Begin typing your search above and press return to search.

భోజ్ పురి ముఖచిత్రం మారుస్తానంటున్న విలన్..!

ఈ పరిశ్రమకు జాతీయ అవార్డ్ అందుకున్న వ్యక్తిగా ఆ మార్పు కోసం చూస్తున్నాను కానీ తాను ఇంత ప్రయత్నిస్తుంటే ఇక్కడ ఆల్బమ్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ ఇండస్ట్రీ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయని అన్నారు రవికిషన్.

By:  Tupaki Desk   |   29 Feb 2024 9:59 AM GMT
భోజ్ పురి ముఖచిత్రం మారుస్తానంటున్న విలన్..!
X

రేసుగుర్రం విలన్ రవికిషన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. భోజ్ పురి నటుడైన ఈయన తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. భోజ్ పురిలో ఆయనకు మంచి క్రేజ్ ఉంది. అయితే భోజ్ పురి అనగానే అందరికీ అశ్లీలత మైండ్ లోకి వస్తుంది. అక్కడ కేవలం అడల్ట్ సినిమాలే చేస్తారని అనుకుంటారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని అంటున్నారు రవికిషన్. భోజ్ పురి ఇండస్ట్రీ ముఖ చిత్రాన్ని మార్చేందుకు ప్రయత్నించాను.. ఈ పరిశ్రమకు జాతీయ అవార్డ్ అందుకున్న వ్యక్తిగా ఆ మార్పు కోసం చూస్తున్నాను కానీ తాను ఇంత ప్రయత్నిస్తుంటే ఇక్కడ ఆల్బమ్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ ఇండస్ట్రీ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయని అన్నారు రవికిషన్.

తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం భోజ్ పురి లో మహాదేవ్ కా గోరఖ్ పూర్ సినిమా చేస్తున్నా. ఇది పాన్ ఇండియా సినిమాగా వస్తుంది. ఈ సినిమాతో అందరి ఆలోచనలు మారిపోతాయని అంటున్నారు రవి కిషన్. నా జూనియర్లు కూడా కొత్త సినిమాలు తీసేందుకు ముందుకు వస్తారని.. చీప్ సన్నివేశాలు.. అసభ్యకర మాటలు.. చెత్త పాటలు లేకుండా మంచి సినిమాలు చేస్తారని అన్నారు.

గత కొన్నేళ్లలోనే తెలుగు సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ఈ విషయంలో రాజమౌళి సలహాలు తీసుకోవాలి. బాహుబలి 1, 2, RRR అలానే పుష్ప సినిమా చేసిన సుకుమార్ వారి సినిమాలతో టాలీవుడ్ క్రేజ్ ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ విషయంలో భోజ్ పురి ఇండస్ట్రీ రాజమౌళి నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలని అన్నారు రవికిషన్.

రాజ్ కుమార్ బర్జాత్యా, యష్ చోప్రా లాంటి వారు ఎంతో అందమైన సినిమాలు చేస్తారు. వారి సినిమాల్లో వల్గారిటీ ఉండదు. భోజ్ పురి సినిమా ఆ అసభ్యతను చూపించడం మానేయాలని అన్నారు రవికిషన్. రైటర్స్ కు మంచి పారితోషికం ఇవ్వాలి. హీరోలకు ఎక్కువ బడ్జెట్ పెట్టి రచయితలకు, టెక్నిషియన్లకు తక్కువ ఇవ్వకూడదని అన్నారు.

తెలుగు, మలయాళ పరిశ్రమలో కూడా చీప్ సినిమాలు తీస్తున్నారన్న విమర్శలు ఎప్పుడో ఒకసారి వినిపించే ఉంటాయి. వారు దాన్నుంచి ఎలా బయటపడ్డారు..? ఎలా అగ్రగామిగా నిలిచారు అన్నది మనం నేర్చుకోవాలని రవికిషన్ అన్నారు. భోజ్ పురి ఇండస్ట్రీ ముఖాన్ని మార్చేందుకు తాను ప్రయత్నిస్తున్నానని రవికిషన్ అన్నారు. ప్రస్తుతం ఆయన నటించిన మామ్లా లీగల్ హై వెబ్ సీరీస్ మార్చి 1న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది.