Begin typing your search above and press return to search.

పబ్లిక్ టాక్: 'రజాకార్‌' ఎలా ఉందంటే?

యాటా సత్యనారాయణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు.

By:  Tupaki Desk   |   15 March 2024 7:19 AM GMT
పబ్లిక్ టాక్: రజాకార్‌ ఎలా ఉందంటే?
X

తెలంగాణ విముక్తి పోరాటం, రజాకార్ల దాడి నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'రజాకార్‌'. ఇందులో ఇంద్రజ, బాబీ సింహా, అనసూయ, రాజ్‌ అర్జున్‌, మకరంద్‌ పాండే, వేదిక, ప్రేమ, జాన్‌ విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యాటా సత్యనారాయణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. ట్రైలర్ తోనే ఎన్నో వివాదాలకు తెర లేపిన ఈ చిత్రం.. అన్ని అడ్డంకులను దాటుకొని ఎట్టకేలకు ఈరోజు (మార్చి 15) శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం!

కథేంటంటే: భారతదేశానికి 1947 ఆగస్ట్‌ 15న స్వాతంత్య్రం వస్తే.. హైదరాబాద్‌ సంస్థానం మాత్రం 1948 సెప్టెంబర్‌ 17 వరకు నిజాంలు పరిపాలించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోని అన్ని రాజ్యాలను, సంస్థానాలను భారత్‌లో విలీనం చేయడానికి ప్రభుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తుంది. నిజాం ఏడో రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (మకరంద్ దేశ్ పాండే) మాత్రం దీనికి ససేమిరా అంటాడు. ర‌జాకార్లు అనబడే ప్రైవేటు సైన్యం ద్వారా హైద‌రాబాద్ సంస్థానాన్ని తుర్కిస్తాన్ అనే ప్రత్యేక దేశంగా ప్రకటించుకొని పాలన కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తాడు. ఇందులో భాగంగా రజాకార్ల చీఫ్ ఖాసిం రిజ్వీ (రాజ్ అర్జున్) ఆధ్వర్యంలో ప్రజలందరిని బలవంతంగా మతం మార్పిడి చేయించి, ఒకే మతానికి చెందిన దేశంగా మార్చాలని ప్రయత్నిస్తాడు. ఉర్దూని అధికార భాషగా ప్ర‌క‌టిస్తూ.. తెలుగు, క‌న్న‌డ‌, మ‌రాఠి భాష‌ల‌పై నిషేధం విధిస్తారు. ఇష్టారీతిన పన్నులు ప్రజలను చిత్ర హింసలకు గురి చేస్తూ.. మార‌ణ హోమం సృష్టిస్తారు. ఆ సమయంలో ఐలమ్మ(ఇంద్రజ), రాజిరెడ్డి(బాబీ సింహా), గూడూరు నారాయణతో సహా చాలామంది విప్లవకారులు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. నిజాం దురాగ‌తాలు తెలుసుకున్న అప్ప‌టి భార‌త హోంమంత్రి స‌ర్దార్ వ‌ల్ల‌భ‌భాయ్ ప‌టేల్ (రాజ్ స‌ప్రు) హైద‌రాబాద్ సంస్థానాన్ని భార‌త్‌లో విలీనం చేయడానికి పోలీస్ చర్య‌కు సిద్ధ‌ప‌డతారు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? నిజాం ప్రభువు నుంచి స్వాతంత్ర్యం సాధించే క్ర‌మంలో తెలంగాణ ప్ర‌జ‌లు ఎలాంటి తిరుగుబాటు చేశారు? వాళ్లను అణ‌గ‌దొక్కేందుకు ర‌జాకార్లు ఎలాంటి అకృత్యాల‌కు పాల్ప‌డ్డారు? భారత ప్రభుత్వం చేప‌ట్టిన పోలీస్ చర్య ఏంటి? అనేది తెలియాలంటే 'రజాకార్' సినిమా చూడాల్సిందే.

నిజాం ప‌రిపాల‌న‌లో హైద‌రాబాద్ సంస్థానంలో ఎలాంటి అరాచ‌కాలు, అకృత్యాలు జ‌రిగాయి.. ర‌జాకార్లు ఎంత‌టి దురాగ‌తాల‌కు పాల్ప‌డ్డారు అనేది చరిత్ర పుటల్లో ఇప్ప‌టికీ స‌జీవంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక సినిమాలు తెరకెక్కగా.. 'రజాకర్' రూపంలో మరోసారి తెర మీద ఆవిష్కరించే ప్ర‌యత్నం చేశారు ద‌ర్శ‌కుడు యాట‌ స‌త్య‌నారాయ‌ణ‌. తెలంగాణ చరిత్ర, స్వాతంత్ర్యానంత‌రం దేశంలోని ప‌రిస్థితుల‌తో సినిమాని ప్రారంభించి.. హైద‌రాబాద్ సంస్థానంలో నిజాం ప‌రిపాల‌న‌, ర‌జాకార్ల దురాగతాలను దుశ్చర్యలను చూపిస్తూ ఆస‌క్తిక‌రంగా కథను ముందుకు న‌డిపించారు.

ఫస్టాప్ లో నైజాం ప్రభువు పరిపాలన, రజాకర్ల అకృత్యాలను చూపిస్తే.. సెకండాఫ్ లో వాళ్లకి ఎదురు తిరిగిన ప్రజల పోరాట స్ఫూర్తిని చూపించారు. తెలంగాణ సాయుధ పోరాటంలోని ముఖ్యమైన ఘటనలతో కథనాన్ని నడిపించారు. మధ్యలో తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన విప్లవకారుల వీర గాథలను తెర మీద ఆవిష్కరించారు. అయితే ఈ క్రమంలో ఎక్కడా చరిత్రను వక్రీకరించి చూపించలేదు కానీ.. కొన్ని విషయాలను కప్పిపుచ్చి ఓ వర్గానికి అనుకూలంగా సినిమాను మలిచే ప్రయత్నం చేశారనే టాక్ వినిపిస్తోంది. నిజానికి తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్ట్‌ల పాత్ర ఎంతో కీలకం. కానీ ఈ సినిమాలో మాత్రం భార‌త సైన్యం రంగంలోకి దిగగానే వాళ్లు ఉద్య‌మం నుంచి ప‌క్క‌కు త‌ప్పుకొన్న‌ట్లు చూపించినట్లు తెలుస్తోంది. సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ని హీరోగా, ఖాసీం రజ్వీని విలన్‌గా చూపించారు.

రాజా రెడ్డిగా బాబీ సింహా, ఐలమ్మగా ఇంద్రజ, ఖాసీం రజ్వీగా రాజ్‌ అర్జున్‌ తమ నటనతో ఆకట్టుకున్నారు. అనసూయ పాత్ర నిడివి తక్కువే అయినా తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రేమ, వేదిక కూడా తమ పరిధి మేరకు నటించారు.. యాక్షన్‌ సన్నివేశాల్లోనూ అదరగొట్టారు. మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ గా మకరంద్‌ పాండే.. వల్లభాయ్‌ పటేల్‌గా తేజ్‌ సప్రు మెప్పించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కథలో భాగంగా వచ్చే పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ 1947-48నాటి తెలంగాణ వాతావరణాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించాయి. కె.రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.

ఓవరాల్ గా ద‌ర్శ‌కుడు స‌త్య‌నారాయ‌ణ త‌ను రాసుకున్న తెలంగాణ పోరాట గాథను 'రజాకార్' గా తెర‌పైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. కథ, స్ర్కీన్‌ప్లే.. చరిత్రలోని ఘటనల్ని ఆవిష్కరించిన తీరు, ప్ర‌ధాన తారాగణం న‌ట‌న ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా చెబుతున్నారు. మితిమీరిన హింస, క‌థాంశం సాగిన తీరు ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు అంత‌గా నచ్చక‌పోవ‌చ్చని టాక్ ని బట్టి తెలుస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.