ట్రోల్స్ నుంచి అవార్డు వరకు.. గద్దర్ వేదికపై రష్మిక ఎమోషనల్
ఈ స్పెషల్ మూమెంట్ లో రష్మిక తన భర్త విజయ్ దేవరకొండ తల్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
By: M Prashanth | 20 March 2026 10:03 AM ISTహైదరాబాద్‌లో జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో రష్మిక మందన్న ఒక ఎమోషనల్ స్పీచ్‌తో అందరినీ కదిలించారు. 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాకు గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న రష్మిక, స్టేజ్ మీద తన గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఒకవైపు చేతిలో ప్రతిష్టాత్మకమైన అవార్డు, మరోవైపు ఎదురుగా కూర్చున్న తన కుటుంబ సభ్యుల ముందు ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
రష్మిక గ్లామరస్ హీరోయిన్‌గానే కాకుండా, తన నటనను నిరూపించుకోవడానికి ఎంత కష్టపడిందో ఆ మాటల్లో కనిపించింది. రష్మిక మాట్లాడుతూ.. "ఒకప్పుడు నా నటనను చూసి చాలామంది ట్రోల్ చేశారు. కానీ ఈరోజు అదే నటనకు గుర్తింపుగా ప్రభుత్వం నాకు ఈ అవార్డు ఇచ్చింది. నేను చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను" అని చెప్తుంటే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న విమర్శలు ఆమెను ఎంతగా బాధించాయో ఆ క్షణం అక్కడ ఉన్న వారందరికీ అర్థమైంది. విమర్శలను ఎదుర్కొంటూ, నిరంతరం తనను తాను మెరుగుపరుచుకుంటూ ఈ స్థాయికి వచ్చినట్లు అర్ధమవుతుంది.
ఈ స్పెషల్ మూమెంట్ లో రష్మిక తన భర్త విజయ్ దేవరకొండ తల్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
"కొన్ని ఏళ్ల క్రితం నేను ఈ ప్రాంతానికి కోడలిగా రాకముందే, ఇక్కడి వారు నన్ను సొంత కూతురిలా ప్రేమించారు. ఇప్పుడు అఫీషియల్ గా కోడలిగా మీ ముందు నిలబడటం నాకు చాలా గర్వంగా ఉంది" అని చెప్పారు. ఈ మాటలు విన్నప్పుడు గ్యాలరీలో ఉన్న రష్మిక అత్తగారు మాధవి గారు ఆనందంతో కన్నీళ్లు తుడుచుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం చూసి ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు.
కేవలం తన గురించే కాకుండా తన ఫ్యామిలీని కూడా ఇలాగే ప్రేమగా చూసుకోవాలని రష్మిక విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గురించి చెబుతూ.. 'ది గర్ల్‌ఫ్రెండ్' వంటి అద్భుతమైన సినిమా తీసి తనలోని నటిని కొత్తగా చూపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా తనకు ఒక కొత్త కాన్ఫిడెన్స్ ఇచ్చిందని, ఇలాంటి మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి ఈ అవార్డు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. స్టేజ్ మీద రష్మిక ఇస్తున్న స్పీచ్ చూసి రామ్ చరణ్ వంటి తోటి నటీనటులు కూడా చప్పట్లతో ఆమెను అభినందించారు.
ఎమోషనల్ గా ఉన్నప్పటికీ, తనదైన శైలిలో సరదాగా ముగింపు ఇచ్చారు రష్మిక. " ఇప్పుడు ఇంటికి వెళ్లి గ్రాండ్‌గా పార్టీ చేసుకుందాం" అని నవ్వుతూ చెప్పారు. రష్మిక మాటలకు ఆమె అత్తగారు మురిసిపోతూ చప్పట్లు కొట్టడం ఆ వేదికపై ఒక ముచ్చటైన దృశ్యంలా నిలిచిపోయింది. ఒక నటిగా తన మీద ఉన్న బాధ్యతను గుర్తిస్తూనే, కుటుంబం పట్ల ఉన్న ప్రేమాభిమానాలను రష్మిక చాలా హుందాగా చాటుకున్నారు.
విజయ్ దేవరకొండ తన భార్య ఎదుగుదలను చూస్తూ ఎంతో గర్వంగా పక్కనే ఉండి ప్రోత్సహించడం గమనార్హం. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో రష్మిక మందన్న ఒక నటిగా తన గెలుపును సెలబ్రేట్ చేసుకున్నారు. ట్రోల్స్ చేసిన వారికి తన పనితోనే సమాధానం చెప్పానని ఆమె మాటలు నిరూపించాయి. ఈ అవార్డు ఆమెకు రావడం పట్ల అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ప్రయోగాత్మక చిత్రాలు చేయాలనే ఆమె అలోచనకు ఈ అవార్డు మరింత బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు.
