Begin typing your search above and press return to search.

త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు త‌ప్ప‌క‌ చూపించాల్సిన సినిమా: `పెద్ది` థాంక్స్ మీట్‌లో నిర్మాత‌లు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో.. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన‌ `పెద్ది` చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగుల‌ను సాధించింది.

By:  Sivaji Kontham   |   9 Jun 2026 9:46 AM IST
త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు త‌ప్ప‌క‌ చూపించాల్సిన సినిమా: `పెద్ది` థాంక్స్ మీట్‌లో నిర్మాత‌లు!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో.. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన‌ `పెద్ది` చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగుల‌ను సాధించింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో చిత్ర యూనిట్ నిర్వహించిన `థాంక్స్ మీట్`లో నిర్మాతల భావోద్వేగ ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.వారంతం త‌రవాత సోమ‌వారం కూడా వ‌సూళ్లు బావున్నాయి... థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో మాస్ ఆద‌ర‌ణ‌తో క‌ళ‌గా క‌నిపిస్తుండ‌డం చూస్తుంటే సినిమా ఏ స్థాయిలో ప్ర‌జ‌ల‌కు క‌నెక్ట‌యిందో స్పష్టమైంద‌ని నిర్మాత‌లు ఆనందం వ్య‌క్తం చేసారు. ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్ల వేగం చూస్తుంటే థియేటర్లలో మళ్లీ సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తోందని సినీ వర్గాలు అంటున్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ అధినేత, చిత్ర‌ స‌మర్ప‌కుడు వై. రవిశంకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ...``ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఈ చిత్రాన్ని రెండోసారి వీక్షించినప్పుడు కూడా మొదటిసారి కలిగిన భావోద్వేగాలే మళ్లీ రిపీట్ అయ్యాయ``ని పేర్కొన్నారు. చిత్రంలో రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో పాత్రలో ఎంతగా లీనమైపోయారంటే.. సినిమా ముగిసి ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే నిజంగానే ఆయన కాలికి ఏదో అయ్యిందనే భ్రమలో ప్రేక్షకులు ఉండిపోతున్నారని కొనియాడారు. చరణ్ ఈ సినిమాను ఒంటికాలితో ముందుకు నడిపించారని ప్రశంసించారు. కథకు అసలైన మలుపు జగపతిబాబు పాత్రతోనే మొదలవుతుందని... ఇది ఆయన కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని రవిశంకర్ ప్ర‌శంసించారు.

దర్శకుడు బుచ్చిబాబు సానా ఒక సరికొత్త ఆలోచనతో... అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కథను తెరకెక్కించారని అభినందించారు. కొత్తదనం కోరుకునే యువతకు... భావోద్వేగాలను ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్‌కు `పెద్ది` ఒక అద్భుతమైన దృశ్యకావ్యమని పేర్కొన్నారు. ఈ చిత్రం భవిష్యత్తులో భారతీయ సినిమాకు ఒక రిఫరెన్స్ పాయింట్‌గా నిలిచిపోతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తపరిచారు. ముఖ్యంగా సమాజంలో ప్రతీ పేరెంట్ తమ పిల్లలకు తప్పకుండా చూపించాల్సిన అత్యంత స్ఫూర్తిదాయకమైన సినిమా ఇదని... ప్రతి ఒక్కరూ థియేటర్లలో ఈ అనుభూతిని సొంతం చేసుకోవాలని కోరారు.

`పెద్ది` నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఈ సినిమాపై చూపిస్తున్న ఆదరణను మాటల్లో వర్ణించలేనని ఎమోషనల్ అయ్యారు. మొదటి రోజు నుంచి కుటుంబాలు, పిల్లలు థియేటర్లకు క్యూ కడుతున్నారని... సౌత్ తో పాటు నార్త్ (హిందీ) బెల్ట్‌లోనూ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని హర్షం వ్యక్తం చేశారు. నిర్మాతగా తన తొలి ప్రయత్నంలోనే ఇంతటి చారిత్రాత్మక విజయం దక్కడం జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకమన్నారు. ఈ చిత్రం ద్వారా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని... పరిశ్రమ ఎప్పుడూ ఇలాగే కళకళలాడుతూ ఉండాలని ఆకాంక్షించారు.

మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ... తాము గత 24 ఏళ్లుగా సినీ పంపిణీ రంగంలో ఉంటూ ఎన్నో విజయాలను చూసినా.. `పెద్ది` వంటి గొప్ప సినిమాను పంపిణీ చేయడం ద్వారా లభించిన తృప్తి మరువలేనిదని పేర్కొన్నారు. ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లను అధిగమించడానికి క్రీడలు (ఆటలు) ఎంత అవసరమో ఈ చిత్రం ఎంతో నిజాయితీగా చర్చించిందని వివరించారు. రామ్ చరణ్ చూపించిన అంకితభావం.. ఆయన శారీరక మేకోవర్ నేటి యువతకు పెద్ద ఇన్‌స్పిరేషన్ అని కొనియాడారు. ఈ చిత్రానికి సుదీర్ఘమైన రన్ (లాంగ్ రన్) ఉంటుందని...ఇది చరణ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ వ‌సూళ్ల‌ రికార్డులను సృష్టించే దిశగా దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేశారు.