మాలీవుడ్‌కి ఈ విధానం ప్లస్సా మైనస్సా?
గళ్ల చొక్కా -లుంగీ పంచె, సాదా చీర -రవికె, పట్టు పరికిణీ - గౌను, జారే పవిట కొంగు, ధోతీలు, గౌనులు, కుర్తాలు, నైట్ గౌన్ లు, తెల్లంచు నల్ల చీర, సగటు పల్లెటూరి అమ్మాయి లేదా టూటైర్ సిటీ కుర్రాడి లుక్ ని తలచుకుంటే, అలాంటి రూపాల్ని తెలుగు, హిందీ చిత్రాల్లో చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారా?
By: Tupaki Desk | 20 April 2025 1:55 PM ISTగళ్ల చొక్కా -లుంగీ పంచె, సాదా చీర -రవికె, పట్టు పరికిణీ - గౌను, జారే పవిట కొంగు, ధోతీలు, గౌనులు, కుర్తాలు, నైట్ గౌన్ లు, తెల్లంచు నల్ల చీర, సగటు పల్లెటూరి అమ్మాయి లేదా టూటైర్ సిటీ కుర్రాడి లుక్ ని తలచుకుంటే, అలాంటి రూపాల్ని తెలుగు, హిందీ చిత్రాల్లో చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారా?
జీవితాన్ని యథాతథంగా ఉన్నది ఉన్నట్టు చూపించడం.. నటించడం అనే అతిశయోక్తి లేకుండా...మనలో ఒకరిగా సమాజంలో పాత్రలను తెరపై అందంగా ఆవిష్కరించడం మలయాళ చిత్రసీమ ప్రత్యేకత. ఇది తొలి నాళ్ల నుంచి ఉన్నదే. మలయాళీ దిగ్గజ దర్శకులు ఇదే పంథాను అనుసరించారు.
`ది గ్రేట్ ఇండియన్ కిచెన్` మలయాళ వెర్షన్‌లో కథానాయిక రోజువారీ దుస్తులు, గృహోపకరణాలు - నైటీలు, పాత కాటన్ దుస్తులు, మేకప్ లేకుండా కనిపించింది. ప్రతి మహిళా వంటగదిలో ఎదుర్కొనే కష్టాలను దీనిలో యథాతథంగా చూపించారు. కానీ హిందీ వెర్షన్ రీమేక్ `శ్రీమతి`లో మాత్రం పాత్ర వేషధారణ మారిపోయింది. స్టైలిష్ కాటన్ కుర్తీ సెట్ ధరించి మేకప్ వేసుకుని గృహిణి గ్లామరస్ గా కనిపిస్తుంది. ఎలివేషన్ కూడా ఉంటుంది. అయ్యప్పనుమ్ కోషియం మలయాళ వెర్షన్ లో పోలీస్ ఆఫీసర్ భార్య డీగ్లామ్ లుక్ తో సగటు మల్లూ బ్యూటీలా కనిపిస్తుంది. కానీ అదే మూవీ తెలుగు రీమేక్ `భీమ్లా నాయక్` లో భీమ్లా భార్యగా నటించిన నిత్యా మీనన్ ఐరన్ చేసిన కుర్తీలు.. చక్కని హెయిర్ స్టైల్ తో మోడ్రన్ గా మారిపోయింది.
మాలీవుడ్ ని అనుసరించి కోలీవుడ్ లో ఈ తరహా నేటివిటీ కథలు, పాత్రలు జీవం పోసుకుని ఆదరణ పొందాయి.
అయితే మలయాళంలో ఉన్నట్టు ఇతర భాషల్లో ఎందుకు పాత్రల్ని, పాత్రధారుల్ని యథాతథంగా చూపించడం లేదు? ఒకవేళ పొరుగు భాషల్లో అలా చూసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని భావించాలా? మలయాళ ప్రజలు విద్యావంతులు.. అందువల్ల వారికి జీవితాన్ని యథాతథంగా, ఉన్నదున్నట్టుగా చూపించినా, విషయాన్ని అర్థం చేసుకునే స్థాయి ఉంది. కేరళతో పోలిస్తే నిరక్షరాస్యత ఎక్కువగా ఉండే ఇతర రాష్ట్రాల్లో కచ్ఛితంగా గ్లామర్ అద్దకం అవసరమని భావించాలా? ఎలివేషన్ లేనిదే ఇక్కడ పనవ్వదని మన దర్శక నిర్మాతలు భావిస్తున్నారా?
