Begin typing your search above and press return to search.

వీరమల్లుతో మొదలు కానున్న రవితేజ మల్టీప్లెక్స్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో మహేష్‌ బాబు, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండతో పాటు మరికొందరు హీరోలకు సొంత థియేటర్‌లు లేదా మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి

By:  Tupaki Desk   |   29 Jun 2025 6:35 AM
వీరమల్లుతో మొదలు కానున్న రవితేజ మల్టీప్లెక్స్‌
X

టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో మహేష్‌ బాబు, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండతో పాటు మరికొందరు హీరోలకు సొంత థియేటర్‌లు లేదా మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మల్టీప్లెక్స్ చైన్‌ సంస్థ ఏసియన్‌ సినిమాస్‌ వారు హీరోలతో కలిసి మల్టీప్లెక్స్‌లను నిర్మిస్తుంది. ఇప్పటికే మహేష్ బాబుతో ఏఎంబీ, అల్లు అర్జున్‌తో ఏఏఏ, విజయ్ దేవరకొండతో కలిసి ఏవీడీని నిర్మించిన విషయం తెల్సిందే. కొన్ని నెలల క్రితం రవితేజతో కలిసి ఏసియన్ సునీల్‌ నారంగ్‌ మల్టీప్లెక్స్‌ను ప్రకటించిన విషయం తెల్సిందే. హైదరాబాద్‌ శివారు ప్రాంతం అయిన వనస్థలిపురంలో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరిగింది. ఈ మల్టీప్లెక్స్‌ను జులై నెలలో ప్రారంభించబోతున్నట్లు సమాచారం అందుతోంది.

ప్రస్తుతం చివరి దశ ఇంటీరియర్‌ వర్క్‌ జరుగుతోంది. ఏషియన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జులై నెలలో మల్టీప్లెక్స్‌ను ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. జులై నెలలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన హరి హర వీరమల్లు సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. జులై 24న విడుదల కాబోతున్న వీరమల్లు సినిమాతోనే రవితేజ మల్టీప్లెక్స్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ జులై లో ప్రారంభం అయితే కనుక కచ్చితంగా వీరమల్లు సినిమాను రవితేజ మల్టీప్లెక్స్‌లో స్క్రీనింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. అత్యాధునిక హంగులతో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరిగినట్లు సమాచారం అందుతోంది.

57 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్‌ను ఏఆర్‌కే మల్టీప్లెక్స్‌లో ఏర్పాటు చేయడం జరిగిందట. అంతే కాకుండా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి అద్భుతమైన సౌండ్ క్వాలిటీ వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. డాల్బీ అట్మాస్ సౌండ్‌ సిస్టమ్‌ను ఈ మల్టీప్లెక్స్‌లో ఏర్పాటు చేయడం జరిగిందట. హైదరాబాద్‌లోని ఇతర మల్టీప్లెక్స్‌లతో పోల్చితే ఈ మల్టీప్లెక్స్‌లో సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది అంటూ నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా టెస్ట్‌ నిర్వహించారని, త్వరలోనే ఇండస్ట్రీ ప్రముఖులతో ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం జరుగుతుంది అంటూ సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో మల్టీప్లెక్స్‌లకు ఆధరణ పెరిగిన నేపథ్యంలో రవితేజ మల్టీప్లెక్స్‌ కచ్చితంగా మంచి స్పందన దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

పవన్‌ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యి చాలా కాలం అయింది. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. జులై 24న విడుదల కాబోతున్న వీరమల్లు సినిమాకు క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమాకు ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత కీరవాణి సంగీతాన్ని అందించారు. నిధి అగర్వాల్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, గ్లిమ్స్ అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. పవన్‌ కళ్యాణ్‌ను గతంలో ఎప్పుడూ చూడని విధంగా, ఆయన ఎప్పుడూ నటించని పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. దాంతో అంచనాలు పెరిగాయి. పైగా ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.