ఉదయ్‌పూర్ వెడ్డింగ్ నుంచి ఊరి గృహప్రవేశం వరకు… సంప్రదాయాలకు కట్టుబడిన జంట
పెళ్లి తర్వాత సినీ సెలబ్రిటీలు ఎలా లైఫ్ ను స్టార్ట్ చేస్తారనే దానిపై అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది.
By: Sravani Lakshmi Srungarapu | 4 March 2026 12:12 PM ISTపెళ్లి తర్వాత సినీ సెలబ్రిటీలు ఎలా లైఫ్ ను స్టార్ట్ చేస్తారనే దానిపై అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. స్టార్‌డమ్ మధ్య సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ తమ కొత్త జీవితాన్ని ఆరంభించిన జంటగా రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ఇప్పుడు ప్రత్యేకంగా నిలుస్తున్నారని చెప్పొచ్చు. ఫిబ్రవరి 26న ఉదయపూర్ లో వారి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట వేస్తున్న ప్రతీ అడుగు సంప్రదాయ విలువలను ప్రతిబింబిస్తోంది.
విజయ్ సొంత ఊరిలో వ్రతం
పెళ్లి వేడుకల తర్వాత ఈ జంట వెంటనే దాంపత్య జీవిత ప్రారంభానికి అవసరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి, విజయ్ సొంత ఊరిలో కట్టుకున్న కొత్త ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు కేవలం ఆచారాలు మాత్రమే కాకుండా, వారి కుటుంబాలకు ఉన్న సాంప్రదాయ బంధాన్ని కూడా స్పష్టం చేశాయి.
మూలాలను మరవని జంట
సినీ జీవితంలోని గ్లామర్‌కు భిన్నంగా, ఈ సెలబ్రేషన్స్ పూర్తిగా కుటుంబ వాతావరణంలో సాగాయి.
పెళ్లి తర్వాత విజయ్ తన స్వగ్రామానికి వెళ్లడం మరో ముఖ్యాంశంగా నిలిచింది. విజయ్ తన మూలాలను మరవకుండా, భార్య రష్మికతో కలిసి స్వగ్రామాన్ని సందర్శించడం ద్వారా కుటుంబానికి, ఊరి పట్ల గౌరవాన్ని తెలియచేస్తోంది. అక్కడ గ్రామ పెద్దలను కలవడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం లాంటి అంశాలు ఈ కొత్త జంటకు కుటుంబ విలువలు ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నాయి. స్టార్లుగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నప్పటికీ, తమ ఆరంభాలను గుర్తుంచుకోవడం ద్వారా ఫ్యాన్స్ కు ఒక మెసేజ్ ఇచ్చినట్టయ్యింది.
తాళి, నుదుటిన సింధూరంతో రష్మిక
ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇస్తూ, పెళ్లి తర్వాత ఈ జంట హైదరాబాద్‌లోని టీటీడీ టెంపుల్ ను కూడా సందర్శించి, ప్రత్యేక దర్శనం తర్వాత అక్కడి భక్తులకు స్వీట్లు పంచి, తమ ఆనందాన్ని పంచుకున్నారు. మీడియా, అభిమానులతో సౌమ్యంగా ముచ్చటించడం ద్వారా తమ ఆనందాన్ని సరళంగా వ్యక్తం చేశారు. వివాహానంతరం దేవాలయ దర్శనం చేయడం భారతీయ సంప్రదాయంలో ఒక ముఖ్య భాగం. అదే మార్గాన్ని అనుసరించడం ద్వారా వారు సంప్రదాయాల పట్ల తమ నిబద్ధతను మరోసారి చూపించారు. సెలబ్రిటీ ప్రపంచంలో పెళ్లి తర్వాత సంప్రదాయ చిహ్నాలనైన తాళి, నుదుటిన కుంకుమ లాంటి సంప్రదాయాలను చాలా తక్కువ మంది మాత్రమే పాటిస్తూ ఉంటారు. నిరంతరం స్పెషల్ గా షూటింగ్స్, బ్రాండ్ కమిట్‌మెంట్స్, గ్లామర్ ఇమేజ్ వంటి కారణాలతో చాలామంది తారలు తాళి, నుదుటి సింధూరం వంటి వాటిని పబ్లిక్‌గా ప్రదర్శించకుండా ఉంటారు. కానీ రష్మిక మాత్రం ఈ విషయంలో భిన్నంగా నిలుస్తోంది. పెళ్లి తర్వాత ఆమె తాళి, నుదుటి బొట్టుతో గర్వంగా కనిపించడం ద్వారా దాంపత్య బంధాన్ని స్పష్టంగా ఆవిష్కరిస్తోంది.
మొత్తానికి పెళ్లి తర్వాత విజయ్, రష్మిక జంట ఆర్భాటాలకు దూరంగా, ఫ్యామిలీ, ఆధ్యాత్మికత వైపు ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రేమ కథగా మొదలైన వారి జర్నీ ఇప్పుడు ఫ్యామిలీ వాల్యూస్, డివోషనల్ వైపు వెళ్తోంది. స్టార్లుగా కాకుండా, సాధారణ దంపతుల లాగా సంప్రదాయాలను గౌరవిస్తూ లైఫ్ ను స్టార్ట్ చేసిన ఈ జంట, ఫ్యాన్స్ లో మరింత గౌరవాన్ని సంపాదించుకుంటుంది.
