అసలైన ‘ధురంధర్’..నబీ అహ్మద్ షకీర్‌గా మారిన కధ
సినిమాల్లో హీరోలు చేసే సాహసాలు చూసి మనం ఫిదా అయిపోతుంటాం. కానీ, నిజ జీవితంలో అంతకు మించిన వీరత్వం ప్రదర్శించిన గూఢచారి రవీంద్ర కౌశిక్.
By: Madhu Reddy | 23 March 2026 4:26 PM ISTసినిమాల్లో హీరోలు చేసే సాహసాలు చూసి మనం ఫిదా అయిపోతుంటాం. కానీ, నిజ జీవితంలో అంతకు మించిన వీరత్వం ప్రదర్శించిన గూఢచారి రవీంద్ర కౌశిక్. 'ధురంధర్ 2' సినిమా సూపర్ హిట్ కావడంతో, అసలైన ధురంధరుడు ఎవరు? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. రాజస్థాన్‌కు చెందిన ఒక సామాన్య యువకుడు, దేశం కోసం పాకిస్థాన్ ఆర్మీలోకి దూసుకెళ్లి 'మేజర్' స్థాయికి ఎదిగి, భారత్‌కు వెన్నుముకలా నిలిచిన వైనం నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఆయన త్యాగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
23 ఏళ్లకే సాహసం:
రాజస్థాన్‌కు చెందిన రవీంద్ర కౌశిక్ కేవలం 23 ఏళ్ల వయసులోనే 'రా' ఏజెంట్‌గా ఎంపికయ్యారు. దేశ భద్రత కోసం తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చుకుని, 'నబీ అహ్మద్ షకీర్' అనే పేరుతో పాకిస్థాన్‌లోకి అడుగుపెట్టారు. అక్కడ ఏమాత్రం అనుమానం రాకుండా ఎల్‌ఎల్‌బీ పూర్తి చేయడమే కాకుండా, పాక్ సైన్యంలో ఉద్యోగం కూడా సంపాదించారు. తన తెలివితేటలతో ఏకంగా 'మేజర్' హోదాకు చేరుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. శత్రువుల గుండెకాయ లాంటి సైన్యంలో ఉంటూనే మన దేశం కోసం పనిచేశారు.
పాక్ వ్యూహాలను చిత్తు చేసిన 'బ్లాక్ టైగర్':
1979 నుంచి 1983 మధ్య కాలంలో రవీంద్ర కౌశిక్ పాకిస్థాన్ ఆర్మీకి సంబంధించిన అత్యంత రహస్యాలను, వారి అణ్వాయుధ కార్యక్రమాల వివరాలను భారత్‌కు చేరవేసేవారు. ఆయన అందించిన సమాచారంతో శత్రువుల అనేక యుద్ధ తంత్రాలను భారత్ ముందే పసిగట్టి తిప్పికొట్టింది.ఇక రవీంద్ర ప్రతిభను గుర్తించిన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, ఆయనకు ‘బ్లాక్ టైగర్’ అనే బిరుదును ఇచ్చారు. ఆయన పంపిన ప్రతి సమాచారం మన దేశ భద్రతలో కీలక పాత్ర పోషించింది.
ఒక చిన్న పొరపాటు.. 16 ఏళ్ల జైలు జీవితం:
రవీంద్ర కౌశిక్ ప్రస్థానం సాఫీగా సాగుతున్న సమయంలో, భారత్ నుంచి వెళ్లిన ఒక జూనియర్ ఏజెంట్ చేసిన చిన్న తప్పు వల్ల ఆయన పాక్ అధికారులకు దొరికిపోయారు. 1983లో ఆయన్ని అరెస్ట్ చేసిన పాక్ ప్రభుత్వం, తీవ్రమైన చిత్రహింసలకు గురిచేసింది. ఇక దాదాపు 16 ఏళ్ల పాటు పాక్ జైళ్లలో కఠిన కారాగార శిక్ష అనుభవించారు. దేశం కోసం తన జీవితాన్ని ధారపోసిన రవీంద్ర, చివరకు 2001లో అనారోగ్యంతో జైలులోనే కన్నుమూశారు. కానీ ఆయన అందించిన సేవలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
ధురంధర్ రియల్ హీరో:
నేడు 'ధురంధర్ 2' వంటి సినిమాలు చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ రవీంద్ర కౌశిక్‌ను గుర్తు చేసుకుంటున్నారు. వెండితెరపై కనిపించే హీరోల కంటే, తెర వెనుక ఉండి దేశం కోసం ప్రాణాలర్పించిన ఇలాంటి రియల్ హీరోల కథలే గొప్పవి. ఆయన త్యాగం, తెగువ నేటి యువతకు స్ఫూర్తిదాయకం. దేశ భద్రత కోసం తన కుటుంబాన్ని, పేరును, ఆఖరికి ప్రాణాన్ని కూడా పణంగా పెట్టిన రవీంద్ర కౌశిక్ ఎప్పటికీ మన గుండెల్లో 'బ్లాక్ టైగర్' గానే నిలిచిపోతారు.
