'రామాయణ' లక్ష్మణుడి గురించి తెలుసా...?
నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో అత్యంత కీలకమైన లక్ష్మణుడి పాత్రను బాలీవుడ్ నటుడు రవి దూబే పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 5 July 2025 11:06 AM ISTఇండియన్ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'రామాయణ' ఒకటి. రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటిస్తుండగా, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్న విషయం తెల్సిందే. రెండు పార్ట్‌లుగా రాబోతున్న ఈ సినిమా మొదటి పార్ట్‌ను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్‌ను షేర్ చేశారు. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో అత్యంత కీలకమైన లక్ష్మణుడి పాత్రను బాలీవుడ్ నటుడు రవి దూబే పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
రవి దూబే బాలీవుడ్‌లో కాలా షా కాలా సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాడు. అంతుకు ముందు ఈయన బుల్లి తెరపై సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్నాడు. ఈ 41 ఏళ్ల నటుడు 2006లో స్త్రీ తేరీ కహానీ అనే సీరియల్‌లో రవి పాత్రలో నటించి నటుడిగా ప్రస్థానంను మొదలు పెట్టాడు. కెరీర్ ఆరంభం నుంచే బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. నటుడిగా తన స్థాయిని పెంచుకుంటూ వచ్చిన రవి దూబే బాలీవుడ్‌లోనూ ఆఫర్లు సొంతం చేసుకున్నాడు. బుల్లి తెర నుంచి వెండి తెరపై ఎంట్రీ ఇవ్వాలంటే మంచి పాత్ర కోసం ఎదురు చూశాడు. నటుడిగా తనకు మరింతగా గుర్తింపు తెచ్చి పెట్టే విధంగా లక్ష్మణుడి పాత్రకు ఓకే చెప్పాడు.
బుల్లి తెరపై సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ నటుడు వెండి తెరపై మొదటి సారి లక్ష్మణుడి పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇతడు నిర్మాతగా మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఈ మధ్య కాలంలో రవి దూబే ఆస్తుల గురించి కూడా ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ కథనం అనుసారం రవి దూబే, ఆయన భార్య సర్గున్ మెహతాలకు ఏకంగా రూ.150 కోట్ల నికర ఆస్తులు ఉన్నాయట. ఎంటర్‌టైన్మెంట్ రంగంలోనే కాకుండా వీరిద్దరూ వివిధ వ్యాపారాల్లోనూ భాగస్వామ్యులుగా ఉన్నారని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దాంతో వీరి ఆస్తులు అనధికారికంగా వెయ్యి కోట్లు ఉంటాయని కూడా కొందరు అంటున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్‌లో జన్మించిన రవి దూబే ఢిల్లీలో పెరిగాడు. మోడల్‌గా, టెలివిజన్ ప్రజెంటర్‌గా, నిర్మాతగా రెండు దశాబ్దాలుగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో రవి దూబే ఉంటున్నాడు. ఢిల్లీలోని రియల్ ఎస్టేట్ సంస్థల్లో మొదట్లో పని చేసిన అనుభవంతో నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ వ్యాపార రంగంలో కొనసాగుతూ వచ్చాడు. దాంతో ముంబైతో పాటు ఎన్నో ప్రైమ్ ఏరియాల్లో రవి దూబేకి ఖరీదైన భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయని సమాచారం. పెళ్లి తర్వాత కూడా రవి దూబే నటుడిగా, నిర్మాతగా మరింత బిజీ అయ్యాడు. నిర్మాతగానూ రవి దూబే మంచి పేరును సొంతం చేసుకున్నాడు. దాంతో రవి దూబే ఇండస్ట్రీలో చాలా స్పెషల్, అలాంటి రవి దూబే రామయణ సినిమాలో లక్ష్మణుడిగా నటిస్తున్న నేపథ్యంలో ఆతడి క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం.
