రవితేజ మిస్ అయిందేమీ లేదు
మాస్ మహారాజా రవితేజకు కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చిందంటున్నారు.
By: Tupaki Desk | 11 April 2025 10:27 AM ISTసినీ ఇండస్ట్రీలో ఎవరు చేయాల్సిన సినిమా ఎవరి దగ్గరకు వెళ్లి ఆగుతుందో తెలియదు. ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేసి హిట్లు అందుకున్న సందర్భాలు కొన్ని ఉంటే, ఒకరు వదులుకున్న సినిమాను ఇంకొకరు చేసి డిజాస్టర్లను మూట గట్టుకున్న సందర్భాలు మరికొన్ని. సినిమా హిట్ అయినప్పుడు అనవసరంగా వదులుకున్నానే అని ఫీలైతే, అదే సినిమా ఫ్లాపైతే మాత్రం ఆ సినిమా చేయకుండా మంచి పనే చేశాంలే అనుకుంటారు.
మాస్ మహారాజా రవితేజకు కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చిందంటున్నారు. హిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా రవితేజ వరుసపెట్టి సినిమాలైతే చేస్తున్నాడు కానీ ఆ సినిమాలకు మంచి రెస్పాన్స్ మాత్రం రావడం లేదు. రవితేజ సాలిడ్ హిట్ కొట్టింది కరోనా టైమ్ లో గోపీచంద్ మలినేనితో కలిసి క్రాక్ మూవీతోనే. ఆ తర్వాత ధమాకా మూవీ హిట్ అయింది కానీ ఆ సినిమాలో వావ్ అనిపించే కంటెంట్ అయితే లేదన్నది వాస్తవం.
ధమాకా కాకుండా క్రాక్ తర్వాత రవితేజ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపులే. దీంతో క్రాక్ మూవీ చేసిన గోపీచంద్ తోనే మరో సినిమా చేయాలని ప్లాన్ చేసుకుని సినిమాను కూడా అనౌన్స్ చేశాడు రవితేజ. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించడానికి రెడీ అయింది. కానీ సినిమాకు ముందు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అవుతున్న కారణంగా ఆ ప్రాజెక్టు ఎవరూ ఊహించని విధంగా ఆగిపోయింది.
అయితే అదే కథను గోపీచంద్, బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ కు చెప్పి ఒప్పించి మైత్రీ ప్రొడక్షన్ లోనే సినిమా తీసి జాట్ తో బాలీవుడ్ డెబ్యూ చేశాడు. గదర్2 తర్వాత సన్నీ డియోల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో జాట్ కు మంచి హైప్ వచ్చింది. దానికి తోడు రిలీజ్ కు ముందు వచ్చిన ప్రోమోలు, టీజర్లు, ట్రైలర్ అన్నీ నార్త్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశాయి.
మొత్తానికి జాట్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సౌత్ సినిమాలకు బాగా అలవాటు పడిన నార్త్ ఆడియన్స్ కు జాట్ మూవీ బాగా నచ్చింది. సన్నీ డియోల్‌ను సౌత్ టచ్ ఉన్న మూవీలో చూడటాన్ని నార్త్ ఆడియన్స్ బాగా యాక్సెప్ట్ చేశారు. సినిమాలోని మాస్ సీన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నార్త్ లో అన్ని ఏరియాల నుంచి జాట్ కు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణే లభిస్తోంది.
బాలీవుడ్ వరకు రివ్యూలు కూడా బాగానే ఉన్నాయి. దీంతో ఈ సినిమాను రవితేజ మిస్ చేసుకున్నాడనే అభిప్రాయాలను నెటిజన్లు వెల్లిబుచ్చుతున్నారు. అయితే రవితేజ ఈ సినిమా చేయకూడదనుకోలేదు. గోపీచంద్ తో సినిమా చేయాలనుకునే కథ విని ఓకే చెప్పి డేట్స్ ఇవ్వాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు. దానికి తోడు జాట్ లాంటి కమర్షియల్ సినిమాలు రవితేజ తన కెరీర్లో చాలానే చేశాడు. టాలీవుడ్ లో కూడా అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. బాలీవుడ్ హీరోలకు, నార్త్ ఆడియన్స్ కు అలాంటి కథలు, సినిమాలు కొత్త కానీ టాలీవుడ్ లో అవేం కొత్త కాదు. కాబట్టి ఈ సినిమాకు సన్నీ డియోల్ బెటర్ ఆప్షన్.