మాస్ రాజాకు మద్రాస్‌లో కేరాఫ్ అడ్రస్ ఆయనే!
కెరీర్‌లో టాప్ రేంజ్‌కి చేరుకున్న వారి జీవితాల్లో ప్రారంభం రోజులు చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి.
By: Tupaki Desk | 15 April 2025 11:01 AM ISTకెరీర్‌లో టాప్ రేంజ్‌కి చేరుకున్న వారి జీవితాల్లో ప్రారంభం రోజులు చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. కెరీర్ తొలి నాళ్లలో వాళ్లు పడిన స్ట్రగుల్, ఎదుర్కొన్న అవమానాలు, పోగోట్టుకున్న అవకాశాలు, తిరిగి దక్కించుకున్న ఛాన్స్‌లు చాలా ప్రత్యేకం. అలాంటి ఓ ప్రత్యేకమైన స్టోరీ మాస్ మహారాజా రవితేజ సినీ జర్నీ వెనుక ఉందట. ఈ విషయాన్ని తాజాగా నిర్మాత మల్లిడి సత్యనారాయణ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. రవితేజ కెరీర్ ఎలా మొదలైంది. తను ఎలా రైజ్ అయ్యాడు?. అతని వల్ల ఎలాంటి నష్టాన్ని తాను ఎదుర్కొన్నది వివరంగా వెల్లడించారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా అరంగేట్రం చేయడానికి ముందు డైరెక్షన్ టీమ్‌లో వర్క్ చేసిన విషయం తెలిసిందే. 1998లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని మద్రాస్ వెళ్లిన రవితేజ అక్కడే గుణశేఖర్, వైవీఎస్ చౌదరిలతో కలిసి ఒకే రూములో ఉన్నారట. అలా ఉంటూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న క్రమంలో విజయశాంతి `కర్తవ్యం`లో తొలిసారి నటించే అవకాశం దక్కిందట. అసిస్టెంట్ డైరెక్టర్‌గా క్రిమినల్, ఆజ్ కా గూండారాజ్, ప్రతిబంధ్ వంటి సినిమాలకు పనిచేశారు.
ఆ తరువాత కృష్ణవంశీతో పరిచయం ఏర్పడటంతో ఆయన `నిన్నే పెళ్లాడతా` సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చారట. అదే సినిమాలో రవితేజ చిన్న క్యారెక్టర్‌లోనూ కనిపించారు కూడా. ఆ తరువాత కృష్ణవంశీ రూపొందించిన `సిందూరం`లో చంటిగా కనిపించిన రవితేజ తనదైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించడం, వరుసగా హీరో అఫర్లని దక్కించుకోవడం తెలిసిందే. అయితే ఈ జర్నీలో రవితేజకు సహకరించిన ఓ సీనియర్ నిర్మాత ఉన్నారట. ఆయనే సీనియర్ ప్రొడ్యూసర్ వరాహ నరసింహరాజు అని,
చిరంజీవితో `రుద్రనేత్ర`,కృష్ణతో సర్దార్ కృష్ణమనాయుడు వంటి పెద్ది చిత్రాలు నిర్మించిన నిర్మాత ఆయన అని, ఆయన ఆఫీస్ మద్రాస్‌లో తెలుగు కళాకారులకు ఓ సత్రంలా ఉండేదని తెలిపారు మల్లిడి సత్యనారాయణ. అంతే కాకుండా ప్రొడ్యూసర్ వరాహ నరసింహరాజు భీమవరం రాజుగారు కావడంతో ఎంతో మందికి ఆయన అన్నం పెట్టారన్నారు. రవితేజ కూడా రాజు కావడం, రాజా రవీంద్ర కూడా రాజు కావడంతో ఆయన ఆఫీసుకి చేరేవారు. పొద్దున్నే లేచి రెడీ అయి పని ఏమీ లేకపోతే రవితేజతో పాటు చాలా మంది ఈ రాజుగారి ఆఫీసుకి చేరేవారు.
రాజుగారి సినిమాలకు నాతో పాటు క్రాంతి పిక్చర్స్ వారు డిస్ట్రిబ్యూటర్స్ కావడంతో నేను కూడా అక్కడికి వెళ్లేవాడిని. అక్కడే నాకు రవితేజ, రాజా రవీంద్ర పరిచయం అయ్యారు. ఆ తరువాత రవితో నేను బాగా క్లోజ్ అయ్యాను. హీరో అయితే మాకు సినిమా చేయాలని అప్పుడే మాట తీసుకున్నాను. వినాయక్‌ను దర్శకుడిగా అనుకున్నప్పుడు రవితేజనే హీరో. కానీ `చెప్పాలని ఉంది` సినిమాకు అసోసియేట్‌గా వినాయక్ వెళ్లడంతో రవితేజ ప్రాజెక్ట్ ప్రశ్నార్థకంలో పడింది. ఆ సమయంలో దానికి సాగర్ గారిని డైరెక్టర్‌గా ఫైనల్ చేసుకున్నాం.
అలా శిష్యుడితో అనుకున్న ప్రాజెక్ట్ గురువుతో మొదలు పెట్టాం. కానీ దీనికి కథ అందించింది మాత్రం వినాయకే. ఆ తరువాత రవితేజతో మరో సినిమా చేయాలనుకున్నాను. అది ఆలస్యం అవుతూ వచ్చింది. చివరికి `భగీరథ`తో కుదిరింది. అయితే ఈ సినిమా కారణంగా చాలా నష్టపోవాల్సి వచ్చింది. `బన్నీ` సినిమాకు ఎలాంటి డబ్బులు పెట్టకపోయినా భారీ లాభాల్ని ఆర్జించిన నేను `భగీరథ`తో ఆ వచ్చిన మొత్తాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది` అని ఆనాటి సంగతుల్ని వివరించారు మల్లిడి సత్యనారాయణ.
