హీరోకి జ్వరం వచ్చేంతగా.. ఇంటెన్స్ సీన్‌లో నటి ప్రతాపం!
సెల్వరాఘవన్ దర్శకత్వంలో 2004లో విడుదలైన `7/జి బృందావన కాలనీ` (తమిళంలో 7జి రెయిన్‌బో కాలనీ) సౌత్ ఇండియాలోనే ఒక కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది.
By: Tupaki Desk | 5 May 2026 4:00 AM ISTసెల్వరాఘవన్ దర్శకత్వంలో 2004లో విడుదలైన `7/జి బృందావన కాలనీ` (తమిళంలో 7జి రెయిన్‌బో కాలనీ) సౌత్ ఇండియాలోనే ఒక కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది. రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టడమే కాకుండా.. నేటికీ యువతరం ఫేవరెట్ సినిమాల జాబితాలో ఉంది. ఈ సినిమాలోని నటీనటుల ప్రదర్శనలో సహజత్వం... యువన్ శంకర్ రాజా సంగీతం ప్రేక్షకులను కట్టిపడేశాయి. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని హీరో రవికృష్ణ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షేర్ చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రం అంత పెద్ద విజయం సాధించడానికి ప్రధాన కారణం హీరో హీరోయిన్ల మధ్య పండించిన ఇంటెన్స్ కెమిస్ట్రీ. ముఖ్యంగా సోనియా అగర్వాల్ తన పాత్రలో ఒదిగిపోయి జీవించారు. ఒక పాట చిత్రీకరణ సమయంలో దర్శకుడు సెల్వరాఘవన్ సూచనల మేరకు సోనియా అగర్వాల్ తన గోళ్లతో రవికృష్ణను రక్కాల్సి వచ్చింది. ఆ సన్నివేశం మరింత సహజంగా రావడం కోసం సోనియా చాలా ఇంటెన్స్‌తో నటించారు. అయితే ఆ సీన్ పూర్తయ్యేసరికి రవికృష్ణ పరిస్థితి దారుణంగా తయారైంది.
రవికృష్ణ ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. ``ఆ సన్నివేశం ముగిసిన తర్వాత నా వీపు అంతా సోనియా గోరు గాయాలతో నిండిపోయింది. ఆ గాయాల వల్ల నా వీపు వాచిపోయి... చివరికి నాకు జ్వరం వచ్చేంత పని అయ్యింది`` అని చెప్పుకొచ్చారు. కేవలం ఒక సీన్ కోసం ఆ నటి చూపించిన అంకితభావం సరే కానీ.. పాపం ఆ ఇంటెన్సిటీ రవికృష్ణను శారీరకంగా ఇబ్బంది పెట్టడం బాధాకరమే. అయితే సినిమా అవుట్‌పుట్ కోసం వారంతా అలా కష్టపడ్డారు. డెబ్యూ హీరో అయినా రవికృష్ణ కూడా ఎక్కడా తగ్గకుండా అద్భుత నటనను కనబరిచారు.
దర్శకుడు సెల్వరాఘవన్ మధ్యతరగతి జీవితాలను... తండ్రి-కొడుకుల అనుబంధాన్ని ఈ సినిమాలో చాలా హృద్యంగా ఆవిష్కరించారు. సోనియా అగర్వాల్‌ను తన సినిమాల ద్వారా వెండితెరకు పరిచయం చేసిన సెల్వా.. ఆ తర్వాత తననే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వం వైపు మళ్లీ దృష్టి సారించి `7/జి బృందావన కాలనీ` చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
రెండు దశాబ్దాల తర్వాత కూడా ఈ సినిమా గురించి రవికృష్ణ షేర్ చేసిన విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమా పార్ట్-2 వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు రావడంతో అభిమానులు సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ రెండో భాగం కూడా మొదటి భాగం లాగే ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.
