసలు
అల్లు అరవింద్ గారు ఎంతో ప్యాషన్‌తో, విదేశీ సాంకేతికతను జోడించి ఈ `అల్లు సినిమాస్` మల్టీప్లెక్స్‌ను నిర్మించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు.
By: Sivaji Kontham | 12 March 2026 10:12 PM ISTహైదరాబాద్ కోకాపేటలో అత్యంత విలాసవంతంగా నిర్మించిన `అల్లు సినిమాస్` ప్రారంభోత్సవ వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, అల్లు అరవింద్ గారిపై , అల్లు మల్టీప్లెక్స్ విశేషాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అల్లు అరవింద్ గారు ఎంతో ప్యాషన్‌తో, విదేశీ సాంకేతికతను జోడించి ఈ `అల్లు సినిమాస్` మల్టీప్లెక్స్‌ను నిర్మించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. కేవలం థియేటర్ నిర్మించడమే కాకుండా.. ప్రేక్షకులకు ఒక సరికొత్త ప్రపంచ స్థాయి అనుభూతిని అందించాలనే సంకల్పంతో ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ (75 అడుగుల వెడల్పు) వంటి అత్యాధునిక వసతులను ఇక్కడ ఏర్పాటు చేయడం ఆయన దూరదృష్టికి నిదర్శనమని ప్రశంసించారు. విదేశాల్లో ఉండే టెక్నాలజీని మన హైదరాబాద్‌కు తీసుకువచ్చినందుకు అరవింద్ ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
టాలీవుడ్ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పెంచడంలో అల్లు కుటుంబం పాత్ర కీలకమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హాలీవుడ్ సినిమాలతో పోటీపడే రేంజులో మన టాలీవుడ్ సినిమాలు ఉండాలని, అల్లు అరవింద్ తన అనుభవంతో అటువంటి భారీ చిత్రాలను నిర్మించాలని ఆయన కోరారు. మన దగ్గర ఉన్న ప్రతిభకు, సాంకేతికత తోడైతే అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటుతుందని.. దానికి ఈ అల్లు సినిమాస్ వంటి నిర్మాణాలు ఒక పునాది అని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సినీ పరిశ్రమకు అండగా ఉంటుందని.. ముఖ్యంగా హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా మార్చే క్రమంలో ఇటువంటి మల్టీప్లెక్స్‌ల నిర్మాణం ఎంతో దోహదపడుతుందని సీఎం అన్నారు. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాకుండా.. వేల మందికి ఉపాధిని ఇచ్చే రంగమని గుర్తుచేశారు. భవిష్యత్తులో కూడా అల్లు అరవింద్ మరిన్ని వినూత్న ప్రాజెక్టులతో ముందుకు రావాలని.. ప్రభుత్వం నుండి తగిన సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. అల్లు సినిమాస్ ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
థియేటర్లలో సౌండ్ టెక్నాలజీ
థియేటర్ అనుభూతిలో సౌండ్ కీలకమని సీఎం అన్నారు. ఈ మల్టీప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన 75 అడుగుల భారీ డాల్బీ సినిమా స్క్రీన్.. అత్యాధునిక సౌండ్ టెక్నాలజీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందని ప్రశంసించారు. విదేశాల్లో ఉండే సాంకేతికతను అరవింద్ హైదరాబాద్‌కి తీసుకువచ్చారని కొనియాడారు.
లారీ ఎక్కి వెళ్లి సెకండ్ షోలు చూసేవాళ్లం
తన బాల్య జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. మేము ఊర్లో ఉన్నప్పుడు లారీలు ఎక్కి వెళ్ళి సెకండ్ షో సినిమాలు చూసేవాళ్ళం! అని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. అప్పట్లో సినిమా అంటే ఉన్న క్రేజ్ గురించి మాట్లాడుతూ..సినిమా అనేది ఒక సామాజిక అంశంగా మారిందని.. అది మనుషుల జీవితాలను .. ఆలోచనా విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
