నిర్మాతగా మొదటి సినిమాను అనౌన్స్ చేసిన కోలీవుడ్ స్టార్
కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కలై సెల్వన్ శివాజీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా, అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్ హర్ష వర్ధన్ సంగీతం అందించనున్నాడు.
By: Tupaki Desk | 9 Jun 2025 11:30 PM ISTగత కొన్నాళ్లుగా కోలీవుడ్ స్టార్ యాక్టర్ రవి మోహన్ పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది. అతని భార్య ఆర్తికి ఏ మాత్రం చెప్పకుండా ఆమె నుంచి విడాకులు ప్రకటించి సంచలనం సృష్టించిన రవి మోహన్, ఆ తర్వాత విడాకుల కోసం కోర్టుకెళ్లడం, విడాకులకు మొదట్లో ఆర్తి ఒప్పుకోకపోయినా ఆ తర్వాత రూ.40 లక్షలు భరణం అడిగి విడాకులకు ఒప్పుకున్నట్టు వార్తలొచ్చాయి.
భార్య ఆర్తి నుంచి విడాకుల తర్వాత సింగర్ కేనీషాతో రవి మోహన్ డేటింగ్ లో ఉన్నాడని వార్తలు రావడం, ఆ వార్తలకు తగ్గట్టే వారిద్దరూ కలిసి చెన్నైలో ఓ పెళ్లికి వెళ్లడంతో ఆ డేటింగ్ వార్తలు మరింత ఊపందుకున్నాయి. అయితే ఈ వివాదం తర్వాత రవి మోహన్ ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెడుతున్నట్టు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. రవి మోహన్ స్టూడియోస్ పేరుతో బ్యానర్ ను స్థాపించిన ఈ కోలీవుడ్ స్టార్ ఆ బ్యానర్ లో తన మొదటి సినిమాను అనౌన్స్ చేశాడు.
డైరెక్టర్ కార్తీక్ యోగి తో రవి మోహన్ నిర్మాతగా తన మొదటి సినిమాను చేయబోతున్నాడు. రవి మోహన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ఈ సినిమాకు బ్రో కోడ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఎస్‌జె సూర్య కూడా నటిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. నలుగురు ప్రముఖ మహిళా నటీమణులు కూడా బ్రో కోడ్ లో నటించనుండగా, వారెవరనేది త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిపారు.
కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కలై సెల్వన్ శివాజీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా, అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్ హర్ష వర్ధన్ సంగీతం అందించనున్నాడు. రవి మోహన్ కు ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని, కథ విన్న వెంటనే బ్రో కోడ్ ను నిర్మించడానికి ముందుకొచ్చారని, ఈ సినిమాను ఆడియన్స్ కు ఓ స్పెషల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా రూపొందిస్తున్నామని డైరెక్టర్ కార్తీక్ యోగి తెలిపారు.
ఇక రవి మోహన్ సినిమాల విషయానికొస్తే బ్రో కోడ్ కాకుండా ఆయన పరాశక్తి అనే సినిమాలో నటిస్తున్నాడు. సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రవి మోహన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం పరాశక్తి సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, వచ్చే ఏడాది సంక్రాంతికి పరాశక్తి రిలీజ్ కానుంది.