మాస్ రాజా పొంగల్ టార్గెట్ సెట్టయ్యింది
మాస్ మహారాజా రవితేజ గత రెండు సంక్రాంతులలో భారీ హిట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు.
By: Tupaki Desk | 16 Jun 2025 11:15 PM ISTమాస్ మహారాజా రవితేజ గత రెండు సంక్రాంతులలో భారీ హిట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. అదే ఫాలోఅప్‌గా ఇప్పుడు మరోసారి సంక్రాంతి టార్గెట్ చేస్తూ ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను పట్టాలెక్కించారు. నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగి, చిత్రలహరి’ వంటి భావోద్వేగంతో కూడిన కుటుంబ కథలతో గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఈ రోజు నుంచి హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. రవితేజతో పాటు ప్రధాన తారాగణం కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదొక పర్ఫెక్ట్ పొంగల్ కుటుంబ కథా చిత్రం కానుందని మేకర్స్ చెబుతున్నారు. గత సినిమాలకంటే పూర్తి భిన్నంగా ఉంటుందని దర్శకుడు కిషోర్ ఇప్పటికే చెప్పినట్లు తెలుస్తోంది. వినోదంతో పాటు భావోద్వేగాలు కూడా ఉండేలా కథను సిద్ధం చేశారని సమాచారం.
ఈ సినిమాలో రవితేజ స్టైల్‌కు తగ్గట్టుగా మాస్ యాంగిల్, హ్యూమర్ ట్రాక్ రెండూ బలంగా ఉండేలా కథను డిజైన్ చేశారని మేకర్స్ చెబుతున్నారు. పల్లెటూరి నేపథ్యంలో రివర్స్ ఎమోషన్స్‌తో కూడిన కథనంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఫిలిం నగర్ సమాచారం. దీంతో ‘రాజా ది గ్రేట్’ తరహాలో ఓ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా మారే అవకాశాలున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌ను సుధాకర్ చెరుకూరి తన సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో ఇది మొదటిసారి రవితేజ నటిస్తున్న సినిమా కావడం విశేషం. ఈ కాంబినేషన్ మీద బాగా నమ్మకంగా ఉన్న నిర్మాత సుధాకర్, ఎలాంటి రాజీలు లేకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారట. ఈ చిత్రం 2026 సంక్రాంతి బరిలో దిగబోతుండటంతో ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన లుక్ పోస్టర్‌లో రవితేజ లగ్జరీ ప్రైవేట్ జెట్‌లో చొక్కా విప్పేసి రిలాక్స్ అవుతూ, స్పానిష్ నేర్చుకునే బుక్ చదువుతుండడం హైలెట్. ఇది కథకు ఏ విధంగా రిలేట్ అవుతుందో ఆసక్తిగా మారింది. ఓవైపు స్పానిష్ బుక్.. మరోవైపు గ్లామరస్ లుక్‌తో సిటింగ్‌లో కనిపించడం ఈ సినిమాలోని హీరో క్యారెక్టర్ మీద కురియాసిటీ పెంచేసింది. మొత్తానికి రవితేజ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫార్మాట్‌లోకి తిరిగి వచ్చి, బ్లాక్‌బస్టర్ బాట పట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మాస్, హ్యూమర్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నింటినీ మిక్స్ చేస్తూ ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. మరి సినిమా అనుకున్న సమయానికి రెడీ అవుతుందో లేదో చూడాలి.
