మళ్లీ బాలీవుడ్ లో బిజీ కానున్న రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్ లో ఇప్పటికే పలు సినిమాలు చేసింది. కానీ వాటిలో యానిమల్, ఛావా సినిమాలు రష్మికకు నెక్ట్స్ లెవెల్ క్రేజ్ ను తెచ్చి పెట్టాయి
By: Tupaki Desk | 4 Jun 2025 8:00 PM ISTనేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్ లో ఇప్పటికే పలు సినిమాలు చేసింది. కానీ వాటిలో యానిమల్, ఛావా సినిమాలు రష్మికకు నెక్ట్స్ లెవెల్ క్రేజ్ ను తెచ్చి పెట్టాయి. యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్ సరసన నటించిన రష్మిక, ఛావాలో విక్కీ కౌశల్ సరసన ఛత్రపతి శంభాజీ మహారాజ్ భార్యగా నటించి బాలీవుడ్ లో తిరుగులేని స్టార్‌డమ్ ను దక్కించుకుంది.
ఈ రెండూ కాకుండా రష్మిక ఇప్పటివరకు బాలీవుడ్ లో చేసిన గుడ్ బై, మిషన్ మజ్ను, సికందర్ సినిమాలు భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సాధించుకోలేకపోయాయి. యానిమల్, ఛావా సినిమాలతో వరుస సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్న రష్మిక బాలీవుడ్ లో చేసిన ఆఖరి సినిమా సికందర్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయంగా నిలిచింది.
సికందర్ ఫ్లాప్ అయినప్పటికీ బాలీవుడ్ లో రష్మిక క్రేజ్ ఏమీ తగ్గలేదు. ఇప్పుడు రష్మిక మళ్లీ బాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేయడానికి రెడీ అయింది. తాజా సమాచారం ప్రకారం, రష్మిక త్వరలోనే కాక్‌టెయిల్2 సెట్స్ లో జాయిన్ కాబోతుందని తెలుస్తోంది. దినేషన్ విజన్, లవ్ రంజన్ నిర్మించిన కాక్‌టెయిల్ సినిమా సెకండ్ ఫ్రాంచైజీ లో రష్మిక నటించనుంది.
షాహిద్ కపూర్, కృతి సనన్ తో పాటూ రష్మిక కూడా ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించనుంది. ఈ సినిమాను యూరప్ మరియు ఇండియాలోని కొన్ని కొత్త ప్రదేశాల్లో షూట్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఈ సినిమా స్క్రిప్ట్ ను ఎంటర్టైన్‌మెంట్, కామెడీ, ఎమోషన్స్ తో నింపి మరీ లవ్ రంజన్ రెడీ చేశాడని, 2026లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం.
దీంతో పాటూ ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న థామా సినిమాలో కూడా రష్మిక నటిస్తోంది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మడోక్ ఫిల్మ్స్ బ్యానర్ లో దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా థామా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి రష్మికకు ఫ్లాపులొచ్చినా తన క్రేజ్ మాత్రం బాలీవుడ్ లో ఏ మాత్రం తగ్గలేదని తన వరుస ఆఫర్లు చూస్తుంటే అర్థమవుతుంది. ఇవి కాకుండా తెలుగులో కుబేరతో పాటూ రాహుల్ రవీంద్రన్ గర్ల్‌ఫ్రెండ్ సినిమా మరియు రెయిన్ బో అనే సినిమాలు రష్మిక చేతిలో ఉన్న సంగతి తెలిసిందే.
